కాగిత రహిత పాలనకు కట్టుబడి ఉన్న ప్రభుత్వం

– హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆనంద్

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: ప్రభుత్వ ఆదేశాల మేరకు విభాగాధిపతుల క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సి.వి.ఆనంద్ లక్డీకాపుల్‌లోని ప్రాసిక్యూషన్ డైరెక్టరేట్‌ను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన డైరెక్టరేట్‌లో నూతనంగా ప్రవేశపెట్టిన ‘ఈ-ఆఫీస’ అప్లికేషన్‌ను ప్రారంభించారు. తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా రాష్ట్రంలో కాగిత రహిత (పేపర్‌లెస్) పాలనను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ-ఆఫీస్ విధానం ద్వారా ఫైళ్ల సత్వర పరిష్కారం సాధ్యమవుతుందని, పరిపాలనలో జవాబుదారీతనం పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్ విభాగంలో ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేసిన డైరెక్టర్‌ను, సిబ్బందిని అభినందించారు. అనంతరం ప్రాసిక్యూషన్ విభాగం కోసం రూపొందించిన ముఖ గుర్తింపు ఆధారిత హాజరు నిర్వహణ వ్యవస్థను ఆయన ప్రారంభించారు. ఈ విధానం వల్ల సిబ్బంది హాజరులో క్రమశిక్షణ, పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. ప్రాసిక్యూషన్ డైరెక్టరేట్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సి.వి.ఆనంద్ కీలక సూచనలు చేశారు. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఎస్.సాంబశివ రెడ్డి విభాగం పనితీరు, సాధించిన విజయాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. శాఖాపరమైన కొన్ని పెండింగ్ అంశాలను ఆయన ఆనంద్ దృష్టికి తీసుకెళ్లగా వాటి పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. దేశంలో అమలులోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాల అమలుకు సంబంధించి సర్క్యులర్లు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, ప్రభుత్వ ఉత్తర్వుల రూపకల్పనలో ప్రాసిక్యూటర్ల బృందం చేసిన కృషిని ప్రశంసించారు. కొత్త చట్టాల సమర్థవంతమైన అమలుకు తీసుకోవాల్సిన మరిన్ని చర్యలపై దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆయన డైరెక్టరేట్ సిబ్బందితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. సిబ్బందితో వ్యక్తిగతంగా మాట్లాడారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *