మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటనను అడ్డుకోవొద్దని ఎన్డీయే కూటమి నేతలు నిర్ణయించారు. తిరుపతిలో శుక్రవారం సమావేశమైన ఎన్డీయే కూటమి నేతలు.. జగన్ వెళ్లే దారిలో శాంతియుతంగా నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారు. శ్రీవారి లడ్డూ కల్తీకి జగనే కారణమని ఈ నిరసన చెప్పాలని కార్యకర్తలకు సూచించారు. ఒకవేళ వైసీపీ రాజకీయ బల ప్రదర్శనకు దిగితే మాత్రం ధీటుగా సమాధానం చెప్పాలని ప్లాన్ చేసుకున్నారు. గత ప్రభుత్వం తిరుమల ప్రసాదాన్ని అపవిత్రం చేసిందని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు విమర్శించారు.
జగన్ తిరుమల రాకను వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేస్తామని తెలిపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునే అర్హత జగన్‌కు లేదని తెలిపారు. జగన్ కూడా డిక్లరేషన్ ఇచ్చి దర్శనానికి వెళ్లాలని డిమాండ్ చేశారు. ఇందిరాగాంధీ, అబ్దుల్ కలామ్ డిక్లరేషన్ ఇచ్చారని గుర్తుచేశారు. జగన్ పర్యటనను నిరసిస్తూ ప్లకార్డులతో శాంతియుతంగా నిరసన తెలుపుతామని ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ప్రధాన కూడళ్లలో బ్యానర్లు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఐదేళ్లలో ఆలయాలను అపవిత్రం చేశారని విమర్శించారు.