ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

– చర్చా కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 19 : నేటి డిజిటల్ యుగంలో జర్నలిజం రంగం వేగంగా మారుతున్న నేపథ్యంలో మీడియా వృత్తిదారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ముందుకు సాగాలని పలువురు సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు. మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన నాంపల్లిలోని మీడియా అకాడమీ భవనంలో మంగళవారం నిర్వహించిన జర్నలిస్టుల చర్చా కార్యక్రమంలో పలువురు సీనియర్ జర్నలిస్టులు, అకాడమీకి అనుబంధ సభ్యులు పాల్గొని మీడియా రంగ భవిష్యత్ దిశ, డిజిటలైజేషన్, మీడియా చట్టాలు, శిక్షణ కార్యక్రమాలు, జర్నలిస్టుల సంక్షేమ అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ జి.ముకుంద్ రెడ్డి జర్నలిస్టులను అభినందించారు. జర్నలిజం డిగ్రీ చదివే రోజుల్లో పత్రికల ఎడిటోరియల్స్ చదవడం ద్వారా సివిల్ సర్వీసులపై ఆసక్తి పెరిగిందని, అదే తన విజయానికి పునాది అయిందని తెలిపారు. ఐ.వెంకట్ రావు మాట్లాడుతూ మీడియా అకాడమీ చేపడుతున్న కార్యక్రమాలను అభినందిస్తూ మరిన్ని పుస్తకాలను అకాడమీకి అందజేస్తానని తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్ మాట్లాడుతూ జర్నలిజం తనకు ధైర్యం, గుర్తింపు ఇచ్చిందని పేర్కొంటూ అకాడమీకి కృతజ్ఞతలు తెలిపారు. ఉదుముల సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆధునిక జర్నలిజానికి అనుగుణంగా అకాడమీ డిజిటల్ క్లాసులు, ఇంక్యుబేటర్ ఏర్పాటు చేయాలని, గ్యాగ్ ఆర్డర్ వంటి అంశాలపై చర్చలు నిర్వహించాలని సూచించారు. దేవులపల్లి అమర్ మాట్లాడుతూ 16 మంది వెటరన్ జర్నలిస్టుల వీడియోలను పుస్తకాల రూపంలో తీసుకురావాలని కోరారు. మీడియా రంగంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) ప్రభావం పెరుగుతోందని, జర్నలిస్టులు నూతన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన |ంపొందించుకోవాల్సిన అవసరం ఉందని పలువురు సభ్యులు సూచించారు. మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఆధునిక శిక్షణ కార్యక్రమాలు, ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాములు, డెస్క్ జర్నలిస్టులకు ప్రత్యేక శిక్షణలు నిర్వహించాల్సిన అవసరం ఉం<న్నారు. అకాడమీ భవనంలోని డిజిటల్ సదుపాయాలు, ఆధునిక ఆడిటోరియం, బోర్డు రూమ్, లైబ్రరీ, కంప్యూటర్ రూమ్ వంటి వసతులను మరింత సమర్థవంతంగా వినియోగించి జర్నలిస్టులకు ప్రయోజనం కలిగించాలని అభిప్రాయపడ్డారు. పాత పత్రికలు, అరుదైన పుస్తకాలు, నిజాం కాలం నాటి ప్రచురణలు, తెలుగు గ్రంథాలు తదితరాలను డిజిటలైజ్ చేసి భవిష్యత్ తరాలకు అందుబాటులో ఉంచాలని సూచించారు. పలువురు సీనియర్ జర్నలిస్టులు తమ వద్దనున్న విలువైన పుస్తకాలను మీడియా అకాడమీ లైబ్రరీకి విరాళంగా అందిస్తామని తెలిపారు. సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ మీడియా చట్టాలలో కాలానుగుణ మార్పులు అవసరమని, సోషల్ మీడియాకు ప్రత్యేక ప్రవర్తనా నియమావళి తీసుకురావాలని పేర్కొన్నారు. మహిళా జర్నలిస్టులు, గ్రామీణ జర్నలిస్టుల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. జర్నలిజం అనేది సమాజానికి అద్దం పట్టే వృత్తి అని, భయపడకుండా నిజాయతీతో వార్తలను ప్రజలకు అందించాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉందని పేర్కొన్నారు. మీడియా అకాడమీ 1996 నుండి జర్నలిస్టుల అభివృద్ధికి విశేష సేవలు అందిస్తోందని, పుస్తక ప్రచురణలు, మోనోగ్రాఫ్‌లు, శిక్షణ కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని అభినందించారు. సీనియర్ జర్నలిస్టులు కె.రామచంద్రమూర్తి, కేశవరావు దాసు, ఎస్.నాగేష్ కుమార్, బండారు శ్రీనివాస్ రావు, రవీందర్ ఎం.పీ., దిలీప్ రెడ్డి, మాదభూషి శ్రీధర్, ఎం.సుబ్బారావు, జగన్, ఆర్.వి.రామారావు, ఎస్.వినయ్ కుమార్, వై.నరేందర్ రెడ్డి, విరాహత్ అలీ, తదితరులు మీడియా రంగంలో వస్తున్న మార్పులు, డిజిటలైజేషన్, జర్నలిస్టుల శిక్షణ, మీడియా చట్టాలు, సోషల్ మీడియా ప్రభావం, పుస్తక ప్రచురణలు, అకాడమీ భవిష్యత్ కార్యాచరణపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. జర్నలిస్టుల సంక్షేమం, శిక్షణ, డిజిటలైజేషన్, మీడియా ఆధునీకరణ దిశగా అకాడమీ మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. సమావేశానికి హాజరైన ప్రముఖులందరినీ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వర రావులు సత్కరించారు.
—————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *