‌ప్రజల మనిషి..పేదల పక్షపాతి…

•ప్రజా సమస్యలపైనే ధ్యాస.. పని రాక్షసుడు సత్తన్న
•అక్రమాలు సహించడు.. అధికారులను నిద్రపోనివ్వడు
•రోజుకు 18 గంటలు ప్రజలతోనే..
•తీసుకున్న ప్రతి దరఖాస్తుకు జవాబుదారీతనం
•అంచనాలకు మించి ప్రజారంజక పాలన
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
•ఏడాది పనితీరుకు ‘‘ప్రజాతంత్ర’’ అక్షర రూపం.
.

చిట్యాల, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2 : ‌పారిశ్రామిక ప్రాంతమైన భూపాలపల్లి నియోజకవర్గానికి పేదల పక్షపాతి, అభివృద్ధి ప్రదాత దొరికాడు. ప్రజా సమస్యల పరిష్కారంలో రోజుకు 18 గంటలు పనిచేసే నాయకుడు ఉద్భవించాడు. పేద ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా నిరం తరం శ్రమించే పని రాక్షసుడు ప్రజలకు లభించాడు. రెండు దశాబ్దాలపాటు ప్రజాక్షేత్రంలో పోరాడి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ శాసనసభలో అడుగిడిన గండ్ర సత్యనారాయణరావు ఏడాది పరిపాలనకు ప్రజల నుంచి ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. మాట తప్పడు..మడమ తిప్పడు అనే పదానికి నూరుశాతం న్యాయం చేస్తున్న సత్యనారాయణరావుకు పేదల కష్టాలే ఆస్తులుగా.. వారి శ్రేయస్సే అంతస్తులుగా, ఇచ్చిన మాట ప్రకారం అహర్నిశలు శ్రమిస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఏడాది పాలనపై ప్రజాతంత్ర ప్రత్యేక కథనం.. జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని బుద్ధారం గ్రామ సర్పంచ్‌ ‌గా మూడు దశాబ్దాల క్రితం రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన గండ్ర సత్యనారాయణరావు.. జడ్పిటిసిగా, అప్పటి ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా అంచలంచెలుగా ఎదిగారు. మూడు పర్యాయాలు అసెంబ్లీ బరిలో నిలిచారు. ఒకసారి టిక్కెట్‌ ‌దక్కకపోగా రెండు పర్యాయాలు ఓటమి చెందారు. ఓటమిని స్ఫూర్తిగా తీసుకుని మరింత పట్టుదలతో గెలుపు కోసం కష్టపడి విజయతీరాలకు చేరారు. ఓడిన ప్రతిసారీ మరింత పట్టుదలతో కార్యకర్తలకు చేరువయ్యారు.

ఆయన రాజకీయ ఎదుగుదలకు భూపాలపల్లి ప్రాంతం నియోజకవర్గంగా ఏర్పాటు కావడం కూడా కారణమే. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా భూపాలపల్లి కొత్త అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పడింది. ఇప్పటి వరకు మూడు పర్యాయాలు భూపాలపల్లి శాసనసభకు ఎన్నికలు జరగగా ఒకసారి గండ్ర వెంకటరమణారెడ్డి, మరొకసారి సిరికొండ మధుసూదనాచారి విజయం సాధించారు. ఎన్నికలు జరిగిన ఆ రెండు పర్యాయాలు గండ్ర సత్యనారాయణరావు రెండవ స్థానంలో నిలిచారు. రెండు పర్యాయాలు ఓటమి చెందినా మొక్కవోని ధైర్యంతో ముందుకెళుతూ పట్టువదలని విక్రమార్కుడిలా మూడోసారి పోటీపడి విజయాన్ని దక్కించుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ ‌రాజశేఖర్‌ ‌రెడ్డి ప్రవేశపెట్టిన 108 వాహనం లాగానే భూపాలపల్లి నియోజక వర్గం సంఖ్య కూడా 108 కావడం విశేషం.

