– ఈ విప్లవ ద్రోహలకు ప్రజలు శిక్ష విధించాలి
– విప్లవోద్యమానికి ఓటమి ఉండదు
– మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్
గడ్చిరోలి, అక్టోబర్ 19 : మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో సభ్యుడు సోను, దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు వివేక్, డీజీ ఎస్‌జెడ్‌సీ ప్రత్యామ్నాయ సభ్యురాలు దీప, పదిమంది డివిజన్ కమిటీ/కంపెనీ పార్టీ కమిటీ సభ్యులు, పార్టీ సభ్యులు, పీఎల్‌జీఏ సభ్యులు మొత్తం 61మంది మహారాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో ఈనెల 14న లొంగిపోవడంపై ఆ పార్టీ కేంద్ర కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సోను లొంగుబాటును విప్లవ ద్రోహం, పార్టీ విచ్ఛిన్నకర చర్య అంటూ తీవ్రంగా ఖండిరచింది. ఈమేరకు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఒక ప్రకటన వెలువడిరది. ఆ ప్రకటనలోని వివరాలు ఇలా ఉన్నాయి. 2011 చివరి నుంచి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటూ వచ్చిన దండకారణ్య విప్లవోద్యమం దేశవ్యాప్త విప్లవోద్యం 2018 నాటికి తాత్కాలిక వెనుకంజకు గురయ్యాయి. అప్పటినుంచి సోనులోని రాజకీయ బలహీనతలు బయటపడుతూ వచ్చాయి. 2020 డిసెంబరులో జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో సోను దండకారణ్య విప్లవాచరణలోని కొన్ని లోపాలపై స్వీయ విశ్లేషణలతో కూడిన నిర్ధారణలు చేస్తూ ఒక పత్రాన్ని ప్రవేశపెట్టగా దాన్ని కేంద్ర కమిటీ తిరస్కరించింది. 2011లో జరిగిన దండకారణ్య జోనల్ కమిటీ ప్లీనం, 2020లో జరిగిన కేంద్ర మండలి సమావేశంలో కూడా అతని విధానంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. సరిదిద్దుకోవాలని సూచించాయి. 2025 మేలో జరిగిన కగార్ దాడిలో పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజు చనిపోయిన తర్వాత సోను నేతృత్వంలోని విభాగాల్లో రాజకీయ, సైనిక స్థాయిలో బలహీనతలు తలెత్తాయని నివేదికలు సూచించాయి. తనలో దీర్ఘకాలంగా ఉన్న అహంభావాన్ని సరిదిద్దుకోని ఫలితంగా తన బలహీనతలకు, ప్రాణభీతికి ముసుగు కప్పి పార్టీ అనుసరిస్తున్న తప్పుడు రాజకీయ-సైనిక పంథా ఫలితంగా భారత విప్లవోద్యమం ఓటమి పాలయ్యే స్థితికి దారి తీసిందని, ఈ స్థితిలో ఆయుధాల్ని శత్రువుకు అప్పగించి తాత్కాలిక సాయుధ పోరాట విరమణ చేయడం మినహా మరో మార్గం లేదనే మితవాద అవకాశవాద రివిజనిస్టు వైఖరితో కూడిన లొంగుబాటు ప్రకటనను పత్రికలకు విడుదల చేశాడు. సోనుకు నిజంగా తను రాసిన అంశాలపై విశ్వాసం ఉంటే పార్టీలో ఉంటూ కేంద్ర కమిటీలో, పొలిట్ బ్యూరోలో చర్చించడానికి సిద్ధపడాలి. పార్టీ నిర్మాణ పద్ధతిని పాటించకుండా శత్రువు ముందు లొంగిపోయాడు అంటేనే ఆయనలో నిజాయతీ లేదని, తన వాదనలు కేవలం తన ప్రాణభీతిని కప్పిపుచ్చుకునే అవకాశవాదం అని తేలిపోయింది. ఎందరో కామ్రేడ్స్ శత్రు సాయుధ బలగాలతో పోరాడి ప్రాణాలర్పించి వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాల్ని లొంగిపోతూ తిరిగి శత్రువుకు అప్పగించడమంటే విప్లవకారులను హత్య చేయడానికి లేదా విప్లవకారులను హత్య చేయమని శత్రువుకు అందించడమేనని, ఇది విప్లవ ప్రతిఘాతకత అవుతుందని అభయ్ పేర్కొన్నారు. విప్లవ ఘాతకుడిగా మారిన సోనును, ఆయనతో కలిసి శత్రువుకు లొంగిపోయిన వివేక్‌ను, దీపను, పదిమంది డివిజనల్ కమిటీ/కంపెనీ పార్టీ కమిటీ సభ్యులను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాం.. ఈ విప్లవ ద్రోహలకు తగిన శిక్ష విధించాల్సిందిగా విప్లవ ప్రజలకు పిలుపునిస్తున్నాం. విప్లవ ప్రతిఘాతకులను విప్లవ ప్రజలు శిక్షించక తప్పదు అని హెచ్చరించారు. సోను వాదనలోని మోసాన్ని అర్థం చేసుకోకుండా మోసపోయి ఆయనతో కలిసి వెళ్లి శత్రువుకు లొంగిపోయిన పార్టీ సభ్యులు, పీఎల్‌జీఏ సభ్యులు ప్రజల పక్షానికి తిరిగి రావాల్సిందిగా కోరుతున్నాం.. వారి లొంగుబాటు తాత్కాలిక నష్టాలే.. విప్లవోద్యమం శాశ్వత ఓటమికి గురికాదు అని పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





