ఎమ్మెల్యే బీర్ల అక్రమాలపై చర్యలు తీసుకోండి

– పట్టణ సీఐకు బీఆర్‌ఎస్‌ నాయకుల ఫిర్యాదు

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28: అధికార దుర్వినియోగం చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు కర్ర వెంకటయ్య డిమాండ్‌ చేశారు. పార్టీ ముఖ్య నాయకులతో కలిసి యాదగిరిగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో పట్టణ సీఐ భాస్కర్‌ను మంగళవారం కలిసి ఫిర్యాదు చేశారు. తనపై వస్తున్న అక్రమ ఆస్తుల ఆరోపణల నుంచి దృష్టి మరల్చేందుకే పార్లమెంటు సభ్యుడు చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి, ఎమ్మెల్యే అయిలయ్య గత సోమవారం హరీష్‌రావుపై ఫిర్యాదు చేసినట్టు ఆరోపించారు. ఎమ్మెల్యే స్వగ్రామమైన సైదాపురం మాసాయిపేట గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్‌ 726లో సుమారు 15 ఎకరాల భూమిని రైతులను మోసం చేసి స్పెక్ట్రా వెంచర్‌కు విక్రయించాలని కోరారని, ఆ వెంచర్‌ను డెవలప్‌ చేసి కస్టమర్లను మోసం చేసి ప్లాట్లు విక్రయించాడన్నారు వెంచర్‌లో ఎలాంటి అభివృద్ధి చేయకపోవడంతో కస్టమర్లకు ప్లాట్లు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. దీనిపై విచారణ చేపట్టాలని కోరారు. రాజపేట మండలంలోని చల్లూరు గ్రామంలో సర్వే నెంబర్‌ 322లో 600 ఎకరాలు సీలింగ్‌ భూమిని ఎలాంటి డాక్యుమెంట్‌ లేకుండా అక్రమంగా తన పేరున క్రమబద్ధీకరించుకున్నాడని వెంకటయ్య పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం ఇటీవల సుమారు రూ.200 కోట్ల విలువచేసే 100 ఎకరాల భూములను అక్రమ మార్గంలో సంపాదించాడని తుర్కపల్లికి చెందిన సాధారణ వ్యక్తి ఏసీబీ, ఆదాయ పన్నుల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడని, దీనిపై సమగ్రంగా విచారించాలని కోరారు. బొమ్మలరామారం మండలంలోని రంగాపూర్‌ గ్రామ రెవెన్యూ పరిధిలోని సుమారు 20 ఎకరాల భూమిని వివాదంలో ఉండగా సెటిల్మెంట్‌ చేసి తీసుకున్నట్లు ఆరోపణలున్నాయని గుర్తు చేశారు. రాజపేట మండలంలోని చల్లూరు గ్రామంలో ఎలాంటి పరిపాలనా అనుమతులు, గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండానే క్రషర్‌ నిర్మాణం చేపట్టారని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారన్నారు. హైదరాబాదులోని ఉప్పల్‌ చెరుకట్ట వద్ద ఎకరం భూమి, నాగోల్‌లోని రూ.13 కోట్ల భవనం, బంజారాహిల్స్‌లోని రూ.13 కోట్ల విల్లాస్‌ తదితర స్థిరాస్తులు ఎలా కొనుగోలు చేశారని ప్రశ్నించారు. సాంబార్‌ కొండ కింద నిర్మాణంలో ఉన్న పార్కింగ్‌, చెరువు ఎలిపాడు ప్రాంతంలో మట్టి కాంట్రాక్టులో కాంట్రాక్టుకు డబ్బులు చెల్లించకుండా అక్రమాలకు పాల్పడి సుమారు రూ.50 కోట్లు స్వాహా చేసినట్టు తమ దగ్గర ఆధారాలున్నాయని చెప్పారు. ఫిర్యాదు చేసిన వారిలో పిఎస్‌సిఎస్‌ చైర్మన్‌ ఇమ్మడి రామ్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు మిట్ట వెంకటయ్య, కసావు శ్రీనివాస్‌, పట్టణ సెక్రటరీ జనరల్‌ పాపట్ల నరహరి, పేరు పాయింట్‌ సత్యనారాయణ, కొన్యాల నరసింహారెడ్డి, అశోక్‌ తదితరులు ఉన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page