“రాగయుక్తంగా పద్యాలు గొంతెత్తి బిగ్గరగా పాడటమంటే పీవీ కి బాగా ఇష్టం. వరంగల్ లో పౌరాణిక నాటక ప్రదర్శన జరుగుతుందంటే తప్పక హాజరు. స్ఠానం నరసింహారావు ‘సారంగ ధర‘, డీ వీ సుబ్బారావు ‘హరిశ్చంద్ర’, తెనాలి డ్రామా కంపెనీ వారి ‘కృష్ణ లీలలు‘ మొదలగునవి చూడటమే కాకుండా ఆ ప్రదర్శన లోని పద్యాలు రాగయుక్తంగా పాడి మిత్రులకు వినిపించే వాడు. ఇక సర్కస్ వచ్చిందంటే ఎంతో ఆనందం. స్కూల్ వదిలిన తర్వాత సాయంత్రం నేరుగా సర్కస్ డేరా బయటకు చేరేవాడు. చీకటి పడేదాకా అక్కడే గడిపే వాడు..”
(నేడు పూర్వ ప్రధాని శ్రీ పీ వీ గారి జయంతి సందర్బంగా వారి బాల్య విశేషాల గురించి మరొక్కసారి)
పీవీ నిరాడంబరత, మేధా సంపత్తి, సాహిత్య అభిలాష ఆమెకు అవగతమవుతున్న తరుణంలో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ఆయన్ను ముఖ్యమంత్రి పదవికి, హైదరాబాదుకు దూరాన్ని చేసింది. పార్టీకి కావలసిన వాడిగా ఆయనను ఇందిరా గాంధీ దిల్లీకి దగ్గర చేసింది. ఆయనను మొదటగా 1977 లో పార్లమెంట్ కు పంపింది వరంగల్ జిల్లాలోని హనుమకొండ పార్లమెంటరీ నియోజక వర్గ ప్రజలే! అంటే ఆయనను దిల్లీలో నిలిపింది వరంగల్ జిల్లా ప్రజలే! ఆయన గెలిచినా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం వల్ల ఆయన కేంద్ర మంత్రి కాలేక పోయినా తిరిగి మూడేండ్లలో 1980 లో జరిగిన ఎన్నికల్లో ఆయనతో బాటు పార్టీ కూడా గెలవడం వల్ల ఆయన మొదటిసారిగా విదేశాంగ మంత్రిగా అధికార పగ్గాలు చేపట్టి తొలుత ఇందిరా గాంధీకి, ఆ తర్వాత రాజీవ్ గాంధీకి దగ్గరై తగు సూచనలు ఇచ్చే స్థాయికి ఎదిగారన్నది నిర్వివిధాంశం.
తర్వాత ఆయనను ప్రధానమంత్రి పదవి ఎట్లా వరించిందో అందరికీ తెలుసు! కొద్దిపాటి అవరోధాలున్నా చాలామంది కాంగ్రెస్ నాయకులు ఆయన వైపే మొగ్గు చూపడానికి కారణం పైన పేర్కొన్న సుగుణాలే కాకుండా ఎన్ని ఒడిదుడుకుళ్ళోనూ పార్టీని, పార్టీ అధిష్ఠానాన్నీ అంటిపెట్టుకొని ఉండటం కూడా ఆయన విశ్వసనీయతగా గుర్తెరిగారు అప్పటి పార్టీ నాయకులు. ఈ విధంగా ఆ గ్రామీణ అమాయకపు బాలుడు బెదురుతూ ఆ పాఠశాల ప్రాంగణం లోనికి అడుగుబెట్టిన నాటినుండి ఏ విధంగా ఒక బహుముఖ ప్రజ్ఞాశాలిగా రూపొందడం జరిగింది, అతని చైతన్య ప్రవృత్తి ఎట్లా మారుతూ వచ్చింది తెలుసుకోవడం మనల్ని ఎన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుందేమో?
వరంగల్ లో చదువుల నాటి బాల్యం: పాఠశాలలో 6వ తరగతిలో చేరిన రెండు రోజుల తర్వాత పీవీ మధ్యాహ్న భోజనం ముగించి స్కూల్ ఆవరణలో ఉన్న వాటర్ టాంక్ నల్లా వద్ద నీళ్ళు తాగుతున్నాడు. అప్పుడే అక్కడకు వచ్చిన అదే వయస్సు గల మరొక పిల్లవాడు తనూ నీళ్ళు తాగుతూ యధాలాపంగా ‘నీ పేరేంటోయ్?’ అని అడిగాడు. ఆ రోజుల్లో ఇంటి పేరుతో సహా పూర్తి పేరు చెప్పే పద్ధతి వుంది కాబట్టి ఆ మొదటి బాలుడు “నా పేరు పాములపర్తి వెంకట నరసింహారావు” అని చెప్పాడు. “అరే, నా పేరు పాములపర్తి సదాశివరావు” అని తెలిపాడు రెండో బాలుడు ఎంతో సంతోషంతో. ఆ సాయంత్రమే తన మిత్రున్ని వరంగల్ లోని మట్టెవాడలో గల తన ఇంటికి తీసుకుపోయి ఇంట్లోని పెద్దలకు పరిచయం చేయడం, వారి ద్వారా ఇద్దరి మధ్య గల ‘దూరపు బంధుత్వం‘ తెలిసికోవడం జరిగింది. ఆ విధంగా ఆ మంచినీటి నల్లా వారి మధ్య ఒక గొప్ప మైత్రికి నాంది పలికింది.