అలాగే సత్యనారాయణరావు కూడా ఎమ్మెల్యేగా గెలిచిన నుంచి ప్రజలకు 108 లాగానే నిత్యం అందుబాటులో ఉంటున్నారు. గతేడాది డిసెంబర్‌ 3‌న వెలువడిన సాధారణ ఎన్నికల ఫలితాల్లో గెలుపొందిన సత్యనారాయణరావు డిసెంబర్‌ ఏడో తేదీన ప్రమాణస్వీకారం చేశారు. నేటికీ ఆయన గెలుపొంది ఏడాది కాలం పూర్తయింది. ప్రజా సమస్యల పట్ల పట్టు కలిగి ఉండడం ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం కూడా ఆయనకు కలిసి వస్తున్నది. దీంతో గెలిచినదే తడవుగా ప్రజా సమస్యల్లో తల మునకలై ఎమ్మేల్యే పనిచేస్తున్నారు. నిత్యం నియోజకవర్గ అభివృద్ధి పైనే దృష్టి సారిస్తూ సత్య నారాయణరావు పనిచేయడం ఇక్కడి ప్రజల అదృష్టంగా పలువురు చర్చించుకుంటున్నారు. మూడు పర్యాయాలు పోరాడి ఎమ్మెల్యేగా గెలుపొందిన సత్యనారాయణరావు విజయోత్సవాలను పక్కన పెట్టి నిత్యం ప్రజల్లో మెదులుతూ వారి సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని అనడంలో సందేహం లేదు. కాగా దివంగత కమ్యూనిస్టు యోదుడు, పార్లమెంట్‌ ‌సభ్యుడు, పుచ్చలపల్లి సుందర రామిరెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని గండ్ర సత్యనారాయణరావు ప్రజలతో మమేకమవుతున్నారని పలువురు ఈ  సంద్భంగా చర్చించుకుంటున్నారు.

సిపిఏం నేత పుచ్చలపల్లి సుందరయ్య గురించి రాజకీయ నాయకులకు తెలియనిది కాదు. తన నియోజకవర్గంలోని సమస్యలను అసెంబ్లీ దాకా మోసుకెల్లి ఒక్కో సమస్యపైన సమస్య పరిష్కారం అయ్యేంతవరకు వెంటపడేవాడని నాటి రాజకీయ నేతలు ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. అయితే సత్యనారాయణరావు గాంధేయ మార్గంలో నడిచే జాతీయ పార్టీలో కొనసాగుతున్నప్పటికీ కమ్యూనిస్టు భావజాలం కలిగిన నాయకుడు. దీంతో గండ్ర సత్యనారాయణరావు కూడా సుందరయ్య బాటలోనే నడుస్తున్నాడని విశ్లేషకులు చెబుతున్నారు. డిసెంబర్‌ 7‌న ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సంవత్సర కాలంలో చేసిన పనులను చూసి ఆయన పనితీరు అబ్బుర పరుస్తున్నదని పలువురు చర్చించుకుంటున్నారు. గెలిచిన నాటి నుండి ప్రతినిత్యం ప్రజాక్షేత్రంలో సత్యనారాయణరావు 18 గంటలు అందుబాటులో ఉంటున్నారు. ఉదయం లేవగానే ఎనిమిది గంటలకు ప్రజల్లోకి వస్తే రాత్రి 12 గంటల వరకు పనిచేసే నాయకునిగా సత్యనారాయణరావుకు  పేరు వచ్చింది. ప్రతి చిన్న సమస్యను పట్టించుకుంటూ సంబంధిత అధికారులను  ఆదేశిస్తున్నారు. ఈ నేపద్యంలోనే సత్యనారాయణరావు పనితీరు చూసిన ప్రజలు భూపాలపల్లికి మరో పుచ్చలపల్లి దొరికినట్లు భావిస్తున్నారు. తన దగ్గరికి వచ్చే వేలాది దరఖాస్తులను సెక్రటేరియట్‌ ‌కు తీసుకెళ్లి వివిధ విభాగాలకు చేరవేస్తూ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు వెంటపడుతున్న నేతగా సత్యనారాయణరావు నిలుస్తున్నాడు.

