– నిర్బంధంలో వున్నవారిలో చాలామంది మావోయిస్టులు కాకపోవచ్చు
– వీరిలో అత్యధికులు ఆదివాసులే
– నిరుపేదలు, ఆర్థిక స్థోమత లేనివారు
– సానుభూతితో వీరిని జైలునుంచి విముక్తి కలిగించాలి
– సీఎం రేవంత్‌కు మానవ హక్కుల వేదిక లేఖ
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 25: తెలంగాణ రాష్ట్రంలోని జైళ్లలో మావోయిస్టు ఉద్యమంతో సంబంధం లేదా మద్దతు ఇచ్చారన్న ఆరోపణలతో దీర్ఘకాలంగా నిర్బంధంలో ఉన్న కొందరు వ్యక్తులపై వున్న కేసులను పునఃసమీక్షించి విడుదల చేయాలని మానవహక్కుల వేదిక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేసింది. ఈమేరకు ఒక లిఖిత పూర్వక ప్రకటనను విడుదల చేసింది. సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా 314 మంది జీవిత ఖైదీలను విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే తీసుకున్న నిర్ణయం అభినందనీయమని, అదే విధంగా జైలు అదాలత్‌ల ద్వారా 460 మంది విచారణ ఖైదీలను కూడా విడుదల చేయడం ముదావహ చర్యగా పేర్కొంది. అయితే తెలంగాణలో మావోయిస్టు పార్టీకి మద్దతుదారులు లేదా సానుభూతిపరులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సుమారు 200 మంది ఇప్పటికీ జైళ్లలో దీర్ఘకాలంగా నిర్బంధంలో వున్నారని, వీరిలో చాలామంది వాస్తవానికి మావోయిస్టు పార్టీ సభ్యులు కాకపోవచ్చునని వివరించింది. కొందరు మావోయిస్టు ఉద్యమంతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఆహారం, నీరు, ఆశ్రయం వంటి ప్రాథమిక సహాయం అందించారనే ఆరోపణలతో జైళ్లలో మగ్గుతున్నారని తెలిపింది. వీరిలో గణనీయమైన సంఖ్యలో ఆదివాసులు, ఆర్థికంగా మరియు సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందినవారు ఉన్నట్లు తెలుస్తోంది. న్యాయవాదులను నియమించుకోవడానికి, బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి లేదా ష్యూరిటీలను సమకూర్చుకోవడానికి అవసరమైన ఆర్థిక, సామాజిక స్థోమత వీరికి లేదు. వారి పరిస్థితిని ప్రభుత్వం మానవతా దృక్పథంతో పరిశీలించాల్సిన అవసరం ఉంది. అజ్ఞాత జీవితాన్ని విడిచిపెట్టి లొంగిపోయిన మావోయిస్టు సభ్యుల పునరావాసం కోసం ప్రభుత్వం కొంత ఉదారమైన వైఖరిని ప్రదర్శిస్తోంది. అదే విధంగా, వ్యక్తిగత కేసులను చట్టపరంగా పరిశీలించిన అనంతరం, ప్రస్తుతం జైళ్లలో ఉన్న మావోయిస్టు సానుభూతిపరులు లేదా మద్దతుదారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి పట్ల కూడా అవలంబించి, వారిని విడుదల చేయాలని,ఆవిధంగా వారి పట్ల, వారి కుటుంబాల పట్ల మానవత ప్రదర్శించమని ఆ లేఖలో ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసింది. ఈ లేఖపై సంతకాలు చేసినవారిలో డా. ఎస్. తిరుపతయ్య, (రాష్ట్ర ప్రధాన కార్యదర్శి), వి. వసంత లక్ష్మి, ఎస్. జీవన్ కుమార్, (ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు), సంజీవ్, ప్రధాన కార్యదర్శి (నగర కమిటీ) వున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



