ప్రజల ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి

– వాట్సాప్, ఈ-మెయిల్ లో వచ్చిన వాటిని వారంలో పరిష్కరించాలి 
– ప‌ర్యాట‌క‌, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి

వనపర్తి ప్రజాతంత్ర ఆగస్టు 28: ప్రజలు తమ సమస్యలను రాతపూర్వకంగా తెలియజేసి
వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా పంపించినా అధికారులు వెంటనే స్పందించి, వాటిని పరిశీలించి పరిష్కరించాలని అబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. సాంకేతికత అభివృద్ధి చెందిన ప్రస్తుత తరుణంలో ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సిన అవసరం లేకుండా అధికారులు నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించాలని ఆయన సూచించారు. పానగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించిన ప్రజా ఫిర్యాదులపై మంత్రి జూపల్లి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. గత రెండున్నరేళ్ల‌ కాలంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజలు సమర్పించిన ఫిర్యాదులు, ఇప్పటివరకు పరిష్కరించిన సమస్యలు, ఇంకా పెండింగ్ లో ఉన్న ఫిర్యాదులపై జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్లు, సంబంధిత శాఖల అధికారులతో సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలు నిత్యం తమ రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారని, తమ సమస్యల పరిష్కారం కోసం నెలలతరబడి కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదన్నారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులపై అధికారులు బాధ్యతతో స్పందించి గరిష్ఠంగా వారం రోజుల్లోగా పరిష్కరించాలని ఆదేశించారు. విద్యార్థులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాల సమస్యలను రెండు, మూడు రోజుల్లోనే పరిష్కరించాలన్నారు. ప్రజలు తమ సమస్యలను రాతపూర్వకంగా నమోదు చేసి చిరునామా, ఫోన్ సంబర్ తో సంబంధిత శాఖ అధికారులకు వాట్సాప్ లేదా ఈ-మెయిల్ ద్వారా పంపవచ్చని మంత్రి తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాల్సిన బాధ్యత ఉందన్నారు.

భూ సమస్యలపై ప్రత్యేక సమీక్ష

ముందుగా రెవెన్యూ శాఖకు సంబంధించిన సమస్యలను పరిశీలించారు. ఫిర్యాదుదారులు సమర్పించిన భూసమస్యలపై ఒక్కొక్కటిగా ఆరా తీసిన మంత్రి ఆయా సమస్యలు ఎందుకు పెండింగ్ లో  ఉన్నాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ప‌లు పెండింగ్ సమస్యలను అక్కడికక్కడే అధికారుల ద్వారా మంత్రి పరిష్కరించారు.

ఇందిరమ్మ ఇళ్లపై సమీక్ష

కొల్లాపూర్ నియోజకవర్గంలోని మూడు మండలాలకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్లు మంజూ రైనప్పటికీ ఆర్థిక స్థోమత లేక నిర్మాణ పనులు ప్రారంభించని లబ్దిదారుల జాబితాను సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. తదుపరి సమీక్ష సమావేశం నాటికి ఆయా లబ్దిదారులకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించి ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్దిదారులకు నాలుగో విడత నిధులు మంజూరు చేయాలని ఆయన ఆదేశించారు. అనంతరం విద్యుత్ శాఖతో పాటు ఇతర శాఖలకు సంబంధించిన సమస్యలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో పలువురు ప్రజలు తమ సమస్యలను రాతపూర్వకంగా మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ గ్రామ, మండల స్థాయిలోనే ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా అధికారులు పనిచేయాలని మండల అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎన్.భీమ్యా నాయక్, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, డీఆర్వో తిరుపతయ్య, తహసీల్దార్ కార్తిక్, ఎంపీడీఓ గోవిందరావు, గ్రంథాలయ చైర్మన్ గోవర్ధన్ సాగర్, పానగల్ సర్పంచ్ నాగలక్షి, జిల్లా, మండల స్థాయి అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *