ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదు

– హైకోర్టు తీర్పుపై సీఎంతో మంత్రి ఉత్తమ్ చర్చలు
– తదుపరి కార్యాచరణపై సమాలోచనలు
– సీబీఐ విచారణకు తీర్పు అడ్డం కాదన్న ఉత్తమ్

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. జస్టిస్ ఘోష్ కమిషన్ ఏర్పాటు సరైనదని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసిందని తెలిపారు. సీబీఐకి ఘోష్ కమిషన్ పంపిన రిపోర్టుల్లో ఎవరి పేర్లను పేర్కొనలేదని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డితో మంత్రి ఉత్తమ్ బుధవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్, హైకోర్టు తీర్పుపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మీడియాతో చిట్‌చాట్ చేశారు. జస్టిస్ ఘోష్ కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 6ను కొట్టివేయాలని పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారని, కానీ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం 1952లోని సెక్షన్ 3 ప్రకారం జీవో ఎంఎస్ నం.6 ద్వారా ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ రాజ్యాంగబద్ధమేనని న్యాయస్థానం స్పష్టం చేసిందన్నారు. కమిషన్ నియామకాన్ని పూర్తిగా సమర్థించిందని తెలిపారు. కమిషన్ ఫైండింగ్స్‌ను కూడా హైకోర్టు తప్పుపట్టలేదని చెప్పారు. కమిషన్ ఏర్పాటు అధికార పరిధిని మించింది కాదని, అసమంజసం కాదని, అక్రమం కాదని కూడా న్యాయస్థానం స్పష్టం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు. జ్యుడీషియల్ కమిషన్ విచారణ నివేదికలో కొందరు బాధ్యులపై చేసిన నిర్దారణలపై హైకోర్టు అభ్యంతరం తెలిపిందని చెప్పారు. పిటిషనర్లకు నిర్ణీత ఫార్మాట్ ప్రకారం నోటీసు ఇవ్వలేదనే టెక్నికల్ అంశాన్ని తప్పుపట్టిందన్నారు. కమిషన్ నివేదిక ఆధారంగా వారిపై చర్యలు తీసుకోవద్దని పిటిషనర్లకు రిలీఫ్ ఇచ్చిందని చెప్పారు. ఇప్పటికే తమ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన లోపాలు, అవకతవకలపై సీబీఐతో విచారణ చేపట్టాలని నిర్ణయించిందని, దీనిపై సీబీఐకు లేఖ రాశామని ప్రస్తావించారు. హైకోర్టు తీర్పు సీబీఐ విచారణకు అడ్డంకి కాదని, న్యాయస్థానం ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. హైకోర్టు పూర్తి తీర్పును పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందనేది ముమ్మాటికీ నిజమన్నారు. ప్రాజెక్టుకు ఎంచుకున్న స్థలం నుంచి డిజైన్లు, నిర్మాణాలు, నిర్వహణ అన్నిచోట్లా అవకతవకలు జరిగాయని, అన్నీ లోపాలే ఉన్నాయని, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వారికి నోటీసులు ఇవ్వలేదనే కారణంగా వాళ్లపై కమిషన్ చేసిన రిమార్క్స్ మాత్రమే ఇన్ ఆపరేటివ్‌గా ఉంటాయని హైకోర్టు తెలిపిందని అన్నారు. ఇది పూర్తిగా ప్రొసీజరల్, టెక్నికల్ అంశమని చెప్పుకొచ్చారు. కాళేశ్వరం ప్రజల కళ్లముందే కుంగిపోయిందని, 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీలో ఏడో బ్లాక్ కుంగిపోయిందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఆ బ్యారేజీ దగ్గరకు వెళ్తే ఎవరికైనా కుంగిన తీరు కనపడుతుందన్నారు. బీఆర్ఎస్ హయాంలో రూ.లక్ష కోట్లతో నిర్మించిన బ్యారేజీ వారి హయాంలోనే మూడేళ్లకే కుంగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు కారణాలేమిటో తేల్చాల్చిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. నేషనల్ డ్యామ్ సేప్టీ అథారిటీ కూడా బ్యారేజీల కుంగుబాటుకు దారి తీసిన కారణాలు, డిజైన్ల, నిర్మాణం, నిర్వహణ లోపాలపై తన ప్రాథమిక నివేదికను బీఆర్ఎస్ హయాంలోనే సమర్పించిందని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన లోపాలు, అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన రిటైర్డ్ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కూడా ఇంజనీర్లను, ఐఏఎస్‌లను, అప్పటి పరిపాలనా బాధ్యులను విచారించి నివేదికను వెల్లడించిందని తెలిపారు. బాధ్యులెవరు, దోషులెవరు, ఎక్కడెక్కడ తప్పులు జరిగాయో తేలుస్తామని స్పష్టం చేశారు. ఏమేం లోపాలున్నాయో.. ఎన్‌డీఎస్ఏతోపాటు విజిలెన్స్, పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలపై ఆగస్టులోనే తమ ప్రభుత్వం అసెంబ్లీలో చర్చకు పెట్టిందని ప్రస్తావించారు. గత ఏడాది సెప్టెంబర్ 1న తమ ప్రభుత్వం ఈ దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ జీవోతోపాటు నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు. హైకోర్టు తీర్పుతో సీబీఐ విచారణకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. రెండేళ్లుగా ఆ ప్రాజెక్టు నుంచి చుక్క నీరు అందలేదన్నారు. ఏటా ఈ ప్రాజెక్టు పేరిట ప్రభుత్వం రూ.15 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల వరకు అప్పులు, వడ్డీలు భరిస్తున్నదని చెప్పారు. కేవలం రెండు పిల్లర్లు కాదని.. మొత్తం ఫౌండేషన్, మొత్తం మూడు బ్యారేజీల పునాదులు అనుమానాస్పదంగా ఉన్నాయని దేశంలో పేరొందిన సంస్థల నిపుణులందరూ అభిప్రాయపడ్డారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా మానవ తప్పిదమని, దేశంలోనే ఇది అతి పెద్ద విధ్వంసమని చెప్పారు. అమూల్యమైన ప్రజాధనం వృథా అయిందని.. దీనికి బాధ్యులెవరో ప్రజల ముందు నిలబెట్టాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ నేతల సంబరాలు ఎందుకో: పీసీసీ చీఫ్ మహేష్ 

