మల్లు స్వరాజ్యం పోరాటాలతోనే స్ఫూర్తి పొందాను..

  • ఆమె విగ్రహ ఏర్పాట్లు నా వంతు పాత్ర పోషిస్తా..
  • మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 19 : మల్లు స్వరాజ్యం పోరాటాల నుంచి తానును స్ఫూర్తి పొందానని, మల్లు స్వరాజ్యం తరహాలోని నేను అడవి నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టానని మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) అన్నారు. బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన మల్లు స్వరాజ్యం మూడవ వర్ధంతి సభకు ముఖ్యఅతిథిగా మంత్రి సీతక్క హాజరై మాట్లాడారు.

ఉన్నత కుటుంబంలో పుట్టి వందలాది ఎకరాలను త్యాగం చేసి పేదల కోసం పోరాటాలు చేశారు. ములుగు, నర్సంపేట వంటి ప్రాంతాల్లో దళ కమాండర్ గా మల్లు స్వరాజ్యం పనిచేశారు. మల్లు స్వరాజ్యం జీవితాన్ని చదివి ప్రజా జీవితంలోకి అడుగుపెట్టాను. జనంతో మమేకం అవ్వడం మల్లు స్వరాజ్యం నుంచి నేర్చుకున్నాను. మల్లు స్వరాజ్యం లాగానే నా జీవితం కూడా సాగింది. అడవి నుంచి బయటికి వొచ్చిన తర్వాత రాజకీయ రంగాన్ని నేను ఎంచుకోవడానికి మల్లు స్వరాజ్యమే కారణం.తెలంగాణ అంటేనే పోరాటం, త్యాగం. ఆ పోరాటానికి త్యాగానికి మల్లు స్వరాజ్యం నిలువెత్తు రూపం. తెలంగాణ త్యాగధనుల చరిత్ర భవిష్యత్ తరాలకు అందించేందుకు మా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు..

మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టాం. తెలుగు యూనివర్సిటీకి తెలంగాణ వైతాళికుడు సూరవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాం. ప్రజా యుద్ధనౌక గద్దర్ ను గుర్తు చేసే విధంగా ఆయన పేరుతో అవార్డులు ఇస్తున్నాం. తెలంగాణ మట్టి మనుషులైన గోరటి, పాశం యాదగిరి వంటి వారికి సన్మానాలు చేశాం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ద్వారా తెలంగాణకు విముక్తి కలిగింది. విముక్తి పోరాటంలో కీలక పాత్ర పోషించిన మల్లు స్వరాజ్యం ప్రజలకు గుర్తుండేలా పనిచేస్తాం. మల్లు స్వరాజ్యం ఫస్ట్ ఏర్పాటులో ఆమె విగ్రహ ఏర్పాట్లు నా వంతు పాత్ర పోషిస్తానని మంత్రి సీతక్క పేర్కొన్నారు. మహిళా సమానత్వం కోసం, పేదరిక నిర్మూలన కోసం మల్లు స్వరాజ్యం చివరి వరకు పోరాడారు. ఆమె స్ఫూర్తిగా పేదరిక నిర్మూలన కోసం, వివక్షత లేని సమాజ నిర్మాణం కోసం మనమంతా పనిచేయాలని సీతక్క పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page