భారతదేశంలో మహిళలు, పిల్లల ఆరోగ్యం, పోషకాహార లోపంపై జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) గణాంకాలు దేశ సామాజిక-ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ప్రపంచ వేదికలపై ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, గ్లోబల్ సూపర్ పవర్‌గా ఎదిగిపోతున్నామని భారతదేశం చాటుకుంటున్న వేళ.. దేశ భవిష్యత్తుకు వెన్నెముక లాంటి మహిళలు, బాలల ఆరోగ్యం మాత్రం పాతాళానికి పడిపోతోందనే చేదు నిజాన్ని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) గణాంకాలు బట్టబయలు చేశాయి. అభివృద్ధి అంటే కేవలం ఆకాశహర్మ్యాలు, ఎక్స్‌ప్రెస్‌వేలు నిర్మించడం మాత్రమే కాదు; దేశ పౌరుల శారీరక, మానసిక ఆరోగ్యమే నిజమైన ప్రగతికి కొలమానం. కానీ, ఇటీవల వెలుగులోకి వొస్తున్న డేటా మరియు వాస్తవాలు పరిశీలిస్తే, క్షేత్రస్థాయిలో ఆకలి, పోషకాహార లోపం ఒక నిశ్శబ్ద మహమ్మారిలా దేశాన్ని లోపలి నుంచి తొలిచేస్తున్నాయనే భయంకరమైన సత్యం బహిర్గతమయింది.
ఏదైనా ఒక సమస్యను పరిష్కరించాలంటే మొదట ఆ సమస్య ఉందనే విషయాన్ని అంగీకరించాలి. కానీ, పాలకులు తమ వైఫల్యాలు ఎక్కడ బయటపడతాయోననే భయంతో డేటాను దాచడానికి లేదా మసిపూసి మారేడు కాయ చేయడానికి ప్రయత్నించడం అత్యంత ఆందోళనకరం. అధికారిక సర్వేల్లోని కొన్ని కీలక పారామీటర్లను మార్చడం లేదా డేటా విడుదలను ఆలస్యం చేయడం ద్వారా వాస్తవాలను కప్పిపుచ్చలేరు. ఐదేళ్ల లోపు పిల్లల్లో తీవ్రమైన పోషకాహార లోపం (Acute Malnutrition), వయసుకు తగ్గ బరువు లేకపోవడం (Underweight) వంటి గణాంకాలు కేవలం సంఖ్యలు కావు; అవి ఈ దేశ భవిష్యత్ పౌరుల జీవన్మరణ సమస్యలు. పాలకుల నిర్లక్ష్యానికి, లోపభూయిష్టమైన విధానాలకు ఇవి సజీవ సాక్ష్యాలు.
దేశంలో ప్రతి ఐదుగురు పిల్లల్లో ఒకరు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతుండటం ఏ నాగరిక సమాజానికైనా తలవంపులే. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే, 6 నుండి 23 నెలల వయసు గల పసి పిల్లలలో 84 శాతానికి పైగా పిల్లలకు కనీస పోషకాలు కలిగిన ఆహారం అందడం లేదు. మానవ మేధస్సు, శారీరక ఎదుగుదల అత్యంత వేగంగా జరిగే ఈ కీలక వయసులోనే పిల్లలకు సరైన ఆహారం అందకపోతే, భవిష్యత్తులో వారు ఎలాంటి మానవ వనరులుగా ఎదుగుతారు? మూడో వంతు పిల్లలు తక్కువ బరువుతో పుడుతుండటం, లేదా పెరుగుతుండటం మన అంగన్‌వాడీ వ్యవస్థ, మధ్యాహ్న భోజన పథకాల వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. ప్రభుత్వాలు ప్రచారాలకు పెడుతున్న ఖర్చులో సగం కూడా ఈ పసిప్రాణాలను కాపాడటానికి పెట్టడం లేదనడానికి ఈ అంకెలే నిదర్శనం.
మరోవైపు, దేశ జనాభాలో సగభాగంగా ఉన్న మహిళల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. 15 నుండి 49 సంవత్సరాల వయసు గల మహిళల్లో 57 శాతం మంది రక్తహీనత తో బాధపడుతున్నారు. అలాగే ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరు తీవ్రమైన పోషకాహార లోపానికి గురవుతున్నారు. ఒక అనారోగ్యకరమైన, రక్తహీనత కలిగిన తల్లి ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వడం అసాధ్యం. ఇది ఒక విషవలయం లాగా తరం నుండి తరానికి కొనసాగుతూనే ఉంది. ‘బేటీ బచావో, బేటీ పఢావో’ వంటి నినాదాలు గోడల మీద కనిపిస్తున్నాయి తప్ప, ఆడబిడ్డల కడుపు నింపడంలో పథకాలు క్షేత్రస్థాయిలో కుంటుపడుతున్నాయనేది స్పష్టమవుతోంది.