హైదరాబాద్ : కాళేశ్వరంపై హైకోర్టు క్లీన్ చిట్ ఇవ్వకున్నా బీఆర్ఎస్ నేతలు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. హైకోర్టు తీర్పు సీబీఐ విచారణకు అడ్డంకి కాదన్నారు. హైకోర్టు తీర్పును పూర్తిగా అధ్యయనం చేశాక భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ పలువురికి నోటీసులు ఇవ్వలేదని మాత్రమే హైకోర్టు చెప్పిందని వివరించారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను హైకోర్టు తప్పుపట్టలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ కమిషన్ విచారణ చేసి ఇచ్చిన నివేదికను కూడా హైకోర్టు తప్పుపట్టలేదన్నారు. రూ.లక్ష కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు కూలిపోయిందని ఆయన మండిపడ్డారు. కమీషన్ల కక్కుర్తి వల్లే కాళేశ్వరం కూలిందని ఆరోపించారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, ఏటీఎంలా మారిందని అమిత్ షా, నడ్డా చేసిన వ్యాఖ్యలు వాస్తవం కాదా అనేది కిషన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. హైకోర్టు చెప్పిన కొన్ని అంశాలను చూసి సంబరాలు చేసుకుంటున్నారని బీఆరఎస్‌పై మహేశ్ గౌడ్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న ఎన్‌డీఎసఏ కూడా కాళేశ్వరం నిర్మాణంలో లోపాలు ఉన్నాయని చెప్పిందని తెలిపారు. హైకోర్టు ఎక్కడా బీఆరఎస్ అవినీతికి పాల్పడలేదని చెప్పలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో కట్టిన ప్రాజెక్టు వారి హయాంలోనే కూలిందన్నారు. ఆలస్యమైనా దోషులు జైలుకు వెళ్లక తప్పదని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.

కాళేశ్వరం అవినీతి జగమెరిగిన సత్యం : కోదండరామ్

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై టీజేఏసీ అధ్యక్షుడు కోదండరాం స్పందించారు. హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ నేతలు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని, లోపాలు ఉన్నాయని ‘కాగ’, విజిలెన్స్, ఎన్‌డీఎస్ఏ రిపోర్టులు ఇచ్చాయని తెలిపారు. ఈ నివేదికల ఆధారంగా కూడా చర్యలు తీసుకోవచ్చన్నారు. విచారణ చేయకపోతే సీబీఐదే తప్పవుతుందన్నారు. కాళేశ్వరంలో తప్పు జరిగిందని తెలుస్తున్నప్పుడు చర్యలు తీసుకోడానికి ఇబ్బంది ఏంటని కోదండరాం ప్రశ్నించారు. ‘బ్యారేజ్ నిర్మాణంలో పిల్లర్లు కుంగిపోయినవి మనకు కనిపిస్తున్నది కదా.. ఇంకేం కావాలి’ అని అన్నారు. కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు ఎవరికీ¡ చెంపపెట్టు కాదని కోదండరాం స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *