– రెవెన్యూ, హౌసింగ్ మంత్రి పొంగులేటి
– వనపర్తి, గద్వాల నియోజకవర్గాల్లో ప్రగతి పనులకు శ్రీకారం
వనపర్తి/గద్వాల/హైదరాబాద్ : రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో రూ.8.5లక్షల కోట్ల అప్పును ప్రజలపై మోపితే నేటి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రెండున్నరేళ్లలో ఎనిమిది లక్షల ఇళ్లను మంజూరు చేసిందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. తొలి విడత ఇందిరమ్మ ఇళ్ల పధకం కింద 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేయగా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు 2.5లక్షల ఇళ్లు, ‘క్యూర’ పరిధిలో లక్ష ఇళ్లతో కలిపి మొత్తం ఎనిమిది లక్షల ఇళ్లను నిర్మిస్తోందని వివరించారు. వనపర్తి, గద్వాల జిల్లాల్లో సహచర మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, స్ధానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి కృష్ణారెడ్డిలతో కలిసి తహసీల్దార్ కార్యాలయ భవనం, వెంకటేశ్వర ఆలయాలకు మంత్రి పొంగులేటి బుధవారం శంకుస్ధాపన చేశారు. అనంతరం పేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ముఖ్య అతిథిóగా మంత్రి పొంగులేటి దివంగత నేత రాజశేఖరరెడ్డి 77వ జయంతిని పురస్కరించుకుని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం మాదిరిగా తాము ప్రజలను మోసపుచ్చకుండా ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. రూపాయి లంచం లేకుండా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, నిర్మాణ కార్యక్రమాలు సాగుతున్నాయని గుర్తు చేశారు. తొలి విడత మంజూరు చేసిన ఇళ్లలో ఇప్పటికే 1.35 లక్షల ఇళ్ల గృహప్రవేశాలు జరిగాయని మరో 1.25 లక్షల ఇళ్లు శ్లాబులను పూర్తి చేసుకోగా మిగిలిన ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని చెప్పారు. రెండో విడత ఇళ్ల మంజూరు ప్రతి నియోజకవర్గానికి 1500 ఇళ్లతోపాటు పూరి గుడిసెల స్ధానే పక్కా ఇళ్ల కోసం 500 చొప్పున మంజూరు చేశామని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సాగతున్న ప్రగతిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు రోడ్లపై పడి విషం చిమ్ముతున్నారని, మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఈనెల 10 ఖమ్మం జిల్లాలో రైతులకు రూ.9300 కోట్ల విడుదలకు సంబంధించి కార్యక్రమం జరుగుతుందని, నాడు వరి వేస్తే ఉరి అన్న కేసీఆర్ మాటలకు భిన్నంగా నేడు రైతే రాజు అనే నినాదంతో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. వనపర్తిని దత్తత తీసుకుంటానని గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానన్నారు. ఇక్కడ ప్రెస్ క్లబ్‌కు భవనాన్ని, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవనాన్ని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో సుమారు 32వేల పూరి గుడిసెలు ఉన్నట్లు గుర్తించామని, వనపర్తి నియోజకవర్గంలో ఒక్క గుడిసె లేకుండా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మించుకునే పేదలకు ఇసుక, మట్టి సేకరణ విషయంలో ఎలాంటి ఆటంకం కలిగించవద్దని పోలీసు, రెవెన్యూ, హౌసింగ్ అధికారులకు ఆదేశించారు. సాదాబైనామాలకు సంబంధించి రైతు పొజిషన్లో ఉంటే వాటిని రెగ్యులరైజ్ చేయాలని, దీనికి సంబంధించి అవసరమైతే సీసీఎల్ఏ అనుమతి తీసుకోవాలని అధికారులకు మంత్రి పొంగులేటి సూచించారు.
ఎన్నికలు ఎప్పుడైనా వార్ వన్ సైడే
రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వార్ వన్ సైడేనని, మళ్ళీ అధికారంలోకి వచ్చేది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వమేనని మంత్రి పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో జరిగిన అన్నిఎన్నికల్లో బీఆర్ఎస్ కి ప్రజలు బుద్ధి చెప్పడంతోపాటు, ప్రజా ప్రభుత్వానికి ప్రజల దీవెనలు అందించారన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం ర్యాలంపాడు గ్రామంలో జరిగిన సామూహిక ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో సహచర మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు చేసుకున్న లబ్దిదారులకు శుభాకాంక్షలు తెలిపి వారికి ఆత్మీయ చిరు కానుకలను అందించారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల రెండవ విడత మంజూరు పత్రాలను లబ్దిదారులకు పంపిణీ చే శారు. గద్వాల జిల్లా ప్రజలు చూపించిన అభిమానం మరువలేనిదన్నారు. కుల, మత, రాజకీయాలకతీతంగా పేదలైతే అయితే చాలు ఇందిరమ్మ ఇల్లు కట్టించాలని ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. జూరాల, నెట్టంపాడు ముంపు భూ నిర్వాసితులకు కూడ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం. రెవెన్యూ శాఖ పరిధిలోని గద్వాల జిల్లా కావాల్సిన ఆర్డీవో, ఎమ్మార్వో కార్యాలయాలను కూడా మంజూరు చేస్తామని హా ఇచ్చారు. మాది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం.పేదల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడే ప్రజాప్రభుత్వం అని మంత్రి తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





