అవినీతిని క‌ప్పిపుచ్చుకోవ‌డానికే కె.సి.ఆర్‌.కు నోటీసులు

– ఇది ప్ర‌జాపాల‌న కాదు ప‌ర్సంటేజీల పాల‌న‌
– క‌మిష‌న్లు ఇవ్వ‌క‌పోతే ప‌నిజ‌ర‌గ‌దు
-హామీలు తీర్చ‌లేక చ‌తికిల‌బ‌డిన ప్ర‌భుత్వం
–  మీడియాతో కేటీఆర్

17 నెలలుగా పాలన చేతకాక, ఇచ్చిన హామీలను ఎలా అమలు చేయాలో తెలియక, తమ కమిషన్ల అవినీతి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే కాళేశ్వరం కమిషన్ తో కేసీఆర్‌కు నోటీసులు జారీచేశార‌ని  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు విమ‌ర్శిం చారు. ఒక వివాహ వేడుకలో పాల్గొనేందుకు న‌ల్గొండ వ‌చ్చిన ఆయ‌న బుధ‌వారం మీడియాతో ముచ్చ‌టించారు.కాంగ్రెస్ చెప్పుకున్న ప్రజాపాలన పర్సంటేజీల పాలనగా మారిందని ఆయ‌న ఆరోపించారు. 20 నుంచి 30 శాతం కమిషన్లు, పర్సంటేజీలు ఇవ్వకపోతే ఈ ప్రభుత్వంలో ఏ పని జరగదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులే బహిరంగంగా చెపుతున్నార‌ని గుర్తుచేశారు. ఉప ముఖ్యమంత్రి చాంబర్ ముందు కాంట్రాక్టర్లు ధర్నా చేసిన సంఘటన కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతికి పరాకాష్ట అన్నారు.

అధికారంలోకి వచ్చిన 17 నెలల కాలంలోనే పాలన చేతగాక ప్రజలకు ఇచ్చిన అడ్డగోలు హామీలను నెరవేర్చ‌ లేక కాంగ్రెస్ ప్రభుత్వం చతికిలపడిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఒక విఫల ప్రయోగంగా చూపించే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కుట్ర‌లో భాగ‌మే కె.సి.ఆర్.కు ఇచ్చిన నోటీసుల‌న్నారు. నోటీసుల‌న్నీ దూది పింజల మాదిరిగా  తేలిపోతాయన్నారు. దేశంలోని న్యాయవ్యవస్థ మీద తమకు అపార గౌరవం ఉందన్న కేటీఆర్, ముమ్మాటికి ధర్మం గెలుస్తుందన్నారు. తెలంగాణకు మేలు చేసిన వారిని దేవుడు కాపాడతాడన్న నమ్మకం ఉందన్నారు. కేవ‌లం క‌మిష‌న్ల వ‌ల్ల‌నే వేల‌కోట్లు ప్ర‌జాధ‌నం వృధా అయింద‌న్నారు.

సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే ఇప్పటివరకు ఆ నిర్మాణ సంస్థ మీద చర్యలు తీసుకోలేదు. కనీసం విచారణ కూడా జరపలేదని ఆరోపించారు. వట్టెం పంప్ హౌస్ మునగడం, పెద్దవాగు ప్రాజెక్టు రెండుసార్లు కొట్టుకుపోవడం మీద కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరపలేదన్న కేటీఆర్, బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం వెనుక ఉన్న మతల‌బేంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్ఎల్బీసి టన్నెల్ కూలి 3 నెలలు గడుస్తుంటే అందులో నుంచి శవాలను వెలికి తీయాల‌న్న ధ్యాస  ప్రభుత్వానికి లేదన్నారు. అసలు ఆ టన్నెల్ ఎందుకు కూలిందో విడ‌మ‌ర‌చి చెప్పే అవ‌గాహ‌న ముఖ్య‌మంత్రి, ఇత‌ర మంత్రుల‌కు లేద‌న్నారు.

కమిటీల పేరుతో, విచారణల పేరుతో కాలయాపన చేస్తూ ఆరు గ్యారంటీల అమలను పక్కనపెడదామనుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రయత్నాలను చూస్తూ ఊరుకోమని కేటీఆర్ హెచ్చరించారు. ఆడ‌బిడ్డ‌లు, వృద్ధుల‌కు ఇచ్చిన హామీల నెర‌వేర్చేందుకు ప్ర‌భుత్వంతో కొట్లాడ‌తామ‌న్నారు.   హామీలు అమలుచేయకుండా డిసెప్షన్, డిస్ట్రక్షన్, డిస్ట్రాక్షన్ అనే చిల్లరమల్లర ప్రయత్నాలు చేస్తే తెలంగాణ ప్రజలు తిరగబడే రోజు వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page