– ఫీజు బకాయిలు చెల్లించకుంటే మంత్రులను తిరగనివ్వం
– జూబ్లీహిల్స్‌లో బీజేపీ ప్రచార కార్యక్రమంలో రామచందర్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 22: ప్రజల ఆశయాలకనుగుణంగా పనిచేసే అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని గెలిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు ఓటర్లను కోరారు. ఇది ఉప ఎన్నిక మాత్రమే కాదని, రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు ప్రతీక అని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డికి మద్దతుగా వెంగళరావు డివిజన్‌లో బుధవారం నిర్వహించిన పాదయాత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. యాదగిరినగర్ కమాన్, ఎస్.జి.బి పాఠశాల సమీపం నుంచి ఈ పాదయాత్ర పారంభమైంది. తొలుత రామచందర్ రావుకు ప్రజలు, బీజేపీ కార్యకర్తలు ఆత్మీయ స్వాగతం పలకగా పాదయాత్ర ఉత్సాహంగా సాగింది. అభిమాన నాయకుడు రామచందర్‌రావును చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రామచందర్ రావు గడపగడపకూ తిరిగి ప్రజలతో మామేకమయ్యారు.
ఫీజు బకాయిలు చెల్లించమంటే విజిలెన్స్ బెదిరింపులా?
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను పూర్తిగా చెల్లిస్తారా లేదా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. బకాయిలు చెల్లించకుంటే కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థులతో కలిసి సచివాలయాన్ని ముట్టడిస్తామన్నారు. బకాయిలు అడిగితే విజిలెన్స్ దాడులతో బెదిరించాలనుకుంటున్నారా అంటూ ఇలా అయితే మంత్రులెవరినీ రోడ్లపై తిరగనీయబోం అని హెచ్చరించారు. రాష్ట్రంలో బ్లాక్ మెయిల్ సర్కార్ నడుస్తోందా అని అనుమానం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఎగ్గొడుతున్న కాంగ్రెస్‌ను ఏం చేయాలి అని ప్రజలను ప్రశ్నించారు. ప్రతి నెలా రూ.500 కోట్లు చెల్లిస్తామంటూ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటను తప్పుతారా? పదేపదే టోకెన్లు ఇచ్చి కూడా బకాయిలు చెల్లించలేని అసమర్ధ సర్కార్ ఇది అని విమర్శించారు. తక్షణమే బకాయిలు మొత్తం చెల్లించాల్సిందేనని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవని రాష్ట్ర ప్రభుత్వానికి రామచంద్రరావు హెచ్చరిక జారీ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





