– బాధ్యతాయుత సాంకేతికతకు కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్
– ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 7 : కృత్రిమ మేధస్సు(ఏఐ) రంగంలో ప్రపంచ దేశాలకు తెలంగాణ సరికొత్త దిశానిర్దేశం చేస్తోందని, కేవలం పెట్టుబడులను ఆకర్షించడమే కాక పర్యావరణ పరిరక్షణ, సామాజిక ప్రయోజనాలను జోడించి ‘ఏఐ ప్రమాణాలకు దిక్సూచి’గా తెలంగాణ నిలుస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. హైదరాబాద్‌లోని హెచఐసిసి వేదికగా జరిగిన ‘గ్రీన్ గ్రోత్ ఎకానమిక్ సమ్మిట్-ది హైదరాబాద్ కలెక్టివ’ కార్యక్రమాన్ని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి ఆయన మంగళవారం ప్రారంభించారు. ‘ది మెరిడియన్ కలెక్టివ’ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు ఈ సమ్మిట్ జరగనుంది. వివిధ దేశాల ప్రతినిధులనుద్దేశించి డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ఏఐ అంటే కేవలం క్లౌడ్ కంప్యూటింగ్, సర్వర్లు మాత్రమే కాదని, దీని వెనుక విద్యుత్, నీరు, భూమి, మానవ వనరుల భాగస్వామ్యం ఉంటుందని ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు. తాము ఏఐ వద్దు అనడం లేదు.. కానీ అది ఎలా ఉండాలో ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తున్నాము అని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రకృతి వనరులను ముఖ్యంగా నీరు, విద్యుత్తును హరిస్తూ ఏఐని నిర్మించడం కాక పునరుత్పాదక ఇంధనం, బాధ్యతాయుతమైన వనరుల నిర్వహణతో తెలంగాణ ఏఐకి కేరాఫ్ అడ్రస్‌గా మారుతోందని పేర్కొన్నారు. పెట్టుబడులను ఆహ్వానించడంలో దూకుడుగా ఉన్నప్పటికీ అది పర్యావరణానికి, స్థానిక ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ‘కేవలం భూమి, నీరు, విద్యుత్ ఇచ్చి చేతులు దులుపుకునే పద్ధతి కాకుండా పరిశ్రమలు స్థానిక నైపుణ్యాలను పెంపొందించాలి.. స్వచ్ఛమైన ఇంధనాన్ని వాడాలి.. రీసైకిల్ చేసిన నీటిని మాత్రమే వినియోగించాలి.. ఇది కేవలం ఇంజనీరింగ్ మెరుగుదల కాదు, ఇది మన విలువలకు నిదర్శనం’ అని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కార్బన్ క్రెడిట్స్ గురించి చర్చిస్తున్న సమయంలో తెలంగాణ ‘పీపుల్స్ క్రెడిట’ అనే కొత్త భావనను తెరపైకి తెచ్చిందని వెల్లడించారు. ఏఐ పెట్టుబడులు కేవలం డేటా సెంటర్లకే పరిమితం కాకుండా స్థానిక ఉపాధిని పెంపొందించడం, గ్రామీణ యువతకు నైపుణ్యాలను అందించడం వంటి అంశాలకు ప్రాధాన్యతనివ్వాలని ప్రభుత్వం నిర్దేశిస్తున్నదని అన్నారు. పెట్టుబడులు రావాలి.. కానీ అవి స్వచ్ఛమైన ఇంధనంతో, పారదర్శకతతో, ప్రజల పట్ల గౌరవంతో రావాలని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కంపెనీలు కేవలం ఉద్గారాలను తగ్గించడమే కాకుండా స్థానిక మేధో సంపత్తిని మెరుగుపరిచే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.
రైతులకు, సామాన్యులకు భరోసా:
వ్యవసాయానికి, సామాన్యులకు దక్కాల్సిన నీటితో సాంకేతికత ఎప్పుడూ పోటీ పడకూడదని భట్టి నొక్కి చెప్పారు. నీటి వినియోగంలో అత్యంత బాధ్యతాయుతమైన విధానాలను అనుసరిస్తున్న ఏఐ వ్యవస్థలకే తెలంగాణ ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. ఏఐ సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలని, భాషా అడ్డంకులను తొలగించి, మహబూబాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు ఉన్న గ్రామీణ యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రకటించారు. నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు దేశం అనుసరించిన శాస్త్ర, సాంకేతిక వృద్ధి పథాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ మరింత ముందుకు తీసుకెళ్తోందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణ అంటే కేవలం డేటా సెంటర్ల కేంద్రం మాత్రమే కాదు.. ఆ డేటా సెంటర్లు ఎలా నిర్మించాలో ప్రపంచానికి నేర్పే ‘రోల్ మోడల’ అని గర్వంగా ప్రకటించారు. పరిశ్రమలకు స్వాగతం పలుకుతూనే ‘ప్రజల పక్షపాతి’గా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, భవిష్యత్తులో ప్రపంచ ఏఐ ప్రమాణాలను హైదరాబాద్ నిర్ణయించే స్థాయికి తీసుకువెళ్తాయన్నారు. పరిశ్రమలకు ప్రభుత్వం కల్పిస్తున్న అద్భుతమైన వాతావరణం, పారదర్శకమైన పాలన, మానవీయ విలువలతో కూడిన అభివృద్ధి విధానాలు పెట్టుబడిదారులకు గొప్ప భరోసానిస్తున్నాయన్నారు. రాబోయే రోజుల్లో ఏఐ మేధస్సుతోపాటు, మానవీయ వివేకం కూడా కలిగిన సంస్థలే ప్రపంచాన్ని ఏలుతాయని, ఆ దిశగా తెలంగాణ అడుగులు వేస్తోందని వివరించారు. కార్యక్రమంలో ఎనర్జీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్ కూఆ పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





