- 8 లక్షల మంది విద్యార్థులకు 470 కోట్ల కేటాయింపు
- 3,943 విద్యాసంస్థలలో నాణ్యమైన ఆహారం
- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ప్రభుత్వ వసతి గృహాలతో పాటు సాంఘీక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల్లోని విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.470 కోట్లు కేటాయించిందని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,943 విద్యా సంస్థల్లోని 8 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుందని ఆయన తెలిపారు. ఇందులో 1,025 రెసిడెన్షియల్ పాఠశాలలు ఉండగా 313 ఆశ్రమపాఠశాలలు, 495 కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు( కేజిబివిఎస్) 2,100 సాంఘిక సంక్షేమ వసతి గృహాలు ఉన్నట్లు ఆయన వివరించారు. ప్రభుత్వ వసతి గృహాలలో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త మెనూ ప్రకటించిన నేపథ్యంలో ఆయన శనివారం మధ్యాహ్నం సికింద్రాబాద్ ఈస్ట్ మారేడుపల్లి లోని మహేంద్రహిల్స్‌లో ఉన్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొత్త మెనూను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణేష్ నారాయణ సాంఘిక సంక్షేమ శాఖా అధికారిణి శారద, ప్రిన్సిపాల్ సునీత, ఇందిరతో పాటు ఆయా పాఠశాల, జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థినిలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గడిచిన 8 ఏళ్లుగా అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం డైట్ చార్జీలు పెంచాకుండా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందే తడవుగా రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 40% పెంచిందని చెప్పారు. ఎస్సి, ఎస్టి, బిసి, మైనారిటీ విద్యార్థులతో పాటు ఆర్ధికంగా వెనుక బడిన విద్యార్థులల కళ్లలో వెలుగులు నింపాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు. అందులో భాగమే గతంలో మూడో తరగతి నుంచి ఏడో తరగతి వరకు చదువుకుంటున్న బాలబాలికలకు రూ.950 అందిస్తుండగా ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దానిని రూ.1330 కు పెంచిందన్నారు. అలాగే ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు 1100 నుంచి రూ. 1540లకు పెంచామన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలలు, టిఆర్ఇఐఎస్ లలో ఇంటర్ నుంచి పిజి వరకు విద్యార్థులకు రూ.1500 నుంచి రూ. 2100 పెంచినట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో పాటు పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించి ఆహార తయారీ నుంచి భోజన ఏర్పాట్ల వరకు క్షేత్ర స్థాయి లో మూడు నెలల పాటు శిక్షణ ప్రభుత్వ మానిటరింగ్ ఉంటుందన్నారు.
అదే సమయంలో ఆహార నాణ్యత ప్రమాణాలపై నిరంతరం నిఘా ఉంటుందని ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాయని ఆయన తెలిపారు గత 16 ఏళ్లుగా కాస్మొటిక్ చార్జీలు పెంచకపోవడంతో విద్యార్థినిలు పడుతున్న అవస్థలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 200% నికి పెంచిందని తెలిపారు. జనవరి, 2025 నుంచి అన్నీ ప్రభుత్వ పాఠశాలలతో పాటు వసతి గృహాలకు నాణ్యమైన సన్న బియ్యం సరఫరా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దిగువ, పేద, మధ్య తరగతి విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అందుకు అనుగుణంగా ఉన్నత ప్రమాణాలతో విద్యను అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. అందులో భాగంగానే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పూర్తి స్ధాయి మౌలిక సదుపాయాలతో 300 కోట్ల అంచనా వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాలలు ప్రారంభించబోతున్నామన్నారు.
మొదటి దశలో 28 అంతర్జాతీయ స్థాయి పాఠశాలలు రెండో దశలో 26 పాఠశాలలు ప్రారంభిస్తామన్నారు భవిష్యత్ నేటి విద్యార్థులదని అట్టి విద్యార్దులను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వొచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క లతో పాటు క్యాబినెట్ ఆమోదంతో మెగా డిఎస్సి ద్వారా ఏక కాలంలో 11,000 ఉపాధ్యాయులను నియమించిందన్నారు.మరో 6000 ఉపాధ్యాయ నియమాకాలు చేపట్టబోతున్నట్లు ఆయన ప్రకటించారు.