మత్తు మందు జల్లి
నొప్పిలేని గాయం చేసి
పానాల గుత్త కూకేటి పాము
కాటికి కట్టెలు పేర్చుతున్నది
జిడ్డుకాయ పట్టిన పెదాలతో
పొగ జుర్రుకుంటున్న యువత
కార్జాలు పొగజూరి
ఆవిరి పీల్చుతూ తమ ఆయువుకు
తిలోదకాలు వదులుతున్నది
మెత్తటి దవడల్లో సుతిమెత్తని మెదళ్లలో
మశిలా పూశి
కారు చీకటిలో జోరు షికారు చేస్తూ
నిషా నషాతో బేజారు చేస్తూ
చాప కింది నీరులా వచ్చి
సునామీలా ముంచేస్తున్నది
‘కాగితం’, ‘కుండ’ రూపాల్లో
నిశ్శబ్ద భూతం సక్రియమవుతూ
హాయి హాయిమనిపిస్తూ
జాయి జాయిమంటూ
చావు డప్పు మోగిస్తున్నది
గంజాయి వాడకం నేరం
సంక్షేమం దృష్ట్యా నిషేధం
మనదే నియంత్రణ నిర్ణయం
శాశ్వత నిర్మూలన మన కర్తవ్యం
-బొల్లం బాలకృష్ణ





