వచ్చే పదేళ్లకు ప్రణాళికలు సిద్ధం చేయండి

జెన్కో డైరెక్టర్లకు కావాల్సినంత స్వేచ్ఛనిస్తాం
విద్యుత్‌ ఒప్పందాల అమలుపై రోజువారీ సమీక్షలు చేయండి
జెన్‌కో అధికారులు, డైరెక్టర్ల సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 27: రాబోయే ఐదు, పదేళ్లకు రాష్ట్రంలో ఏర్పడనున్న విద్యుత్తు డిమాండ్‌కనుగుణంగా ఉత్పత్తికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రజాభవన్‌ల్లో విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులు, జెన్కో డైరెక్టర్లతో శుక్రవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. 2023లో మార్చిలో వచ్చిన 15,497 మెగావాట్ల పీక్‌ డిమాండ్‌, 2025 మార్చిలో వచ్చిన 17,162 మెగావాట్ల పీక్‌ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని 2029-30 నాటికి ఎంత డిమాండ్‌ పెరుగుతుంది, అదే పద్ధతిలో 2030-35, 2047 సంవత్సరాలకు ఏర్పడే విద్యుత్తు డిమాండ్‌ ఎంత ఉండొచ్చు.. అందుకనుగుణంగా వివిధ మార్గాల్లో విద్యుత్‌ ఉత్పత్తికి ఉన్న అవకాశాలపై ప్రణాళికలను సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. వీటితోపాటు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఫ్యూచర్‌ సిటీ, మూసీి పునరుజ్జీవం, పెరుగుతున్న పరిశ్రమలు, వ్యవసాయ వినియోగం, మారిన జీవన ప్రమాణాలకనుగుణంగా పెరగనున్న విద్యుత్‌ వినియోగం అంశాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో సుమారు 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ప్రభుత్వం 24 గంటలపాటు ఉచిత విద్యుత్‌ను అందిస్తోందని, ఇందుకు ఆర్థిక శాఖ ద్వారా విద్యుత్‌ సంస్థలకు సంవత్సరానికి రూ.12,500 కోట్లు చెల్లింపులు జరుగుతున్నాయని తెలిపారు. నిరుపేదలకు ఆర్థిక చేయూతను అందించేందుకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని, ప్రస్తుతం వీటి విలువ రూ.2 వేల కోట్ల వరకు ఉంది, అది భవిష్యత్తులో పెరిగి రూ.3 వేల కోట్ల వరకు చేరుకునే అవకాశం ఉందని, మొత్తంగా ఉచిత విద్యుత్‌ పథకాలకు భవిష్యత్తులో రూ.17 వేల కోట్ల వరకు ఆర్థిక శాఖ నుంచి విద్యుత్‌ శాఖకు చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుందని వివరించారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని గ్రీన్‌ ఎనర్జీని పెద ఎత్తున ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు చేసుకుని వేగంగా కార్యాచరణ చేపట్టాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. గిరిజనులు తలెత్తుకొని బతికేలా ఇందిరా సౌర గిరి జల వికాసం పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని, ఈ పథకం ద్వారా 6.70 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకురానున్నట్లు, మొత్తం సోలార్‌ పంపు సెట్లు వినియోగిస్తున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. 2030-31, 2035 నాటికి థర్మల్‌ విద్యుత్తుకు ఉండే డిమాండ్‌ దృష్టిలో పెట్టుకొని యాభయ్యేళ్ల క్రితం నిర్మించిన రామగుండం, కేటీపీఎస్‌ థర్మల్‌ పవర్‌ స్టేషన్ల స్థానంలో కొత్తవాటి నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. దావోస్‌, హైదరాబాద్‌లో హిమాచల్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలతో చేసుకున్న విద్యుత్‌ ఉత్పత్తి ఒప్పందలపై రోజువారీ సమీక్ష చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహాలపై సోలార్‌ పవర్‌ ప్యానల్స్‌ ఏర్పాటు చేసి ఆయా వర్గాలకు ఆదాయంతోపాటు సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తికి సంబంధించిన ప్రణాళికలను వేగవంతం చేయాలని కూడా ఆదేశించారు. ఫ్లోటింగ్‌ సోలార్‌ ద్వారా విద్యుత్‌ ఉత్పత్తికి నీటిపారుదల శాఖ, జెన్కో రెండు శాఖలను సమన్వయం చేసుకునేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో విద్యుత్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ నవీన్‌ మిట్టల్‌, ట్రాన్స్కో సీఎండి కృష్ణభాస్కర్‌, జెన్కో సిఎండి హరీష్‌, రెడ్కో వీసీఎండీ అనిలా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page