ఎకో టూరిజం అభివృద్ధికి ప్ర‌ణాళిక‌ల రూప‌క‌ల్ప‌న‌

– అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 21 : రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. ఎకో టూరిజం అభివృద్ధి, పులుల సంరక్షణ, టైగర్ రిజర్వుల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సచివాలయంలో మంగళవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో అటవీ, పర్యాటక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని సీఎస్‌కు వివరించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎకో టూరిజంను అభివృద్ధిపరిస్తే యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పించడంతోపాటు పర్యాటక రంగం ద్వారా రాష్ట్ర ఆదాయం పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అన్నారు. ప్రత్యేకంగా భద్రాచలం పరిసర ప్రాంతాల్లోని కిన్నెరసాని, శ్రీశైలం నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్, గోదావరి నది తీర ప్రాంతంలోని కవ్వాల్ టైగర్ రిజర్వు, ఆదిలాబాద్, ములుగు ప్రాంతాలలో ఎకో టూరిజం అభివృద్ధికి తగు కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా రాష్ట్రానికి కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకుని ఎకో టూరిజంను అభివృద్ధి చేయాలని సూచించారు. రాష్ట్రంలో విలువైన అటవీ సంపద ఉందని, జీవ వైవిధ్యం, సహజ ప్రకృతి అందాలను పర్యాటక అభివృద్ధికి సమర్థవంతంగా వినియోగించేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఎకో టూరిజం అభివృద్ధికి పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా ప్రాజెక్టులు రూపొందిస్తే ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు జీడీపీ పెరిగే అవకాశాలున్నాయన్నారు. అటవీ అభివృద్ధి కార్పొరేషన్, టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సంయుక్త భాగస్వామ్యంతో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని, ముఖ్యంగా ఫ్యూచర్ సిటీ, అనంతగిరి, సిటీ అర్బన్ ప్రాంతాల్లో ఎకో టూరిజంను ప్రొత్సహించాలని సీఎస్ సూచించారు. అటవీ ప్రాంతాల్లో పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ, నిబంధనలకు అనుగుణంగా పర్యాటక మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని, సందర్శకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతోపాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. సమావేశంలో పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణిప్రసాద్, ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ వినయ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *