భోజనం పెట్టకుండా గోస పెడుతున్నారు
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్,ప్రజాతంత్ర,జూన్27: ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులకు భోజనం పెట్టుకుండా వారిని కాంగ్రెస్ ప్రభుత్వం గోస పెడుతున్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ’అన్నపు రాశులు ఒకచోట, ఆకలి మంటలు ఒకచోట .. హంస తూలికలు ఒకచోట, అలసిన దేహాలు ఒకచోట’ అని కవి కాళోజీ నారాయణరావు చెప్పినట్లు తెలంగాణలో పరిస్థితి నెలకొని ఉందన్నారు. అందాల పోటీల్లో విందులకు ప్లేటు భోజనం రూ.లక్ష, వేములవాడలో కాంగ్రెస్ సభకు ఆలయ ఆదాయంతో ప్లేటు భోజనం రూ.36 వేలు, ఒక్కో పట్టుపంచెకు రూ.10 వేలు ఖర్చు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. పాఠశాలలు, గురుకులాలు, విశ్వవిద్యాలయా ల్లో విద్యార్థులకు కనీసం పట్టెడన్నం కూడా పెట్టడం లేదు అని కేటీఆర్ మండిపడ్డారు. ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు అంటూ వందల కోట్లు దండుకునేందుకు టెండర్ వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఉన్న గురుకులాలు, విశ్వవిద్యాలయాలలో భోజనం పెట్టకుండా గోస పెడుతున్నది అని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ.. భావి తెలంగాణ భవిష్యత్తును ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బలిపెడుతున్నది. నాడు దేశానికి దిక్సూచిలా నిలిచిన తెలంగాణ విద్యావ్యవస్థ.. నేడు ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తంగా మారి విద్యార్థులను అవస్థలు పెడుతుంది అని కేటీఆర్ పేర్కొన్నారు. జాగో విద్యార్థి జాగో.. జాగో తెలంగాణ జాగో అని కేటీఆర్ నినదించారు.