క్రమేణా ఇద్దరి మధ్య స్నేహితం బలపడటం, ఆదివారాల్లో ఇద్దరూ భద్రకాళి గుట్టలూ, పద్మాక్షమ్మ గుట్ట, సిద్ధేశ్వరాలయం, వరంగల్ కోట, వేయిస్తంభాల గుడీ మొదలగు స్థలాలకు తిరగడం చేసేవారు. పాకాల చెరువు, మెట్టుగుట్ట, గోవిందరాజుల గుట్టా, ఇంకా ఎన్నో వారి తిరుగుళ్ళకు అనువైన ప్రదేశాలే! ఇక స్కూల్లో పీవీ చదువులో ప్రధముడు, ఉపాధ్యాయులకు ప్రియతమ స్టూడెంట్, తోటి విద్యార్థులకు ఆదర్శ ప్రాయుడు. పరీక్షలో అతడు రాసిన ఆన్సర్ పేపర్లను టీచర్లు ఇతర విద్యార్థులకు చదివి వినిపించి మెచ్చుకునేవారు. పాఠ్యగ్రంధాలలో ఆయా పాఠాలు రాసిన రచయితల శైలిని త్వరగా పట్టేసేవాడు పీవీ. ఆ శైలికి తన స్వంత శైలిని అద్బుతంగా మిళితం జేసి సమాధానాలు రాసేవాడట! అప్పుడప్పుడూ కవిత్వాలు, కథలు, నాటకాలు రాయడం, తోటి విద్యార్థులకు అవి వినిపించడం, నాటక ప్రదర్శనల్లో స్త్రీ పాత్రలు మరియు మగ వేషాలు వేయడం, రాగయుక్తంగా సినీ పాటలు పాడి వినిపించడం మొదలగు ఉత్సుకత కలిగించే పనులవల్ల తోటి విద్యార్థులకు పీవీ ఒక ‘సవ్య సాచి ‘ లాగా కనిపించేవాడు.
మొత్తానికి పీవీ అటు ఉపాధ్యాయులకు, ఇటు తోటి విద్యార్థులకు అత్యంత ప్రీతిపాత్రు డయ్యాడు.. ఒకసారి స్కూల్ లో ‘కృష్ణకుమారి ‘ అనే నాటకం వేశారు. పీవీ ది అందులో కృష్ణకుమారి పాత్ర. పీవీ తన పాత్ర డైలాగులతో బాటు ఆ నాటకంలోని అన్ని పాత్రల డైలాగులను కంఠతా పట్టేశాడు. రిహార్సులకు ఏ పాత్రధారి రాకున్నా ఆ పాత్ర డైలాగులు చెప్పేవాడు. కృష్ణకుమారి నాటకం లో పీవీ అభినయం చూసి ప్రశంసించని వాళ్ళు లేరు. ఇక స్కూల్ బయట పీవీకి ఆసక్తి లేని విషయం లేదు. మొదటగా అప్పటి సైలెంట్ సినిమాలలో మాస్టర్ విఠల్ అంటే అభిమానించాడు. తర్వాత టాకీలు వచ్చాక పృథ్వీరాజ్ కపూర్, అశోక్ కుమార్, సొహరాబ్ మోదీ లతో పాటు అలనాటి మేటి నటీమణులు దేవికారాణి. దుర్గా ఖోటే, కనన్ బాల మొదలగు వారి సినిమాలు తప్పక చూసేవాడు. తెలుగులో కాంచన మాల, కన్నాంబల నటనా ప్రతిభను మెచ్చుకునే వాడు.
