– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అరెస్ట్
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3 : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు సచివాలయానికి చేపట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకుని ఆయనను అరెస్టు చేశారు. పెండింగ్‌లో ఉన్న రూ.15వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎనిమిది లక్షల మందికిపైగా విద్యార్థుల నుంచి సేకరించిన సంతకాలతో కూడిన వినతిపత్రాలను ప్రభుత్వానికి సమర్పించేందుకు ఆయన నేతృత్వంలో గురువారం సచివాలయానికి ఆకస్మిక పాదయాత్ర చేపట్టారు. విద్యార్థుల సంతకాలతో కూడిన విజ్ఞాపనలను వ్యక్తిగతంగా అందజేసేందుకు సమయం కేటాయించాలని కోరుతూ మూడు రోజుల క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రామచందర్‌రావు లేఖ రాసినప్పటికీ సీఎం కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన లేదు. లక్షలాదిమంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారినా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో విద్యార్థుల ఆవేదనను నేరుగా ప్రభుత్వానికి వినిపించాలనే సంకల్పంతో ఆయన కార్యకర్తలతో కలిసి సచివాలయానికి తరలివెళ్లారు. ప్రధాన ద్వారం వద్ద పోలీసులు వారిని అడ్డుకోగా అక్కడే బైఠాయించి విద్యార్థుల హక్కుల కోసం పెద్దఎత్తున నిరసన చేపట్టారు. రామచందర్‌రావును, బీజేపీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తన అక్రమ అరెస్టుపై రామచందర్‌రావు తీవ్రంగా స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో విద్యార్థి వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం రూ.15,000 కోట్ల పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయకపోవడం వల్ల దాదాపు 40 లక్షల మంది విద్యార్థులు ఉన్నత చదువులకు, ఉద్యోగావకాశాలకు దూరమై వారి జీవితాలు సర్వనాశనమయ్యాయని మండిపడ్డారు. తాను ఇప్పటికే నిరాహార దీక్ష చేశానని, ముఖ్యమంత్రికి లేఖలు రాశానని, ఎనిమిది లక్షల మంది విద్యార్థుల సంతకాలతో ఉన్న వినతిపత్రాలను సేకరించినా ఈ సిగ్గు లేని ప్రభుత్వం ఇసుమంతైనా చలించలేదని ధ్వజమెత్తారు. ఇది కాంగ్రెస్ పార్టీ అహంకారానికి, విద్యార్థి వ్యతిరేక మనస్తత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. విద్యార్థుల సహనం నశించడంతోనే వారి గొంతుకగా మారి నేరుగా సచివాలయానికి వెళ్లాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగడుతూ ‘కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసింది నన్ను కాదు.. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం నిరీక్షిస్తున్న 40 లక్షల మంది విద్యార్థుల గొంతును అరెస్టు చేసింది.. మీరు నన్ను నిర్బంధించగలరేమో గానీ 40 లక్షల మంది విద్యార్థుల ఆక్రందనను, ఆగ్రహాన్ని మాత్రం ఆపలేరు.. తెలంగాణ విద్యార్థులకు అందాల్సిన ప్రతి పైసా విడుదలయ్యే వరకు బీజేపీ పోరాటం ఆగద’ని రామచందర్‌రావు హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





