– 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ ఇచ్చిన కేసీఆర్
– గోదావరిలో సరిపడా నీళ్లున్నా లిఫ్ట్ చేయడంలేదు
– వరంగల్ జిల్లాను కరవు కోరల్లోకి నెట్టారు
– ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజం
– చిత్తశుద్ధితో దేవాదుల మోటర్లు నడపాలని డిమాండ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 21: రైతుల సమస్యలు, ప్రాజెక్టులు, విద్యుత్ నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్‌రావు విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా 3 గంటల విద్యుత్ కూడా సరిగ్గా అందడం లేదని, ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని తెలంగాణ భవన్‌లో మంగళవారం మీడియా సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇచ్చామని, నేడు దానిని కాంగ్రెస్ నిర్వీర్యం చేసిందన్నారు. ప్రాజెక్టుల నిర్వహణలో పాలకపక్షం చేతగానితనాన్ని ప్రదర్శిస్తోందని, కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నదని ధ్వజమెత్తారు. రైతు రుణ మాఫీ ప్రక్రియలోనూ, రైతులకు అందాల్సిన సహాయంలోనూ తీవ్ర అలసత్వం వహిస్తున్నారని, మాటలు తప్ప చేతల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చూపడం లేదని విమర్శించారు. ఈనెల 12న తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ పెట్టి దేవాదుల పంపులు ఆన్ చేయమని నిలదీస్తే 13న ఉత్తమ్‌కుమార్, భట్టి, పొంగులేటి హెలికాప్టర్‌లో వెళ్లి హడావుడి చేశారని తెలిపారు. దేవాదుల కింద ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయో కూడా నీళ్ల మంత్రికి తెలియదని ఎద్దేవా చేశారు. మొత్తం 22 రిజర్వాయర్లు నింపుతాం, 38 టీఎంసీల నీళ్లు ఎత్తుతాం అని చెప్పారు.. ఆ మాటలు నమ్మి రైతులు నారు పోసుకున్నారు.. ఇప్పుడు నీళ్లు ఇవ్వడం లేదు.. నీళ్లు ఎత్తడం లేదు.. వరంగల్ జిల్లావ్యాప్తంగా నీళ్ల కోసం రైతులు ధర్నాలు చేస్తున్నారని, శాయంపేట, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి అంతటా ఆందోళనలు జరుగుతున్నాయని తెలిపారు. నీళ్లు ఉండి కూడా ఎందుకు ఎత్తడం లేదు? కేసీఆర్ హయాంలో కట్టిన సమ్మక్క బ్యారేజీలో 3 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 22 వేల క్యూసెక్కుల వరద ఉంది. ఆయకట్టుకు సరిపడా నీళ్లు ఉండి కూడా పంటలకు నీళ్లు ఇవ్వడం లేదని అన్నారు. 13న మొత్తం నీళ్లు ఎత్తుతామని చెప్పారు.. ఏమైంది అని ప్రశ్నించారు. పది పంపులు నడుస్తాయని చెబితే నిన్నటి వరకు ఐదు పంపులే నడిచాయన్నారు. మంత్రులు వెళ్లినప్పుడు ఏడు మోటార్లు, మంత్రులు లేనప్పుడు మూడు మోటార్లు నడుస్తున్నాయంటూ ఇక్కడ ఎన్డీఎస్ఏ అడ్డంకి లేదు కదా అని నిలదీశారు. అసలు మీ ఆలోచన ఏమిటి అని ప్రశ్నించారు. ఇది ఎల్‌నినో తెచ్చిన కరవు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరవు అన్నారు. మీ నిర్లక్ష్యం వల్ల వరంగల్ జిల్లాను కరవు కోరల్లోకి నెట్టారని విమర్శించారు. 3.17 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడానికి దేవాదుల పూర్తి చేశాం.. రూ.8 కోట్ల బిల్లులు ఇవ్వకుండా పోయిన ఏడాది 50 రోజులు ఆలస్యంగా మోటార్లు ఆన్ చేయగా దేవాదుల కింద రూ.700-800 కోట్ల విలువైన పంట ఎండిపోయిందని తెలిపారు. ఈసారి కూడా ఎల్‌నినో వస్తుందని చెబుతున్నా మొద్దునిద్ర పోతున్నారా.. పది మోటార్లు ఎందుకు నడపడం లేదు అని హరీష్‌రావు ప్రశ్నించారు. ప్రపంచమంతా చుక్కచుక్క నీటిని ఒడిసిపడుతుంటే మీరు నీళ్లు వదిలేస్తున్నారు అని విమర్శించారు. రామప్ప కింద ఐదు వేల ఎకరాలు, పాకాల కింద 29 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా కాంగ్రెస్ మాటలు నమ్మి రైతులు నాట్లు వేసుకున్నారని చెప్పారు. వరంగల్ కలెక్టర్ అఖిలపక్ష సమావేశం పెట్టి నీళ్లు ఇవ్వం, నాట్లు వేసుకోవద్దు అంటారు.. మంత్రులు మాత్రం మూడు లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పారు. మంత్రులది ఒక మాట, కలెక్టర్‌ది ఒక మాటనా అని అడిగారు. రామప్ప కింద తూములు మూసేశారు.. నాట్లు వేసిన రైతుల పరిస్థితి ఏమిటి అని నిలదీశారు. గోదావరిలో బ్రహ్మాండంగా నీళ్లు ఉన్నా కలెక్టర్ ఎందుకు తూములు మూశారు అని అడిగారు. మంత్రులు రైతులకు క్షమాపణలు చెప్పాలన్నారు .ఇది తుగ్లక్ ప్రభుత్వం లెక్క ఉంది. రాష్ట్రాన్ని నడిపే పద్ధతి ఇదేనా అన్నారు. రైతు బోరు ఎండితే నీళ్ల కోసం రకరకాల మార్గాలు వెతుకుతాడు. కానీ ప్రభుత్వం ఎందుకు తపన పడటం లేదని అన్నారు. రైతులు ట్యాంకర్లు, బిందెలతో పంటలకు నీళ్లు పెడుతున్నా రేవంత్ రెడ్డికి సోయి లేదన్నారు. గ్యారెంటీల విషయంలో వాయిదాల లెక్కనే నీళ్ల ఎత్తిపోతల విషయంలో కూడా వాయిదాలే అని వ్యాఖ్యానించారు.
