– ప్రజల వ్యతిరేకతను మూటకట్టుకోవద్దు
– లైసెన్స్‌డ్ సర్వేయర్లకు మంత్రి పొంగులేటి సూచన
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 19: చిన్న అవకతవక కూడా జరగకుండా, ప్రజల వ్యతిరేకతను కొనితెచ్చుకోకుండా ప్రజా ప్రభుత్వ ఆలోచనలకనుగుణంగా చిత్తశుద్దితో పనిచేయాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంపికైన సర్వేయర్లను కోరారు. మీరు ఈ లైసెన్స్‌లు పొంది సంతోషించినట్లే ప్రజలను కూడా మీ పనులతో సంతోషింపచేయాలని, తద్వారా ప్రభుత్వానికి పేరు తేవాలని ఉద్బోధించారు. సర్వేయర్లుగా శిక్షణ పొందిన అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా శిల్ప కళావేదికలో ఆదివారం లైసెన్సులు అందజేసిన అనంతరం లైసెన్సులు పొందిన సర్వేయర్లతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆయన మాట్లాడుతూ దశాబ్దాల తరబడి తీవ్ర అసంతృప్తితో ఉన్న తెలంగాణ రైతాంగానికి లైసెన్స్‌డ్ సర్వేయర్ల నియామకం రూపంలో రాష్ట్ర ప్రభుత్వం దీపావళి కానుకను అందించిందని మెంత్రి పొంగులేటి అన్నారు. కార్యక్రమానికి మంత్రి పొంగులేటి అధ్యక్షత వహించి ప్రసంగించారు. గత ప్రభుత్వం ధరణి పేరిట చేసిన తప్పులను తమ ప్రభుత్వం సరిదిద్దే కార్యక్రమాన్ని చేపట్టిందని, దీనిలో భాగంగా 3456 మందికి లైసెన్స్‌లు మంజూరు చేశామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు నిరుద్యోగ యువతను దృష్టిలో పెట్టుకొని రెవెన్యూలో భాగమైన సర్వే వ్యవస్ధను పటిష్టం చేసేందుకు ఆలోచించి దరఖాస్తులను ఆహ్వానించామన్నారు. దీనికి బీసీ. ఈబీసీ. ఎస్సీ ఎస్టీ తదితరాలకు చెందిన పదివేల మంది దరఖాస్తు చేసుకోగా ఏడువేల మందికి శిక్షణ ఇచ్చామని, వీరిలో 3456 మంది క్షేత్రస్ధాయిలో తర్ఫీదు పొంది ఎంపికయ్యారని, వీరికి నేడు ముఖ్యమంత్రి చేతుల మీదుగా లైసెన్స్‌లు అందజేస్తున్నామని వివరించారు. నాడు జీపీవో వ్యవస్ధ, భూభారతి, సాదాబైనామాల తదితర విషయాల్లో అలక్ష్యం జరిగినందున సమస్యల పరిష్కారానికి సుమారు 9.80 లక్షల దరఖాస్తులు వచ్చాయని, వీటిని తమ ప్రజా ప్రభుత్వం దశలవారీగా పరిష్కరిస్తోందని చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





