ఈ గ‌డ్డపై ప్రతీ పోరాటం భూమి చుట్టూ జరిగిందే

– ‘ధరణి’తోనే బీఆర్‌ఎస్‌ మట్టికరిచింది
– బాధ్యతగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి
– సర్వేయర్లకు లైసెన్సుల పంపిణీలో సీఎం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 19: మనమంతా భూమిని కన్న తల్లిలా భావిస్తాం.. భూ యజమానుల హక్కులను కాపాడి భూ సరిహద్దులను నిర్ణయించే బాధ్యత మీపై పెట్టబోతున్నాం.. మీరు తప్పు చేస్తే మీకే కాదు.. ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది.. అందుకే ప్రతీ ఒక్కరు బాధ్యతగా పనిచేయండి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొత్తగా లైసెన్సులు పొందిన సర్వేయర్‌ అభ్యర్థులకు హితవు పలికారు. గత ప్రభుత్వంలో తెచ్చిన ధరణి చట్టం కొద్దిమంది దొరలకు చుట్టంగా మారిందని, ఆ ధరణి భూతంతో భూమిపై ఆధిపత్యాన్ని చెలాయించాలనుకున్న దొరలకు గత ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారని తెలిపారు. లైసెన్సుడ్ స‌ర్వేయ‌ర్లుగా శిక్ష‌ణ పొందిన అభ్య‌ర్థుల‌కు శిల్పకళా వేదికలో ఆదివారం మధ్యాహ్నం లైసెన్స్‌లు అందజేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. అధికారంలోకి వస్తే ధరణి దరిద్రాన్ని వదిలిస్తామని ఆనాడు మేం మాట ఇచ్చాం.. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే ధరణి భూతం నుంచి ప్రజలకు విముక్తి కల్పించి భూభారతి చట్టం తెచ్చామని వివరించారు. పదేళ్లుగా ఉద్యోగ నియామకాలపై గత పాలకులు నిర్లక్ష్యం వహించగా ప్రజా ప్రభుత్వం రావ‌డంతోటే ఉద్యోగ నియామక ప్రక్రియను చేపట్టి నిరుద్యోగుల కళ్లల్లో ఆనందం చూస్తున్నామని చెప్పారు. 2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని, ఆ దిశగా ముందుకెళ్లేందుకు మీ సహకారం ఉండాలని కోరారు. లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల నియామకంతో తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం దీపావళి కానుక ఇచ్చిందన్నారు. రైతే దేశానికి వెన్నెముక.. అలాంటి రైతుకు అండగా ఉండండి.. తెలంగాణ అభివృద్ధిలో మీరూ భాగస్వాములు కండి.. ప్రజల కోసం పనిచేయండి- ప్రభుత్వ ఆశయం నెరవేర్చండి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మందుల సామేల్‌, నాగరాజు, జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి, పలు కార్పొరేషన్‌ చైర్మన్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page