– హుస్నాబాద్ నియోజకవర్గ రైతులకు మంత్రి పొన్నం హామీ
– వరద ప్రాంతాలు, తడిసిన ధాన్యం పరిశీలన
– ఓ రైతుకు తక్షణ సాయంగా రూ.10వేలు అందజేత
హుస్నాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 30 : తుఫాన్ కారణంగా ఊహించని విధంగా, ఎప్పుడూ లేనివిధంగా మూడు జిల్లాల పరిధిలో ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గంలో వర్షం కురిసింది.. వందలాది మెట్రిక్ టన్నుల ధాన్యం కొట్టుకుపోగా వేలాది మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసిపోయింది అని బీసీ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నియోజకవర్గంలో పంట నష్టంపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. ఇది ప్రకృతి వైపరీత్యం.. ఎవరూ ఆందోళన చెందవద్దు.. ప్రభుత్వం ఆదుకుంటుంది అని రైతులకు భరోసా ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాలను, హుస్నాబాద్ మార్కెట్ యార్డును గురువారం ఆయన పరిశీలించారు. వర్షానికి మార్కెట్‌లో ఉన్న తన ధాన్యం పూర్తిగా కొట్టుకుపోయిందని కన్నీటి పర్యంతమైన రైతు వీరవ్వకు తక్షణ సహాయం కింద రూ.10 వేలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి హుస్నాబాద్ పరిధిలో శుక్రవారం ఏరియల్ సర్వే నిర్వహిస్తారని, ఇక్కడికి కూడా రావాలని చెప్పామని తెలిపారు. అధికారులు రైతుల నష్టాన్ని, దెబ్బతిన్న రోడ్లను, కల్వర్టులను రికార్డు చేయాలని, మార్కెట్‌లో ఉన్న ధాన్యాన్ని వేగంగా కొనుగోలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు మంత్రి హామీ ఇచ్చారు. ముగ్గురు గల్లంతై మృత్యువాత పడ్డారని, వారి మృతదేహాలు దొరకాల్సి ఉందని చెప్పారు. అధికార యంత్రాంగం శ్రమిస్తోందని, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటాయని, పంట నష్టంతో పాటు ప్రాణ నష్టం,పశు నష్టం జరిగిందని, ఇది పెను విపత్తు అని చెప్పారు. దీనిని జాతీయ విపత్తుగా గుర్తించాలని, రాష్ట్రానికి కేంద్రం సాయం అందించాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు. గత 40 ఏళ్లలో ఇలాంటి వర్షం ఎప్పుడూ పడలేదు.. జాతీయ విపత్తు కింద పరిగణించి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. వ్యవసాయ, ంవెన్యూ, పోలీస్, అన్ని శాఖలు సమన్వయం చేసుకొని పని చేస్తున్నాయన్నారు. రోడ్లు తెగిపోయాయని, కల్వర్టులు కూలిపోయాయని, .భారీ నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం తరపున అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మార్కెట్ యార్డులో ఉన్న మొక్కజొన్న పూర్తిగా కొనుగోలు చేయాలని మార్క్‌ఫెడ్ అధికారులతో మాట్లాడారు. మొక్కజొన్న 18 క్వింటాళ్లకు పరిమితం అయితే 28 క్వింటాళ్లకు తీసుకోవాలని కోరారు. బాధితులకు అధికారులు, పార్టీ నాయకత్వం అండగా ఉంటుందని తెలిపారు. కోహెడ మండలం బస్వాపూర్ పోరెడ్డిపల్లిలో వరద ఉధృతికి తెగిపోయిన రోడ్లను, కొట్టుకుపోయిన కల్వర్టులను పరిశీలించారు. బస్వాపూర్ అక్కెనపల్లి మధ్య బ్రిడ్జి వద్ద మోయ తుమ్మెద వాగును పరిశీలించారు. రోడ్లపై ఆరబోసిన వడ్లు వరదకు మొత్తం కొట్టుకుపోయిన ప్రాంతాలను, ముంపులోనే ఉన్న వరి పంటలను పరిశీలించి ఆవేదన చెందుతున్న రైతులతో మాట్లాడారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





