నిరర్ధక కార్పొరేషన్‌ల పునరుద్ధరణపై కార్యాచరణ

– ఆగ్రోస్‌ పునరుద్ధరణకు నివేదికలు ఇవ్వండి
– వ్యవసాయ శాఖ పరిధిలోని కార్పొరేషన్లపై మంత్రి తుమ్మల సమీక్ష

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 1: వ్యవసాయ శాఖ పరిధిలోని వివిధ కార్పొరేషన్‌ల ఆర్ధిక పరిస్థితి, అప్పులు, ఆస్తులపై పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని అధికారులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ శాఖ పరిధిలోని అనుబంధ కార్పొరేషన్‌ల స్థితిగతులపై సచివాలయంలో వ్యవసాయ శాఖ అనుబంధ శాఖల ఉన్నతాధికారులతో శనివారం జరిగిన సమావేశంలో సమీక్షించారు. చాలా కార్పొరేషన్లు అవి ఏర్పడినప్పుడున్న పరిస్థితులు, వాటి ఉద్దేశాలు, వాటికి గల ఆర్థిక, మానవ వనరులు, రైతులకు ఒనగూరే ప్రయోజనాలతో పోల్చుకుంటే కాలక్రమేణా జరిగిన మార్పులతోనో లేక పరిపాలనా సౌలభ్యమైన కారణాలతోనో కొన్నిటిపై పని ఒత్తిడి పెరిగగా, మరికొన్ని పూర్తిగా నిరర్థకం అయ్యాయన్నారు. చివరికి వాటిల్లోని ఉద్యోగుల జీతభత్యాలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో కార్పొరేషన్‌లు చేరుకున్నాయన్నారు. అంతేగాక ఒక్కటే పనిని 3,4 కార్పొరేషన్‌లు నిర్వహించడం (ఉదాహరణకు ఎరువుల, విత్తనాల సరఫరా), కార్పొరేషన్‌లకు సంబంధం లేని కొన్ని కార్యకలాపాల్లో అవి పాలు పంచుకోవడం వంటి వాటితో కొత్త సమస్యలు వచ్చాయన్నారు. వీటన్నిటినీ గమనించి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటి సంవత్సరం నుండే వాటిని గాడిలో పెట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. నేటి సమీక్షలో వాటి పని విధానం ఎలా సాగుతోంది, తమ పరిధి దాటి ఇతర పనులు చూస్తున్నారా, పనిభారం విధి విధానాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్పొరేషన్‌ల ఆర్ధిక పరిస్థితులు, రుణాలు, ఆస్తులపై పూర్తిస్థాయిలో వివరాలతో ప్రభుత్వానికి నివేదిక అందించాలని మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ అనుబంధ కార్పొరేషన్లు రైతాంగానికి సేవలందించేలా సమర్ధవంతంగా పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు. కొంతకాలంగా నిరర్ధకంగా మారిన అగ్రోస్‌ను పునరుద్ధరించాలని, అందుకు తగ్గ కార్యాచరణ సిద్ధం చేయాలనీ అధికారులకు సూచించారు. వ్యవసాయ శాఖ పరిధిలోని కార్పొరేషన్లన్నీ సమర్ధవంతంగా పనిచేసేలా పటిష్టమైన కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు సమావేశంలో వ్యవసాయశాఖ డైరక్టర్‌ గోపి, ఆయిల్‌ఫెడ్‌ ఎండీ యాస్మిన్‌ బాషా, మార్కెటింగ్‌ డైరెక్టర్‌ లక్ష్మీబాయి, ఆగ్రోస్‌ ఎండీ శ్రీరాములు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఆగ్రో ఇండ్రస్టీస్‌ డెవ‌ల‌ప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ

ఆగ్రో ఇండ్రస్టీస్‌ వెలవప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో మంత్రి తుమ్మల శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. సమయపాలన పాటించని సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శిథిలావస్థకు చేరిన ఎంఐటీ భవనాలు, నిర్వహణ సరిగా లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.

తుఫాన్‌ ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటాం

తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటించి రైతుల కష్టాలు చూశారని మంత్రి తుమ్మల చెప్పారు. ప్రతీ ఎకరాకు రూ.10 వేలు పంట నష్ట పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడిరచారు. తుఫాన్‌తో నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటామన్నారు. పత్తి రైతులు తేమ శాతం విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. మద్దతు ధర దక్కాలంటే జాగ్రత్తగా పత్తి ఆరబెట్టుకోవాలని సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page