గిరిజ‌న సంక్షేమ శాఖ ఆధ్వ‌ర్యంలో సాంస్కృతిక శాఖ‌

  • గిరిజ‌నుల అస్తిత్వ ప‌రిర‌క్ష‌ణ‌కు కృషి
  • మంత్రి సీత‌క్క‌

లోకేశ్వ‌రం (నిర్మ‌ల్ జిల్లా), ప్ర‌జాతంత్ర‌, మే 27:  త్వరలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక శాఖ ను ఏర్పాటు చేసి గిరిజన జాతుల, తెగల అస్తిత్వాన్ని ఔన్నత్యాన్ని పరిరక్షించే ప్రయత్నం చేస్తామని  పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka)  తెలిపారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం గ్రామం లో ఆదివాసుల పోరాటయోధుడు కొమరం భీం విగ్రహవిష్కరణ అనంతరం మాట్లాడారు. నాయక్ పోడ్ తెగ వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.  ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను ఆ జాతుల ఆస్తులుగా అభివర్ణిస్తూ, ఆయా జాతుల భాషా, వేష, ఆట, పాట, మరియు దేవుళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే గొండ్, కోలాం, లంబాడ ఇలా కొన్ని జాతులే గుర్తొస్తాయి, నాయక్ బోడ్ తెగ ఉందనే విషయం చాలా మందికి తెలియదు అని అన్నారు. నాయక్ బోడ్ తెగ గోదావరి పరివాహ ప్రాంతమైన మైదాన ప్రాంతంలో ఉన్నారని అయిన ఇంకా గుర్తింపు రాలేదని అన్నారు. వరంగల్ జిల్లాలో కోయ భాష అంతరించిపోతున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఒకింత బాధను వ్యక్తపరిచారు. కొంతమంది గిరిజన తెగలకు చెందిన వారు భాషను వేషధారణను దూరం పెడుతున్నారని ని ఆవేదన వ్యక్తం చేశారు.

ములుగు లాంటి ప్రాంతంలో కూడా ఆ పరిస్థితి నెలకొంది అని గుర్తుచేశారు. నాయక్ బోడ్ తెగ ఉన్నట్లుగా జిల్లా అధికారులకు కూడా తెలియట్లేదని చెబుతూ, సదరు తెగలు ఐకమత్యాన్ని కలిగి ఉండాలి అని అన్నారు. ఐక్యంగా ఉంటేనే అధికారులు, నాయకులు గుర్తిస్తారని చెప్పారు. కులగణనలో కూడా తమ తెగను ఎస్టీ నాయక్ బోడ్ తెగ గా న‌మోదు చేయించుకోవాల‌ని  చెప్పారు. ప్రభుత్వం తరపున ప్రత్యేక గుర్తింపు కోసం ఉన్నతాధికారులతో, ముఖ్యమంత్రితో మాట్లాడుతానని అన్నారు. నకీలీ ఎస్టీ సర్టిఫికెట్స్ రాకుండా జాగ్రతలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఏ తెగ జాతి అయిన జయించాలి అంటే, పిల్లలు బాగా చదువుకోవాలి అని, ఐక్యంగా ఉండాలి అన్నారు. నాయక్ బోడ్ కమ్యూనిటీ కి ఏ కష్టం వచ్చిన తనను సంప్రదించాల్సిందిగా పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, అధికారి, పేద, అణగారిన వర్గాల పక్షాన పనిచేస్తున్నదని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page