– పనుల వేగవంతానికి వివిధ శాఖల అధికారులతో సమన్వయ కమిటీ
– రానున్న వందేళ్ల అవసరాలకు తగినట్లు వసతుల కల్పన
– పనుల తీరుపై తరచూ క్షేత్ర స్థాయిలో తనిఖీ
– ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 22: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఉస్మానియా నూతన హాస్పిటల్ నిర్మాణం రెండేళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నూతన హాస్పిటల్ రానున్న వందేళ్ల అవసరాలకు తగినట్లు వసతుల కల్పన, అధునాతన వైద్య పరికరాలను సమకూర్చుకోవాలని, ఇందుకు సంబంధించి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని, పరికరాల ఏర్పాటుకు తగినట్లు గదులు, ల్యాబ్‌లు, ఇతర నిర్మాణలు ఉండాలని ఇంజినీరింగ్ అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. తన నివాసంలో హాస్పిటల్ నూతన భవనాల నిర్మాణం, అభివృద్ధి పనులపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి బుధవారం సమీక్ష నిర్వహించారు. హాస్పిటల్ పనులతోపాటు స్థానికులకు ఇబ్బంది లేకుండా చుట్టూ రోడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. పనుల వేగవంతానికి వైద్యారోగ్య శాఖ, పోలీసు, జీహెచ్‌ఎంసీ, ఆర్‌అండ్‌బీ, విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని, ఈ కమిటీ క్షేత్రస్థాయిలో ప్రతి పది రోజులకోసారి సమావేశమై సమస్యలుంటే పరిష్కరించుకుంటూ పనులు వేగంగా జరిగేలా చూడాలన్నారు. నిర్మాణం పూర్తయ్యాక అక్కడి బందోబస్తు, ట్రాఫిక్ విధుల నిర్వహణకు సంబంధించి ముందుస్తుగానే తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలని పోలీసు శాఖ ఉన్నతాధికారులకు సూచించారు. హాస్పిటల్‌కు వివిధ రహదారులను అనుసంధానించే ప్రణాళికలు ఇప్పటి నుంచే రూపొందించాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు సీఎం సూచించారు. హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాల్లో హాస్పిటల్స్, మెడికల్ కళాశాలల నిర్మాణానికి సంబంధించి ప్రతి నిర్మాణానికీ ఒక అధికారిని నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. నిర్మాణాలపై 24ఞ7 అధికారి పర్యవేక్షించేలా పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగించాలని సూచించారు. సమీక్షలో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీలు వి.శేషాద్రి, శ్రీనివాసరాజు, సీఎం కార్యదర్శి మాణిక్‌రాజ్, డీజీపీ శివధర్ రెడ్డి, ఆర్ అండ్ బి స్పెషల్ సీఎస్ వికాస్‌రాజ్, హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చోంగ్తూ, ఎంఏ అండ్ యూడీ సెక్రటరీ ఇలంబర్తి, ముషారప్ అలీ ఫరూఖీ, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన తదితరులు పాల్గొన్నారు.
అన్ని రహదారులపై రవాణా చెక్‌పోస్టులను వెంటనే ఎత్తివేయాలి
రాష్ట్రంలోని అన్ని రహదారులపై రవాణా చెక్‌పోస్టులను వెంటనే ఎత్తివేయాలని, ఈరోజు సాయంత్రం 5 గంటలలోగా మూసివేతపై పూర్తి నివేదికను ఇవ్వాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు. దీంతో తక్షణమే చెక్‌పోస్టుల కార్యకలాపాలు నిలిపివేయాలని ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆకస్మిక ఆదేశాలు జారీ చేశారు. చెక్‌పోస్టుల వద్ద ఉన్న సిబ్బందిని వెంటనే వేరే బాధ్యతల్లో వినియోగించుకోవాలని ఉత్తర్వులు ఇచ్చారు. రహదారులపై వాహనాల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని, చెక్‌పోస్టుల వద్ద బోర్డులు, బ్యారికేడ్లు, తొలగించాలని డీటీవోలకు సూచించారు. చెక్‌పోస్టుల వద్ద ఉన్న రికార్డులు, పరికరాలు, ఫర్నిచర్‌ను డీటీవో కార్యాలయాలకు తరలించాలని ఆదేశించారు. అన్ని ఆర్థిక, పరిపాలనా రికార్డులను సరిచూసి భద్రపరచాలని ఆదేశించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





