– అప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 12 : దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటినుండి నేటివరకు భారత్ ఎంతో ప్రగతి సాధించిందని, ముఖ్యంగా డిజిటల్ ఇండియా, సాంకేతిక అభివృద్ధి, పెట్టుబడుల సాధనలో దేశం మైలురాళ్లను అధిగమించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎన్.రామచందర్ రావు గుర్తు చేశారు. ఎస్‌వీపీ ఆధ్వర్యంలో బుధవారం ఇక్కడ నిర్వహించిన సైన్స్ ఫండ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. సైన్స్, శాస్త్రీయ ఆవిష్కరణల రంగానికి కూడా తగిన ఆర్థిక సహాయం అందించడం చాలా అవసరమని పేర్కొన్నారు. భారత దేశం అనేక రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేసిందని, సైన్స్ రంగానికి కేవలం ప్రభుత్వం నుంచే కాక ప్రైవేట్ భాగస్వాముల నుంచి కూడా ఫండింగ్ పెరిగినప్పుడే నూతన ఆవిష్కరణలు, ఎంఎస్‌ఎంఈ రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ మరింత దృఢపడుతుందని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవడం ప్రతి ఒక్కరికీ గర్వకారణమని రామచందర్ రావు అన్నారు. ఇటీవల ప్రారంభించిన యÖపీఐ విధానం ద్వారా నేడు ప్రపంచవ్యాప్తంగా జరిగే మొత్తం డిజిటల్ లావాదేవీలలో ఒక్క భారతదేశానిదే 40 శాతం వాటా ఉండటం మన సాంకేతిక రంగానికి నిదర్శనమని చెప్పారు. ఇటువంటి తరుణంలో ఎస్‌వీపీ వంటి సంస్థలు ముందుకు వచ్చి నూతన ఆవిష్కర్తలకు, స్టార్టప్‌లకు ఫండింగ్ అందించి ప్రోత్సహించడం అభినందనీయమని, ఇది దేశానికి మరింత ఉజ్జ్వలమైన ఆర్థిక భవిష్యత్తును అందిస్తుందని ఆకాంక్షిస్తూ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




