– ప్రభుత్వ సలహాదారు వీహెచ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 29: అంబర్‌పేట్ మహంకాళి ఆలయంలో ఆగస్టు 9న జరగనున్న అమ్మవారి బోనాల ఉత్పవాలకు తగు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ప్రభుత్వ సలహాదారు వి.హనుమంత రావు ఆదేశించారు. బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై సచివాలయంలో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జీహె చ్ ఎంసీ, ట్రాన్స్‌కో, పోలీస్, జలమండలి, వైద్యారోగ్య శాఖ, దేవాదాయ శాఖలు సమన్వయంతో పనిచేసి విస్తృతస్థాయిలో ఏర్పాట్లు చేయాలని సూచించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని దేవాలయాల్లో నిర్వహించే బోనాల ఉత్సవాలకు సౌకర్యాల కల్పనలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఘటోత్సవాలు, బోనాల సమర్పణ, సాక సమర్పణ, తొట్టెల ఊరేగింపులు, పోతురాజుల వీరంగాలు, రంగం కార్యక్రమాలు, గావుపట్టడం, సాగనంపు వంటి సంప్రదాయ కార్యక్రమాలు తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబిస్తాయన్నారు. ఆలయాల్లో మౌలిక వసతుల మెరుగుదల, భక్తులకు సౌకర్యాల కల్పన, విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు, సీసీ కెమెరాలు, క్యూలైన్లు, తాగునీటి సదుపాయాలు, పారిశుధ్య నిర్వహణ, వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ముఖ్యంగా భారీ రద్దీ ఉండే ఆలయాల వద్ద ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళికలు, అదనపు బస్సులు, వైద్య బృందాలు, భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. వృద్ధుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్పీ బల్మూరి వెంకట్, ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి.పాటిల్, సమాచార, పౌర సంబంధాల శాఖ అడిషనల్ డైరెక్టర్ డి.ఎస్.జగన్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్, వాటర్‌వర్క్స్ జీఎం, ఆర్టీసీ ఈడీ, ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్, ఆలయ కమిటీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





