– రిజర్వేషన్ల పాపం కాంగ్రెస్, ముఖ్యమంత్రిదే
– బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10: బీసీ రిజర్వేషన్ల అంశం న్యాయ సమీక్షకు వెళ్తుందని తెలిసినా జాగ్రత్తలు తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరించారని, దీనికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. బీసీలకు నిజమైన రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆలోచన రేవంత్ రెడ్డికి లేదని, కేవలం బీహార్ ఎన్నికల్లో రాజకీయ లాభం కోసం, రాహుల్ గాంధీ ఒత్తిడికి లొంగి బీసీ రిజర్వేషన్ల పేరుతో డ్రామాలు ఆడి బీసీ వర్గాలను మరోసారి వంచించారని ఆరోపించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బీహార్‌లో బీసీ వర్గాలన్నీ ఎన్డీయే వైపు మొగ్గుచూపుతున్నాయని, ఆ కూటమే విజయం సాధించనుందని సర్వేలు చెబుతున్నాయన్నారు. ఈ భయంతోనే కాంగ్రెస్ పార్టీ 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై మూడు నెలలుగా పన్నాగాలు పన్నిందని తెలిపారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచే ప్రయత్నం చేశామని చెప్పి కోర్టు తీర్పులను నెపంగా వాడుకుని కాంగ్రెస్ బీసీల ఓట్లు దండుకోవాలన్న ప్రయత్నం చేసిందన్నారు. రిజర్వేషన్ల అంశం రాజ్యాంగపరమైన, శాస్త్రీయమైన ప్రక్రియతోనే సాధ్యమని తెలిసీ కాంగ్రెస్ పార్టీ దానిని పూర్తిగా అపహాస్యం చేసిందని, ఆర్డినెన్స్, జీవోల పేరుతో కాలయాపన చేస్తూ కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసిందని ఆరోపించారు. ట్రిపుల్ టెస్ట్, ఎంపిరికల్ డేటా అంశంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవగాహన రాహిత్యంతో, న్యాయపరమైన సలహాలు లేకుండా బీసీలను మోసం చేయాలని చూసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 31న అసెంబ్లీ ఆమోదించిన బిల్లును గవర్నర్‌కు పంపి ఆయన నిర్ణయానికి గడువు ముగియకముందే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిందని, ఇది చట్టవిరుద్ధ చర్య అని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కూడా విస్మరించిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే వివరాలను పబ్లిక్ డొమైన్‌లో ఎందుకు ఉంచలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు బీసీల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంటే, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో బీసీ డిక్లరేషన్‌లో ప్రకటించిన హామీలను అమలు చేసేదని, కానీ 22 నెలలు గడిచినా 42 శాతం రిజర్వేషన్ల అంశంలో ఎలాంటి పురోగతి లేదని, బీసీలను మోసం చేయడమే కాంగ్రెస్ ఉద్దేశం అని ఇవాళ స్పష్టమైందని లక్ష్మణ్ అన్నారు. ప్రభుత్వం తరపున వాదించే న్యాయవాదులకే వివరాలు తెలియదంటే బీసీల పట్ల ఈ ప్రభుత్వం ఎలాంటి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో ఇది స్పష్టంగా చూపిస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సున్నా సీట్లు సాధించి రాజకీయంగా కనుమరుగవుతోందంటూ గతంలో ఆ పార్టీ కూడా బీసీలను మోసం చేసిందని ఆరోపించారు.. ఇప్పుడు రాజకీయంగా తాము నిలబడలేకపోవడంతో బీసీల గురించి ముసలి కన్నీరు కారుస్తోంది.. పార్టీ సంస్థాగత ఎన్నికల్లో కూడా ఒక బీసీని నియమించలేని, నామినేటెడ్ మంత్రి పదవులు ఇవ్వలేని బీఆర్‌ఎస్ పార్టీ ఇవాళ బీజేపీని విమర్శించడమంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఎద్దేవా చేశారు.
రేవంత్ రెడ్డికి కొన్ని ప్రశ్నలు
మీరు కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు. ఇప్పుడు ఏ కోర్టులు మీకు అడ్డం వచ్చాయి? ఎందుకు చేయలేకపోతున్నారు? ఏటా రూ.20 వేల కోట్ల బడ్జెట్ బీసీల సంక్షేమం కోసం ఖర్చు పెడతామని చెప్పారు. కానీ ఇప్పటివరకు బడ్జెట్‌లో 4 శాతం కూడా కేటాయింపులు లేవు. ఏ కోర్టు అడ్డం వచ్చింది? మీకు నిజంగా బీసీల పట్ల ప్రేమ ఉంటే, సామాజిక న్యాయం జరగాలని చిత్తశుద్ధి ఉంటే కామారెడ్డి డిక్లరేషన్‌లో చెప్పినట్లు ప్రభుత్వ సివిల్ కాంట్రాక్ట్స్, కన్‌స్ట్రక్షన్స్, మెయింటెనెన్స్‌లో బీసీలకు 42% రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేకపోయారు? తెలంగాణలో ఒక్క కాంట్రాక్ట్‌లో అయినా అది అమలయ్యిందా? బీసీ యువత కోసం చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి, ఉన్నత విద్య కోసం వడ్డీ లేకుండా రూ.10 లక్షల వరకు రుణాలు ఇస్తామని మీరు చెప్పారు. ఇప్పటివరకు ఎంతమందికి ఆ రుణాలు ఇచ్చారు? అని ప్రశ్నించారు. బీసీ యువతకు చిన్న వ్యాపారాలు నిర్వహించుకునేందుకు, ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల వరకు పూచీకత్తు లేని, వడ్డీ లేని రుణాలు ఇచ్చామన్నారు. ఇంతవరకు ఎంత మందికి ఇచ్చారు? మొత్తం ఎంత ఇచ్చారు? దీనిపై స్పష్టత లేదు.అన్ని జిల్లా కేంద్రాల్లో రూ.50 కోట్లతో కన్వెన్షన్ హాల్, ప్రెస్ క్లబ్, స్టడీ సర్కిల్, లైబ్రరీ, క్యాంటీన్లతో కూడిన ప్రొఫెసర్ జయశంకర్ బీసీ సమీకృత భవనాలు నిర్మిస్తామన్నారు. ఇప్పటివరకు ఒక్క భవనం కూడా నిర్మించలేదు. ప్రతి మండలంలో నవోదయ విద్యాలయాలకు సమానంగా బీసీల కోసం ఒక కొత్త గురుకులం, ప్రతి జిల్లాలో ఒక కొత్త డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామన్నారు. ఈ విషయంలో ఇప్పటివరకు అడుగు కూడా ముందుకు పడలేదు. కామారెడ్డి డిక్లరేషన్‌లో పేర్కొన్న హామీలకు ఎక్కడా న్యాయస్థానాలు అడ్డుపడలేదు అని లక్ష్మణ్ అన్నారు. అన్ని బీసీ సంఘాలు, నాయకులు, యువత ఒక లక్ష్యంతో ముందుకు రావాలని, రాజకీయ డ్రామాలలో మోసపోకుండా మీ హక్కుల కోసం పోరాడండి.. బిజేపీ మీకు అండగా ఉంది అని ఆయన పిలుపునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