రాగయుక్తంగా పద్యాలు గొంతెత్తి బిగ్గరగా పాడటమంటే పీవీ కి బాగా ఇష్టం. వరంగల్ లో పౌరాణిక నాటక ప్రదర్శన జరుగుతుందంటే తప్పక హాజరు. స్ఠానం నరసింహారావు ‘సారంగ ధర‘, డీ వీ సుబ్బారావు ‘హరిశ్చంద్ర’, తెనాలి డ్రామా కంపెనీ వారి ‘కృష్ణ లీలలు‘ మొదలగునవి చూడటమే కాకుండా ఆ ప్రదర్శన లోని పద్యాలు రాగయుక్తంగా పాడి మిత్రులకు వినిపించే వాడు. ఇక సర్కస్ వచ్చిందంటే ఎంతో ఆనందం. స్కూల్ వదిలిన తర్వాత సాయంత్రం నేరుగా సర్కస్ డేరా బయటకు చేరేవాడు. చీకటి పడేదాకా అక్కడే గడిపే వాడు. డేరా వెలుపల గొలుసులతో కట్టేసిన ఏనుగును చూస్తూ అమిత ఆనందం పొందేవాడు. వీటితో పాటు చిలిపి చేష్టలు కూడా! సినీ తారల బొమ్మలను కత్తిరించుకొని ఫైల్ చేయడం; రాత్రిళ్ళు గానా పార్టీలల్లో గడపడం; మిత్రులతో హనుమకొండ చౌరాస్తా, లష్కర్ బజారులలో రోడ్లపై తిరగడం; ‘అప్పూ హోటల్ ‘ వద్ద అర్థణాకు ఆలూ బజ్జీ, మూడు పైసలకు టీ, ప్రక్కనే ఉన్న పాన్ షాప్ లో పైసా కు ‘పాన్ బీడా’ సేవానంతరం ఇరుగు పొరుగు ఇండ్ల ముంగిళ్ళ గాలింపు యిత్యాది కార్యక్రమాలు కూడా వుండేవి.
ఆ రోజుల్లో వరంగల్ పట్టణంలో భామా కలాపం, గొల్ల కలాపం, ఉషాపరిణయం మొదలగు కూచిపూడి భాగవత ప్రదర్శనలు జరిగేవి. దీపావళి పండగ రోజుల్లో హారతులు, బోగం మేలాలు, గాన సభలు జరిగేవి. ఇంకా పెండిండ్లు పేరంటాల సందర్భాలలో పాట కచేరీలు జరిగేవి. ఇలాంటి కార్యక్రమాలంటే పీ వీ కి బహు సరదా. ఆనాటి నిజాం ప్రభుత్వ పాలనలో పౌర హక్కులకు గుర్తింపు లేని స్థితి. కాబట్టి వరంగల్ యువకులు, విద్యార్థులు గణేశ్ ఉత్సవాల పేరుమీద జన సమీకరణ గావించి హిందూ సంఘటనా శక్తి గా కార్యక్రమాలు నిర్వహించే వారు. అదే విధంగా హనుమకొండ విద్యార్థులు, యువకులు ‘భజన మండలి ‘ పేరుతో ఒక సంస్థ నేర్పరుచుకున్నారు. ఈ రెండింట్లో కూడా పీవీ చురుకుగా పాల్గొనే వాడు. పీవీ 7 వ తరగతిలో ఉన్నప్పుడు స్కూల్ తరఫున విద్యార్థులను ఉత్తర దేశ యాత్రకు తీసుకుపోయారు. పీవీ కూడా ఆ యాత్రలో పాల్గొన్నాడు. ఆ యాత్రలో పీవీ కేవలం వివిధ ప్రాంతాలు, ప్రజలు, అక్కడి విశేష భవనాలు, కట్టడాలు చూడటంతో సరిపెట్టుకోకుండా ఆ ప్రాంత ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లూ, ఆహార అలవాట్లూ విపులంగా పరిశీలించేవాడు. యాత్ర నుండి రాగానే తన యాత్రానుభవాలను తన సహచరులకు చెప్పేవాడు. ఈ యాత్రానుభవ వర్ణనాత్మక వివరణ కొన్ని నెలలల పాటు జరిగిందట. అంటే పీవీ లో ఈ యాత్ర ఎంతో ఉత్సుకత కలిగించిందనీ, ఆ యాత్ర లో పీవీ ఎంతో తాదాత్మ్యత చెందాడని తెలుస్తుంది.
వయస్సు పెరిగి నూనూగు మీసాలు వచ్చేసరికి పీవీ, సదాశివుడు ఎప్పుడైనా సినిమాలను చూడటానికి చెరో 5 రూపాయలు తీసుకొని హైదరాబాద్ పోవడానికి పాసెంజర్ బండి ఎక్కి నాంపల్లి స్టేషనుకు చేరి స్టేషనుకు ఎదురుగానే ఉన్న రాయల్ హోటల్ లో, లేదా నాంపల్లి షరాయిలో రెండు రోజులు మకాం వేసేవారు. పాన్ బీడా వేసుకొని ‘టివోలీ’, ‘లైట్ హౌస్’ థియేటర్లలో సినిమాలను చూడడం; పబ్లిక్ గార్డెన్, టాంక్ బండ్, కోఠీలలో తిరగడం చేసే వారు. మళ్ళీ పాసెంజర్ ట్రైన్ ఎక్కి వరంగల్ చేరే సరికి 5 రూపాయల్లో ఇంకా ‘చారాణా‘ మిగిలేదట! 1939 లో విడుదలైన శాంతారాం గారి మూవీ ‘ఆద్మీ’ చూసి వచ్చిన తర్వాత మిత్రులిద్దరూ ఆ సినిమాను గురించి వారం పాటు చర్చించుకున్నారట!!
ఈ చిన్ననాటి తిరుగుళ్ళే పీవీ కి టూరిజం మీద ఆసక్తి కలిగించి, అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా పనిచేసిన 9 ఏండ్లలో పీవీ గారివే అధికంగా టూర్ కార్యక్రమాలుండేవట! అందరూ ఆయన్ను టూర్ మినిస్టర్ అనేవారట!! పీవీ చిన్ననాటి ఈ తిరుగుళ్ళు, ఇంకా తర్వాత మనం తెలుసుకోబోయే పీవీ చేసిన యితర వ్యాపకాలు ఉబుసులాటకు చేసినా, తప్పనిసరై చేసినా మనం గ్రహించవలసింది యేమిటంటే ప్రతిదీ ఆయన పరిశీలనాత్మక, పరిశోధనాత్మక, విమర్శనాత్మక దృష్టికి గురి అయ్యేది. ఆ సమాచారం ఆయన చిన్ననాటి మినీ కంప్యూటర్ మెదడులో రికార్డ్ అయ్యేది. సినిమాలు, పౌరాణిక నాటకాలు చూస్తున్న క్రమంలో మిత్రులిద్దరిలో సంగీతం పట్ల మక్కువ పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా పీవీ గారు “ఏక సంథాగ్రహి” లాగా తాము చూసిన సినిమాల్లోని పాటలను సినిమా చూసి రాగానే వెంటనే ఎంతో రాగయుక్తంగా పాడేవారని సదాశివరావుగారు చెప్పేవారు. ఒక హర్మనీ పెట్టె, తబలా కొనుక్కొని ఇద్దరూ సంగీత సాధన చేసేవారు.
బాల్యంలో సంగీతంపై పెరిగిన ఈ ఆసక్తి వీరిని క్లాసికల్ సంగీతం (ముఖ్యంగా హిందుస్తానీ సంగీతం)పై గొప్ప పట్టు సంపాదించి వివిధ సంగీత రాగ, తాళాల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఒక కళాకారుడిచ్చిన సంగీత ప్రదర్శన బాగోగులపై చర్చించుకునే స్థాయికి పెరిగింది. పీవీ త్యాగరాజ కృతులు, జావళీలు విపరీతంగా అభిమానించే వాడు, వాటి లోని రాగ తాళ విన్యాసాలను అనుకరించడానికి ప్రయత్నించే వాడు. బిడారం కిట్టప్ప, నారాయణ్ రావు వ్యాస్, పండిట్ ఓంకార్ నాథ్. ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాన్ మొదలగు శాస్త్రీయ సంగీత గాయకుల గ్రామఫోన్ రికార్డుల పాటలను మరీ మరీ విని ఆనందించే వాడు.
అంతే కాదు, వారిని అనుకరిస్తూ చాటు మాటుగా కసరత్ చేసేవాడు. ఐతే శాస్త్రీయ సంగీతం కేవలం వినడం వల్ల రాదనీ దానికి ఎంతో సాధన చేయాల్సి ఉంటుందని తెలుసుకున్నాడు. ఐనా అనేక రాగాలను, తాళ విన్యాసాలను, గతి భేదాలను గుర్తించడం అలవరచుకున్నాడు. వయసు పెరుగుతూంటే శాస్త్రీయ సంగీతం పై మక్కువ పెరుగుతూ వచ్చింది. ద్వారం వెంకటస్వామి నాయుడు వయోలీన్, పన్నాలాల్ ఘోష్ వేణువు, హీరా బాయి, రోష్ నారా బేగం, కేసర్ బాయి. రవూఫ్ ల గాత్రం, ఉస్తాద్ అహ్మద్ జాన్ తిరక్వా ‘తబ్ లా’ అంటే పీవీ కి మోజు. ఇక ఇన్ని రకాల వ్యాసంగాలు పీవీ కి ఉంటే ఆయన కలం ఊరుకుంటుందా? నేను కూడా ఉన్నానని తన విన్యాసాల్ని చూపెట్టింది.
(మిగతా మంగళవారం జూన్ 30 సంచికలో ..)
పాములపర్తి నిరంజన్ రావు
పిన్నా శివకుమార్





