– 39 ఎస్టీపీలను మంజూరు చేసిన కేంద్రం
– మెట్రో రెండో దశపై సానుకూలంగా పరిశీలిస్తాం
– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కేంద్ర పట్టణ శాఖ మంత్రి ఖట్టర్
న్యూదిల్లీ, మే 20 : కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో కొనసాగుతున్న వివిధ కీలక ప్రాజెక్టులపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో సమావేశమై సమీక్ష నిర్వహించినట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నగరాభివృద్ధి, మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, ప్రజా రవాణాకు సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపై విస్తృతంగా చర్చించామన్నారు. ముఖ్యంగా భాగ్యనగరంలోని మూసీ నది పరిశుభ్రతకు సంబంధించిన అంశంపై ఖట్టర్ కీలక వివరాలను వెల్లడించారన్నారు. కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకంలో భాగంగా మూసీ నదిలో కలుస్తున్న మురుగు నీటిని శుద్ధి చేసేందుకు మొత్తం 39 సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను(ఎస్టీపీలను) మంజూరు చేసినట్లు, ఈ ప్రాజెక్టుల మొత్తం వ్యయం రూ.3,975 కోట్లని వివరించినట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. వీటి ద్వారా రోజుకు 972 మిలియన్ లీటర్ల మురుగు నీటిని శుద్ధి చేసే సామర్థ్యం ఉందన్నారు. దీని వల్ల శుద్ధి చేయని వ్యర్థపు నీరు నేరుగా మూసీలో కలవకుండా నిరోధించడంతోపాటు మూసీ పరిరక్షణ, నగర పారిశుధ్య మెరుగుదలకు ఇది ఎంతో దోహదపడుతుందని ఖట్టర్ తెలిపారన్నారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టుకు సంబంధించిన అంశంపైనా సమావేశంలో చర్చ జరిగిందని కిషన్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎల్ అండ్ టీ సంస్థ నుంచి టేకేవర్ చేసుకున్న నేపథ్యంలో మిగిలిన రెండో దశ పనులకు సంబంధించిన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్), ఇతర సాంకేతిక వివరాలు అందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటుందని ఖట్టర్ తెలిపారన్నారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టుకు సూత్రప్రాయంగా కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 ఖర్చు చేసే ప్రాతిపదికన కేంద్రం ముందుకెళ్లేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 162 కి.మీ మేర రెండో దశ విస్తరణకు ప్రతిపాదనలు సమర్పించినట్లు పేర్కొన్న ఆయన దానిపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి తదుపరి చర్యలు చేపడుతుందని వెల్లడించారని తెలిపారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారం అందిస్తోందని మనోహర్‌లాల్ ఖట్టర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారని, వారికి హైదరాబాద్ ప్రజల తరపున ధన్యవాదములు తెలియజేశానని కిషన్‌రెడ్డి తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





