సింగరేణికి ‘నైనీ’ న‌ల్ల బంగారం

– తెలంగాణ ఇంధన భద్రతలో చారిత్రక ఘట్టం
– ఒడిశా నుంచి జైత్రయాత్రగా రాష్ట్రానికి వచ్చిన నల్ల బంగారం
– 1,131 కి.మీ ప్రయాణించి సింగరేణి థర్మల్ కేంద్రానికి చేరిన తొలి రేక్
– అమెరికా నుంచి శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి

మంచిర్యాల, ప్రజాతంత్ర, ఆగస్టు 6 : రాష్ట్ర ఇంధన అవసరాలు తీర్చే దిశగా సింగరేణి చరిత్రలో అత్యంత అద్భుతమైన, చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఏళ్లతరబడి కాగితాలకే పరిమితమైన ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్.. ప్రజా ప్రభుత్వం రాకతో, పాలకుల చిత్తశుద్ధితో ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. రాష్ట్ర ప్రజల విద్యుత్ అవసరాలను తీర్చడమే లక్ష్యంగా, ఒడిశా రాష్ట్రంలోని సింగరేణి నైనీ బొగ్గు గని నుంచి లోడ్ చేసిన తొలి బొగ్గు రైల్వే ¹రేక్ సుమారు 1,131 కి.మీ ప్రయాణం పూర్తి చేసి గురువారం ఉదయం మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం(ఎస్టీపీపీ)కి చేరుకుంది. ఇతర రాష్ట్రంలోని సింగరేణి గని నుంచి రాష్ట్రానికి బొగ్గు సరఫరా కావడం సంస్థ చరిత్రలో ఇదే తొలిసారి కావడంతో ఎస్టీపీపీలో పండగ వాతావరణం నెలకొంది. తెలంగాణ ఇంధన భద్రతలో ఇది ఒక సువర్ణాధ్యాయం.

నేడు సాకారమైన స్వప్నం

కేంద్ర బొగ్గు శాఖ 2015లో సింగరేణికి నైనీ బొగ్గు బ్లాక్‌ను కేటాయించింది. అయితే అధికారంలో ఉన్న తొమ్మిదేళ్ళు గత బీఆరఎస్ ప్రభుత్వం ఈ బ్లాక్‌ను గాలికి వదిలేసింది. దీంతో అనుమతులు రాక ప్రాజెక్టు పడకేసింది. కానీ, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. అనుమతుల సాధనలో ఎదురైన ఎన్నో అడ్డంకులను తొలగించుకుంటూ చేస్తూ రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి కూడా అయిన భట్టి విక్రమార్క అలుపెరగని కృషి చేశారు. స్వయంగా రెండుసార్లు ఒడిశా పర్యటనకు వెళ్లారు. 2024 జులైలో తొలిసారిగా ఒడిశా వెళ్లి అక్కడి ప్రభుత్వంతో, అధికారులతో జరిపిన చర్చలు సత్ఫలితాలు ఇచ్చాయి. అడ్డంకులన్నీ తొలగిపోవడంతో 2025 ఏప్రిల్ 16న నైనీ గనిలో బొగ్గు ఉత్పత్తిని డిప్యూటీ సీఎం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఆరుగాలం శ్రమించిన ఫలితంగా నేడు నైనీ నుంచి తొలి బొగ్గు రేక్ తెలంగాణ గడ్డపైకి చేరుకుంది. నైనీ బొగ్గు గని నుంచి తెలంగాణలోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి బొగ్గు తరలింపు ఒక చారిత్రక అవసరం. రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తిలో కీలకమైన ఈ థర్మల్ కేంద్రానికి నాణ్యమైన బొగ్గును అందించేందుకు తొలి రైలు రేక్ ఏకంగా 1,131 కి.మీ ప్రయాణించింది. 59 బాక్స్ వ్యాగన్ల ద్వారా నాలుగు వేల టన్నుల అత్యుత్తమ జీ-10 గ్రేడ్ బొగ్గు సింగరేణికి చేరుకుని రాష్ట్ర ఇంధన రంగానికి కొత్త కళను తీసుకొచ్చింది.

నైనీ గని ప్రత్యేకతలు ఇవే

ఈ గని రాష్ట్ర విద్యుత్ రంగానికి రాబోయే దశాబ్దాలపాటు వెన్నెముకగా నిలవనుంది. సింగరేణి కీర్తి కిరీటంలో ఇది మరో కలికితురాయిగా మిగిలిపోనుంది. 2015 ఆగస్టు 13న కేంద్ర ప్రభుత్వం సింగరేణి కేటాయించింది. 340.78 మిలియన్ టన్నులు వార్షిక బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం. ఏడాదికి కోటి టన్నులు (10 మిలియన్ టన్నులు). గని జీవితకాలం 36 సంవత్సరాలు. బొగ్గు నాణ్యత అత్యుత్తమ జీ-10 గ్రేడ్.

