- ఉస్మానియా రిజిస్ట్రార్ ఇచ్చిన ఉత్తుర్వు రద్దు చేయాలి.
- నిర్బంధ వ్యతిరేక వేదిక కన్వీనర్ ప్రొఫెసర్ జి.హరగోపాల్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 19: తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయాలు పోరాడకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగలేదని, ప్రపంచ వ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు సరికొత్త ఆలోచనలతో ప్రపంచ ప్రగతికి ఎంతగా దోహదం చేస్తున్నాయో అలాగే ప్రగతి నిరోధక విధానాలను నిలువరించడానికి కూడా ప్రశ్నలను, చర్చలకు ఉద్యమాలను ముందుకు తీసుకు వస్తున్నారని నిర్బంధ వ్యతిరేక వేదిక కన్వీనర్ ప్రొఫెసర్ జి.హరగోపాల్ (Professer Haragopal) ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాల్యం నుంచి అనేక అడ్డంకులను అధిగమించి విద్యార్థులు కొత్త ఆశలతో, ఆశయాలతో విశ్వవిద్యాలయాల స్థాయికి ఎదిగి వొస్తారని, ఈ స్థాయిలో సమాజం కోసం ఆలోచించే ప్రశ్నించే, పోరాడే స్వేచ్ఛకు విద్యార్థులకు పూర్తి అవకాశాలుండాలని చెప్పారు. ఇటీవల ఓయూ రిజిస్ట్రార్ ఉస్మానియా విద్యార్థుల స్వేచ్ఛను హరిస్తున్న ఉత్తర్వులు విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రజా పాలనను అపహాస్యం చేసే చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. . ఈ చర్యను నిరసిస్తూ వెంటనే ఈ ఉత్తర్వు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
బాబా సాహేబ్ అంబేడ్కర్ కు డాక్టరేట్ పట్టా ఇచ్చి గౌరవించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం తన చరిత్రను తానే చెరిపి వేసుకుంటూ అప్రజాస్వామిక ఉత్తుర్వులివ్వటం సరైన చర్య కాదు. విశ్వ విద్యాలయాలకు చర్చలు, సమావేశాలు జరిపే స్వేచ్ఛ అవసరమైతే పోరాడే స్వేచ్ఛకు ఆటంకాలుండకూడదు. గత ప్రభుత్వం ప్రజాస్వామిక స్వేచ్ఛను హరించినందుకు, అక్రమ కేసులతో వేధించినందుకే ఆ ప్రభుత్వాన్ని ప్రజలు దింపేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వపు దారినే ఎంచుకుంటే ప్రజాస్వామ్య పునరుద్ధరణ హామీ ఏమైనట్టు? అన్ని విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఉస్మానియాలో విధించిన నిర్బంధ ఉత్తర్వు రద్దు కోసం పోరాడాలని ప్రొఫెసర్ హరగోపాల్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా ఈ ఉత్తర్వు రద్దు చేయించాలని డిమాండ్ చేశారు.