“ఉపాధ్యాయుల అంకిత భావం, తల్లిదండ్రుల కు ప్రభుత్వ విద్య పట్ల విశ్వాసం కలిగించి నందు వల్ల రాష్ట్రం లో కొన్ని పాఠశాలలు అత్యధిక సంఖ్యలో నమోదు అయి ఉన్నాయి. ఇటువంటి పాఠశాలలను కనుక టీచర్ల కొరత లేకుండా విద్యా శాఖ అన్నీ వసతులు కల్పించి సిబ్బంది కొరత లేకుండా చూసే విధానం తీసుకురావాలన్నారు. అప్పుడు మిగతా స్కూల్స్ కు తల్లిదండ్రులకు సమాజానికి ఒక మంచి సందేశం వెళుతుంది. ప్రైవేటు కు డబ్బులు ఎక్కువై కాదు పోయేది అందుబాటులో అన్నీ వసతులతో బోధన సిబ్బంది కొరత లేని పాఠశాలలు అందు బాటు లో లేక ప్రైవేటు కు వెళుతున్నారు..” :-టీచర్ శ్రీనివాస్ రెడ్డి

(పాఠశాలకు వెళ్ళిన అనుభవాలు)
బహదూరపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డి సార్ మాటలు మదిలో మెదులుతున్నాయి. మేడ్చల్ జిల్లా గండిమైసమ్మ దిండిగల్ మండలం లోని బహుదూర్ పల్లి లో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఒక వైపు పెద్ద పెద్ద బిల్డింగులు పక్కనే మల్లారెడ్డి యూనివర్సిటీ లంకంత క్యాంపస్ మధ్యలో దేశం నలుమూలల నుండి పొట్ట చేత పట్టుకుని పట్నం వచ్చిన వేలాది రోజుకూలి శ్రామికుల కుటుంబాలు. ఒక మాటలో చెప్పాలంటే మినీ ఇండియా అనొచ్చు. ఈ కుటుంబాల పిల్లలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న సైన్స్ టీచర్ శ్రీనివాస్ రెడ్డి గారితో పాఠశాల సందర్శించడం జరిగినది. శ్రీనివాస్ రెడ్డి గారు జిల్లా సైన్స్ అధికారి కూడా.
చదువుకు కదిలిన ఈ మొదటి తరం పిల్లల కు అందుబాటు లో ఉన్న ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాల . ప్రాథమిక పాఠశాల 350 మంది విద్యార్థులు ఉన్నత పాఠశాలలో 460 మంది విద్యార్థులు నమోదు అయి ఉన్నారు. సరిపోని వసతుల తో ఎక్కువ మంది విద్యార్థులతో సతమతమౌతున్న పాఠశాలకు రెండేళ్ల క్రితం ట్రాన్స్ఫర్ మీద ఈ పాఠశాలకు వచ్చిన శ్రీనివాస్ రెడ్డి గారు . పేద పిల్లల చదువు కు ప్రభుత్వ పాఠశాలలే శరణ్యమని నమ్మి ఎక్కడ పని చేసిన తనదైన ముద్ర వేసే ఉపాధ్యాయుడు వాటిని కాపాడాలని తపన తో రంగం లోకి దిగారు.
OSAAT (One School At A Tiime ) బెంగుళూరు మరియు రౌండ్ టేబుల్ లాంటి దాతలను గుర్తించి తన పాఠశాల అవసరాలను వివరించి అనేక తరగతి గదులే కాకుండా తాను కలలు కనే పాఠశాల మా పిల్లలు ఎవరికి తీసిపోమని కంప్యూటర్ల ల్యాబ్ , ఐటీ ల్యాబ్ లు కాన్ఫరెన్స్ హాల్ సైన్సు టీచర్ కాబట్టి అనుకుంటా ఒక birds’ sanctuary కి కూడా ఉపాయం చేస్తున్నాడు. కిచెన్ షెడ్ అందులో స్టీమ్ కూకర్ లాంటి అధునాతన వంట సామగ్రి ని అందుబాటు లోకి తెచ్చారు. ఇలా చాలా వసతులను దాతలను ఒప్పించి పనులు చేయించు కుంటున్నారు. తన స్కూల్ మాత్రమే కాకుండా తాను పని చేసే ఇతర పాఠశాలలకు కూడా ఈ దాతల ద్వారా దాదాపు 50 తరగతి గదులను నిర్మించడానికి దోహద పడ్డారు శ్రీనివాస్ సర్.
ఏడాదికి ఏడాది ప్రభుత్వ బడులలో నమోదు తక్కువ అవుతున్నాయని ఆందోళన చెందుతున్న పరిస్థితులలో ఈ హైస్కూల్ లో ఒక్కొక్క తరగతి రెండు సెక్షన్లు గా పది సెక్షన్ లు నడుస్తున్నాయి. టీచర్లు మాత్రం అదే ఎనిమిది మంది మాత్రమే పని చేస్తున్నారు. విధాన లోపం కారణంగా పిల్లలు ఉన్న పాఠశాలలకు టీచర్లు ఉండరు. టీచర్లు ఉన్న పాఠశాలలలో పిల్లలు ఉండరు.
దాతలు మౌలిక వసతులు అయితే ఇవ్వగలరు కానీ బోధన సిబ్బంది కి వారి సంస్థల నియమాలు అనుమతించవని కారణంగా టీచర్ల కొరత గురించి చాలా ఆందోళన లో ఉన్నాడు . పాఠ శాల వసతులు బోధన ఉపాధ్యాయుల అంకిత భావం చూసి చుట్టుపక్కల ఉన్న అనేక మంది పేద వర్గాల కు చెందిన కొత్త పిల్లలు ప్రైవేటు బడి మాని మా బడికి వస్తామంటున్నారు. కానీ సరి అయిన బోధన అందచేయకుండా పిల్లలకు న్యాయం చేయలేమని నిస్సహాయత తో కూడిన ఆందోళన వ్యక్త పరిచారు శ్రీనివాస రెడ్డి గారు.
పూర్తి కాలం ఉపాధ్యాయుల నియామకం జరిగే వరకైనా ఎనిమిది మంది ఉపాధ్యాయులకు తోడుగా మరో ఎనిమిది మంది విద్యా వాలంటీర్లకు సహాయం(సుమారు ఏడాదికి రూ. 10 లక్షలు) అందిస్తే అద్భుతాలు సృష్టిస్తా మంటున్నారు శ్రీనివాస్ సర్.
ఉపాధ్యాయుల అంకిత భావం, తల్లిదండ్రుల కు ప్రభుత్వ విద్య పట్ల విశ్వాసం కలిగించి నందు వల్ల రాష్ట్రం లో కొన్ని పాఠశాలలు అత్యధిక సంఖ్యలో నమోదు అయి ఉన్నాయి. ఇటువంటి పాఠశాలలను కనుక టీచర్ల కొరత లేకుండా విద్యా శాఖ అన్నీ వసతులు కల్పించి సిబ్బంది కొరత లేకుండా చూసే విధానం తీసుకురావాలన్నారు. అప్పుడు మిగతా స్కూల్స్ కు తల్లిదండ్రులకు సమాజానికి ఒక మంచి సందేశం వెళుతుంది. ప్రైవేటు కు డబ్బులు ఎక్కువై కాదు పోయేది అందుబాటులో అన్నీ వసతులతో బోధన సిబ్బంది కొరత లేని పాఠశాలలు అందు బాటు లో లేక ప్రైవేటు కు వెళుతున్నారని తన సుదీర్ఘ అనుభవాన్ని పాఠశాల సందర్శించినప్పుడు భారంగా చెప్పిన మాటలు మా ‘పిల్లలకు సహాయం అవుతుందంటే ఎవరు ముందు తల వంచడానికైనా తయార్’ అంటున్న సార్ కు సార్ లాంటి ఎంతో మంది అదృశ్య ఉపాధ్యాయులకు తల వంచి వినమ్ర నమస్కారం చేస్తూ..





