అందుబాటులోకి మ్యారేజ్ రిజిస్ట్రేషన్, మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్లు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 30: తెలంగాణ ఈ-గవర్నెన్స్‌కు ప్రతీకగా నిలిచిన మీ సేవ పౌరసౌకర్యాల విస్తరణలో మరో ముందడుగు వేసింది. ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆదేశాల మేరకు మ్యారేజ్ రిజిస్ట్రేషన్, భూముల మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్ వంటి కొత్త సేవలను సోమవారం ఆవిష్కరించింది. వీటి కోసం స్లాట్ బుకింగ్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. నూతన పౌర సేవల ప్రారంభం మీ సేవ కార్యక్రమాల పనితీరును శ్రీధర్‌బాబు సచివాలయంలో సమీక్షించారు. ఈ కొత్త సేవలు ప్రజలకు మరింత పారదర్శకతతో కూడిన, వేగవంతమైన సేవలుగా మారనున్నాయి. భూమి, అపార్టుమెంట్ విలువల అంచనాలను 24 గంటల్లోపు ఆమోదించేలా చర్యలు చేపడుతున్నారు. మ్యారేజ్ రెజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ఇకపై సమర్థవంతంగా జరుగనుంది. ఇకపై టీ-ఫైబర్, అదనపు కియాస్క్‌లు కూడా రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసి ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత దగ్గర చేస్తామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.