-ఆర్భాటాలు, అలంకరణలకు దూరం...
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకు పొగడ్తలు, పెద్ద పెద్ద కాన్వాయిలు, బాజాభజంత్రీలు, స్వాగతాలు నచ్చదు. ఈ ప్రాంతంలో పనిచేసి, పదవులు పొందిన కొంతమంది నాయకులకు భజనలు ఇష్టం. అయితే అందుకు విరుద్ధంగా సత్యనారాయణరావు భజన పనులను దగ్గరికి చేరనివ్వడని ప్రచారం జరుగుతున్నది. తనకు వెన్నంటి ఉండి పనిచేసిన కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడు కుంటారని ఆచరణలో వెళ్లడవుతున్నది. అంతేకాకుండా అవకాశవాదం కోసం పార్టీలు మారిన వారిని ఎక్కడ ఉంచాలో అక్కడే పెడుతున్నట్లు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. బొకేలు ఇవ్వడం, శాలువాలు కప్పడం, సత్కారాలు, సన్మానాలకు గండ్ర సత్య నారాయణరావు చాలా దూరంగా ఉంటారని ప్రజల్లో ఉంది. వీటన్నిటికి తోడు ప్రజా వ్యతిరేకంగా పనిచేస్తే తన వారైనా సహించరని చెబుతుంటారు. సమస్య పరిష్కారం కోసం ఎంత వరకైనా వెళ్లగలిగే దమ్ము కలిగిన నేతగా సత్తన్న కు పేరుంది.

-జన్మదిన వేడుకలకు దూరం..
ఎమ్మెల్యేగా గండ్ర సత్యనారాయణరావు జన్మదిన వేడుకలు గత నెల కార్తీక పౌర్ణమి రోజున జరిగాయి. శాసనసభ పదవి వరించిన తదుపరి వచ్చిన మొదటి జన్మదినం కావడంతో కార్యకర్తలు హంగు ఆర్భాటాలతో వేడుకలకు సిద్ధమయ్యారు. నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద హంగామా జరిగింది. ఒకరోజు ముందే ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ నాయకులు చేయబోయే వేడుకలకు ఆయనను ఆహ్వానించారు. కార్యకర్తలు, నాయకులు పెద్ద పెద్ద బొకేలు, గజమాలలతో సత్కరించారు. ఇదంతా గిట్టని ఎమ్మెల్యే వారిపట్ల కొంత అసహనాన్ని వ్యక్తం చేశారు. తనకు చేయాల్సిన జన్మదిన వేడుకలు పేదలకు ఉపయోగపడే విధంగా ఉండాలని సూచించారు. మరోసారి తన బర్త్ ‌డే కోసం డబ్బులు వృధా చేయొద్దని సూచించారు. దీంతో ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో వెళ్లడవుతుంది.

-వందల కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి..
గడచిన ఏడాది పాలనలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు వందల కోట్ల నిధులను మంజూరు చేశారు. అభివృద్ధి పనుల కోసం నిధులను వరదలా పారిస్తున్నారు. మొరాంచపల్లె వరద బాధితులను ఆదుకోవడం మొదలుకొని ఇంటిగ్రేటెడ్‌ ‌విద్యాసంస్థలు, మెడికల్‌ ‌కళాశాల అభివృద్ధి, వంద పడకల ఆసుపత్రిలో అధునాతన పరికరాల ఏర్పాటు, చెరువులు, కుంటల మరమ్మతులు, గ్రామపంచాయతీ భవనాలకు నిధులు, రోడ్లు తదితర అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయలను మంజూరు చేయిస్తున్నారు. పనులన్నీ మంజూరై నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. కాగా పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రజాక్షేత్రంలో పోరాడి గెలిచిన గండ్ర సత్యనారాయణరావు మరో నాలుగేళ్లు అధికారంలో కొనసాగనుండగా విమర్శకులకు, విపక్షాలకు అందనంత దూరంలో ప్రజల మదిలో చెరగని ముద్ర వేసుకుంటున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page