– పాక్ సమర్థతపై ఇరాన్ అధికారుల్లో అనుమానాలు
టెహ్రాన్,ఏప్రిల్ 27:అమెరికా-ఇరాన్ మలివిడత చర్చలపై అనిశ్చితి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మధ్యవర్తిగా పాకిస్థాన్ తటస్థ వైఖరితో సమర్థవంతంగా వ్యవహరించగలదా అని టెహ్రాన్ అధికారిక వర్గాల్లో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇరాన్ పార్లమెంట్‌లో ఆ దేశ ఎంపీ, జాతీయ భద్రత విదేశాంగ విధాన కమిషన్ అధికార ప్రతినిధి అయిన ఇబ్రహీం రెజాయీ మాట్లాడుతూ.. పాక్ సరైన మధ్యవర్తి కాదనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ఇస్లామాబాద్‌లో దౌత్యానికి అనుకూల పరిస్థితులు లేవని అన్నారు. పొరుగు దేశమైన పాకిస్థాన్ మనకు మంచి మిత్ర దేశం. కానీ అది చర్చలకు సరైన మధ్యవర్తి కాదు. మధ్యవర్తిత్వానికి అవసరమైన విశ్వసనీయత దానికి లేదు. పాక్ అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా ప్రవర్తిస్తుందే కానీ.. ఆ దేశ వైఖరిని సవాలు చేయడానికి సాహసించదు. లెబనాన్ విషయంలో అమెరికా అంగీకరించలేనివిధంగా డిమాండ్లు తెర పైకి తీసుకువచ్చినప్పుడు కూడా పాక్ నేతలు అడ్డు చెప్పలేదు. మధ్యవర్తులు నిష్పక్షపాతంగా ఉండాలి కానీ.. ఒక పక్షం వైపు మొగ్గు చూపకూడదు. ఇప్పటివరకు వారి విధానం చూస్తుంటే చర్చల విషయంలో వారు నిష్పక్షపాతంగా వ్యవహరించగలరా అనే దానిపై సందేహాలు తలెత్తుతున్నాయని ఇబ్రహీం రెజాయీ పార్లమెంట్‌లో పేర్కొన్నారు. అమెరికా-ఇరాన్ ల మధ్య తొలివిడత చర్చలు విఫలమైన తర్వాత మళ్లీ చర్చలు జరపాలని ఇరాన్ ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. శాంతిఒప్పందం కుదిరేవరకు ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనాన్ని ఉపసంహరించుకోబోమని అమెరికా చెబుతుండగా.. దాన్ని తొలగించేవరకూ చర్చలు జరపబోమని ఇరాన్ స్పష్టం చేస్తోంది. కాగా తమ మధ్యవర్తిత్వంలో ఇరువర్గాల మధ్య పరోక్ష చర్చలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని పాక్ అధికారులు పేర్కొన్నారు.