జూన్ 1 నుంచి ఇప్పటివరకు 50 రోజులుగాఎందుకు నీళ్లు లిఫ్ట్ చేయలేదన్నారు. ఎల్‌నినో పేరు చెప్పి ఎగనామం పెడితే బీఆర్ఎస్ ఊరుకోదని ఆయన హెచ్చరించారు. నీ నిర్లక్ష్యం వల్ల తాగు, సాగు నీటి ఇబ్బందులు వచ్చినా, కరెంట్ సమస్య వచ్చినా, పంటల సాగు తగ్గినా ప్రభుత్వం బాధ్యత వహించాలని ఘాటుగా uహెచ్చరించారు. దేవాదుల సమ్మక్క బ్యారేజీ నుంచి 105 టీఎంసీల నీళ్లు ఏపీ వైపు వెళ్లిపోయాయి. మీరు ఎత్తింది 1.9 టీఎంసీలు మాత్రమే. ఎత్తే అవకాశం 12 టీఎంసీలు ఉంది. రోజుకు పావు టీఎంసీ ఎత్తే అవకాశం ఉన్నా రెండు టీఎంసీలు కూడా ఎత్తలేదు. ఇదేనా రైతుల పట్ల మీ చిత్తశుద్ధి అని ప్రశ్నించారు. చిన్న మోటార్లు నడపడానికి కరెంట్ ఇవ్వాలనే చిత్తశుద్ధి కూడా లేదా అన్నారు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు మీ పాలన ఉందన్నారు. దేవాదుల గుండా 105 టీఎంసీల నీళ్లు వెళ్లిపోవడం దారుణమన్నారు. ఈరోజు కూడా దేవాదుల వద్ద 78 మీటర్ల లెవల్‌లో గోదావరి ప్రవహిస్తోందని ఆయన తెలిపారు. జనగాం, హన్మకొండ, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖే చెబుతోంది. ఈరోజు మా ప్రెస్ మీట్ ఉందని పొద్దున మరో రెండు మోటార్లు ప్రారంభించారు. బీఆర్ఎస్ నిలదీస్తేనే మీకు సోయి వస్తుందా అని అడిగారు. ముందే పట్టించుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఉత్తం కుమార్ రెడ్డి దేవాదుల పూర్తి చేస్తాం అనే డైలీ సీరియల్ లాగా ఎన్నిసార్లు చెబుతారు అని ప్రశ్నించారు. 2004లో ప్రారంభమైన దేవాదులకు గ్రహణం పట్టించింది కాంగ్రెస్ పార్టీ కాదా అని నిలదీశారు. కాంగ్రెస్ పదేళ్లలో 46 వేల ఎకరాలకు నీళ్లు ఇస్తే కేసీఆర్ 3.17 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చారన్నారు. కేసీఆర్ నీళ్ల కోసం యుద్ధం చేస్తే.. మీరు నీళ్లపై యుద్ధం చేస్తున్నారన్నారు. తాము కాళేశ్వరం గురించి మాట్లాడితే తుáమ్మిడిహెట్టి ప్రాజెక్టు కడతామంటున్నారు.. ఎవరు కట్టొద్దన్నారు.. 30 నెలలుగా అదే మాట చెబుతున్నారు అని అన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద తట్టెడు మట్టి కూడా ఎత్తలేదన్నారు. 12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పారు.. ఇచ్చారా అని ప్రశ్నించారు.
రాష్ట్రానికి వరం ‘సీతారామ’
రాష్ట్రానికి వరం కేసీఆర్ కట్టిన సీతారామ ప్రాజెక్టు. ఈరోజు వైరా, బేతుపల్లికి నీళ్లు వస్తున్నాయంటే అది కేసీఆర్ కృషి. తాగు, సాగు నీటికి ఢోకా లేకుండా చేసింది కేసీఆర్ ప్రభుత్వం అని హరీష్‌రావు చెప్పారు. అన్నారం, సుందిళ్లలాగే సమ్మక్క బ్యారేజీ డిజైన్ చేశామన్నారు. దేవాదుల కోసం వాడుతున్నప్పుడు అదే నదిపై ఉన్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ఎందుకు వాడటం లేదని అడిగారు. చిల్లర రాజకీయాలు బంద్ చేయండని హితవు పలికారు. చిత్తశుద్ధితో దేవాదుల పది మోటార్లు నడపాలని, 22 రిజర్వాయర్లు నింపాలని, 3 లక్షల 17 వేల ఎకరాలకు తాగు, సాగు నీరు అందించాలని డిమాండ్ చేశారు. లేకపోతే వరంగల్, నల్గొండ, కరీంనగర్ రైతులతో కలిసి ప్రజాపోరుకు సిద్ధమవుతామని హరీష్‌రావు హెచ్చరించారు. సమావేశంలో మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, రాజయ్య, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ రవీందర్‌రావు, సీనియర్ నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆరూరి రమేష్, ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.





