ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డుల మంజూరు నిరంతర ప్రక్రియ
రెచ్చగొట్టే వారి మాటలను పట్టించుకోం..
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఖమ్మం/ నేలకొండపల్లి ప్రజాతంత్ర, జనవరి 22 : నిజమైన అర్హులను ఎంపిక చేసేందుకే మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గ్రామ సభలను నిర్వహిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. బుధవారం పాలేరు నియోజవర్గంలోని నేలకొండపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభలను ఉద్దేశించి మంత్రి పొంగులేటి ప్రసంగించారు. గతంలో జరిగిన గ్రామ సభల్లో దరఖాస్తు ఇచ్చివారిలో అర్హులకు ఈ నెల 26 నుంచి పథకాలను అమలు చేయబోతున్నామన్నారు.
నాలుగు పథకాల జాబితాలో పేర్లు రాకపోతే ఎవరూ కూడా అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. వారి కోసమే మళ్లీ ఈ గ్రామ సభలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. నాలుగు రోజులు పాటు విడతల వారీగా ఆయా గ్రామాల్లో జరిగే గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకునే వారిలో నిజమైన అర్హులు ఉంటే వారికి వెంటనే పథకాలను అందిస్తామని తెలిపారు. రెచ్చగొట్టే మాటలను ఈ ప్రభుత్వం పట్టించుకోదని చిత్తశుద్ధితో పనిచేయడమే ఈ ప్రభుత్వానికి తెలుసన్నారు. అర్హులైన ప్రతి పేదవానికి ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు.