మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
ములుగు, ప్రజాతంత్ర, జూన్ 19: మహిళా సంఘాలను బలోపేతం చేసి వారికి ఆర్థికంగా ఎదిగేలా చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. గురువారం ములుగు జిల్లాలోని జగ్గన్నపేట గ్రామం ఆశ్రమ జూనియర్ కళాశాల ప్రాంగణంలో కుట్టు మిషన్ ఉచిత శిక్షణ పూర్తిచేసుకున్న మహిళలకు కుట్టు మిషన్, ధ్రువపత్రాలను మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర టిఎస్, గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవి చందర్ తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. చాలా మంది నైపుణ్యం లేని కారణంగా ఉపాధికి దూరంగా ఉంటున్నారని, దూర ప్రాంతాలకు పనికోసం వెళ్లి అనేక అవస్థలు పడి ఇంటికి వెనుతిరిగి వొస్తున్నారని తెలిపారు. ఈ పరిస్థితి దృష్టిలో పెట్టుకొని మహిళలు వారికి అందుబాటులోనే ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఆలోచనతో కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం పనిచేస్తున్నదని అన్నారు. వివిధ పాఠశాలల్లో అవసరమైన మేరకు ఏకరూప దుస్తులను మహిళా సంఘాలకు ఆర్డర్ ఇచ్చి వారి ద్వారా దాదాపు 30 కోట్ల రూపాయల లాభం చేకూర్చామని తెలిపారు. భవిష్యత్తులో విద్యాసంస్థలలోని పిల్లలకు కూడా మహిళా సంఘాల ద్వారానే దుస్తులు కుట్టించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 15 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వయస్సున్న మహిళలు తప్పకుండా మహిళా సంఘాల్లో చేరాలని పిలుపునిచ్చారు. మహిళా సంఘాలకు పెట్రోల్ బంక్ లు, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, బస్సులు, సోలార్ విద్యుత్తు ఉత్పత్తి అవకాశాలను కల్పిస్తున్నామని తెలిపారు. మహిళలు ప్రభుత్వ పథకాలను వినియోగించుకొని ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు.
కలెక్టర్ మాట్లాడుతూ మహిళల ఆర్థికాభివృద్ధి కోసం మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో జగ్గన్నపేట గ్రామంలో వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి నెలవారీ ఆదాయం వచ్చేలా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని ఇప్పటికే 3 కంపెనీలతో చర్చించామని తెలిపారు. కార్యక్రమంలో ముందుగా జిల్లా సంక్షేమ అధికారి తుల రవి మాట్లాడుతూ జగ్గన్నపేటలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని జిల్లా మహిళా సాధికారత కేంద్రం ములుగు ఆధ్వర్యంలో డేటా ప్రో సంస్థ శిక్షణ సహకారంతో గత నెల రోజులుగా గ్రామంలోని అర్హులైన 175 మంది మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ ఇప్పించామని అన్నారు. అనంతరం డేటాప్రో సంస్థ నిర్వాహకులు రవీందర్ మాట్లాడుతూ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో ఇంతటి భారీ కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతంగా ఈ కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. అనంతరం లబ్దిదారులకు మొదటి విడతగా 75 కుట్టు మిషన్లను మంత్రి అందజేశారు. అనంతరం ఐసిడిఎస్ ములుగు ప్రాజెక్టు సిడిపిఓ శిరీష ఆధ్వర్యంలో అమ్మమాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా స్థానిక అంగన్వాడీ కేంద్రంలో చేరిన చిన్నారులకు మంత్రి సీతక్క, కలెక్టర్లు అక్షరాభ్యాసం చేశారు. పిల్లలు మంత్రి సమక్షంలో ఎంతో ఉల్లాసంగా పాటలు పాడి వినిపించారు. పిల్లల ఉత్సాహాన్ని చూసి మన అంగన్వాడీ పిల్లలు కార్పొరేట్ కు దీటుగా ఉత్సాహంగా చదవడం ఎంతో సంతోషంగా ఉందని సిబ్బందిని మంత్రి అభినందించారు. కార్యక్రమంలో డిఎస్పి రవీందర్, ట్రైబల్ వెల్ఫేర్డి డి పోచం, ఎం పి డి రామక్రిష్ణ, జిల్లా మహిళా సాధికారతా కేంద్రం రమాదేవి, ఓంకార్, ఐసిడిఎస్ ములుగు ప్రాజెక్టు పరిధిలోని వివిధ సెక్టార్ల సూపర్వైజర్లు, జిల్లా మహిళా సాధికారతా కేంద్రం, సఖి, డేటాప్రో సంస్థల సిబ్బంది, శిక్షణ లో పాల్గొన్న మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.