మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 28: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నగరాభివృద్ధికి రూ.10వేల కోట్లను 2024-25 బడ్జెట్‌లో తమ ప్రభుత్వం కేటాయించిందన్నారు. ప్రపంచ స్థాయి నగరాలైన న్యూయార్క్, లండన్, టోక్యో నగరాలతో పోటీపడేలా పర్యావరణహిత నెట్ జీరో సిటీగా 30వేల ఎకరాల్లో ‘ఫ్యూచర్ సిటీ’ పేరిట నాలుగో నగరాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. లి‘శిల్పా లేఅవుట్ ఫేజ్-2 పీజేఆర్ ఫ్లై ఓవర్’ను వ్యూహాత్మక రహదారి అభివృద్ధి కార్యక్రమం కింద రూ.182.72 కోట్లతో కొండాపూర్ నుంచి గచ్చిబౌలి ఔటర్ వరకు ఫైఓవర్ నిర్మించామన్నారు. సమయం ఆదా చేయడమంటే ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడమేనని, ఆ లక్ష్యమే ఈ ఫ్లైఓవర్ వెనుకున్నదని అన్నారు. చివరి క్షణం వరకూ పేదలు, నగరాభివృద్ధి కోసం పాటుపడిన వ్యక్తి పి.జానార్థన్ రెడ్డి అని, అలాంటి మహా నాయకుడి పేరును ఈ ఫ్లైఓవర్‌కు పెట్టడం అంటే అది ఆయనకు మనమిచ్చే గొప్ప గౌరవం అని అన్నారు. ఓఆర్‌ఆర్ నుంచి కొండాపూర్, హఫీజ్‌పేట్ వైపు వెళ్లే వాహనాలకు ఇది అనుకూలంగా ఉంటుందని, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు మెరుగైన కనెక్టివిటీ లభిస్తుందని వివరించారు. కొందరు పనిగట్టుకుని తమ స్వార్థ రాజకీయాల కోసం తమపై దుష్ప్రచారం చేస్తున్నారని, బట్టకాల్చి మీదేస్తున్నారని, తర్వాత వాళ్లు కడుక్కుంటారులే అంటూ బురద చల్లుతున్నారని విమర్శించారు. మొన్నటి మొన్న హెచ్‌సీయూ భూముల విషయంలో ఎలాంటి విష ప్రచారం చేశారో ప్రజలంతా గమనించారు. అది ప్రభుత్వ భూమి. అక్కడ కొత్తగా ఐటీ హబ్‌ను అభివృద్ధి చేసి రెండు లక్షల నుంచి మూడు లక్షల మంది యువతకు ఉపాధి కల్పించాలనుకున్నాం.. కానీ ఏఐ లాంటి కొత్తరకం టెక్నాలజీతో లేని ఏనుగులను అక్కడున్నట్లు సృష్టించారు.. ఎక్కడో చనిపోయిన జింకలను ఇక్కడే చనిపోయినట్లు తప్పుడు ప్రచారం చేశారు.. నిన్నటికి నిన్న వేసవిలో జంట నగరాల్లో తాగునీటి సమస్య ఏర్పడుతుందంటూ గగ్గోలు పెట్టారు.. ఎలాంటి సమస్య తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో వారి కుట్రలు పనిచేయలేదు. అని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఇలాంటి కుట్రలు, కుతంత్రాలకు భయపడేది లేదని, అభివృద్ధి విషయంలో వెనుకడుగేసే ప్రసక్తి లేదని అన్నారు.. రూ.24,237 కోట్లతో హైదరాబాద్ మెట్రో రెండో దశ పనులకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందని, ఈ ప్రాజెక్టుకు సహకరించాలని కేంద్రాన్ని కోరితే కనీసం పట్టించుకోలేదని, ఒక్క రూపాయి ఇవ్వలేదని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. తెలంగాణ కూడా ఈ దేశ భూభాగంలోనే ఉందన్నాం. మెట్రోకు నిధులిచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. హైదరాబాద్‌లో వాహనాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నందున ప్రతి ట్రాఫిక్ సిగ్నల్‌ను ఏఐ టెక్నాలజీ సాయంతో స్మార్ట్ సిగ్నల్‌గా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. ఈ వేదికగా ఒక్క మాట చెప్పదల్చుకున్నా.. మన తెలంగాణ కోసం అహర్నిశలు శ్రమించే ప్రజా ప్రభుత్వం.. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే బాధ్యత మాది. మా ప్రభుత్వంపై భరోసా ఉంచి ఆశీర్వదించాలి సహకరించాలి అని ప్రజలందర్నీ కోరుతున్నానన్నారు.