తొలి రైల్వే రేక్‌కు సింగరేణి అధికారుల ఘన స్వాగతం 

సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి చేరుకున్న తొలి నైనీ బొగ్గు రైల్వే రేక్‌కు సంస్థ డైరెక్టర్(ఆపరేషన్స్) ఎల్.వి.సూర్యనారాయణ, డైరెక్టర్ (ఈడిఎం) ఎం.తిరుమలరావు ఘన స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం కోల్ యార్డులో బొగ్గు అన్‌లోడింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ, తిరుమలరావులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ విద్యుత్ అవసరాలకు పెద్దపీట వేస్తూ నైనీ గని నుంచి బొగ్గు సరఫరా ప్రారంభించామని చెప్పారు. ఇప్పటివరకు సింగరేణి ఇతర రాష్ట్రాలకు బొగ్గు సరఫరా చేసిందని, అయితే ఇప్పుడు ఇతర రాష్ట్రంలోని తన గని నుంచి స్వరాష్ట్రానికి బొగ్గు తరలించడం సంస్థ చరిత్రలో అరుదైన ఘట్టమని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రత్యేక చొరవతో ఇటీవల తాడిచెర్ల-2, మణుగూరు డిప్‌సైడ్ బ్లాకులు సంస్థకు లభించాయని, త్వరలో మరికొన్ని గనులను కూడా సింగరేణికి సాధించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్టీపీపీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి.చిరంజీవి, జనరల్ మేనేజర్ నర్సింహారావు, గుర్తింపు కార్మిక సంఘం నాయకుడు వీరభద్ర, ప్రాతినిధ్య కార్మిక సంఘం నాయకుడు, కనీస వేతనాల అమలు కమిటీ చైర్మన్ జనప్రసాద్, అధికారుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీపతి గౌడ్, ఇతర అధికారులు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.

సింగరేణి మైనింగ్ ఇక విశ్వవ్యాప్తం
– అమెరికా నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వీడియో సందేశం

నైనీ బొగ్గు రాక సందర్భంగా ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అక్కడినుంచే సింగరేణి యాజమాన్యానికి, కార్మికులకు వీడియో సందేశం ద్వారా ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ‘సింగరేణికి ఇది ఒక చరిత్రాత్మక సందర్భం. రాష్ట్ర అవసరాలు తీర్చడమే కాక దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా సింగరేణి బొగ్గును సరఫరా చేస్తోంది. పెరుగుతున్న రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే మనం తాడిచర్ల-2 బ్లాక్‌ను పొందాం. ఇటీవల వేలంలో మణుగూరు బ్లాక్‌ను దక్కించుకున్నాం. భవిష్యత్తులో మరిన్ని బ్లాకులను పొందటానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది. రాబోయే వందేళ్లలో సింగరేణి కేవలం బొగ్గు గనులకే పరిమితం కాకుండా క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ మినరల్స్ తవ్వకాల్లోకి కూడా అడుగుపెట్టాలి. ప్రపంచంలోనే అత్యుత్తమ మైనింగ్ సంస్థలతో పోటీపడే స్థాయికి సింగరేణి ఎదగాలి. అందుకోసం ప్రపంచంలో ఎక్కడ అందుబాటులో ఉన్న అత్యాధునిక మైనింగ్ యంత్రాలనైనా తెచ్చేందుకు సిద్ధం. ఇందులో భాగంగానే క్యాటర్‌పిల్లర్ కంపెనీకి చెందిన ఆధునిక మైనింగ్ పరికరాలను పరిశీలిస్తున్నాం. భవిష్యత్ తరాలకు ఉజ్వలమైన భవిష్యత్తును అందించే ఈ నూతన ప్రక్రియ మొదలైన నేటి రోజు ఒక చరిత్రాత్మక దినంగా నిలిచిపోతుంది’ అన్నారు. ఒడిశా నుంచి తెలంగాణకు తొలి బొగ్గు రవాణా విజయవంతం కావడంలో సహకరించిన తెలంగాణ ప్రభుత్వం, ఒడిశా ప్రభుత్వం, భారతీయ రైల్వేలు, సంబంధిత అధికారులు, ఉద్యోగులకు సంస్థ సీఎండీ డాక్టర్ బుద్దప్రకాశ్ జ్యోతి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *