మధిర మహిళలు ఆదర్శంగా నిలవాలి

– ఇందిరా మహిళా డెయిరీ పథకంతో నా కల నెరవేరింది
– త్వరలో బోనకల్లు మండలంలో డెయిరీ ఏర్పాటు

మధిర, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 19: పాల ఉత్పత్తుల ద్వారా మధిర నియోజకవర్గం మహిళా సంఘాల సభ్యులు భారత దేశానికి ఆదర్శంగా నిలవాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. నియోజకవర్గంలో ఇందిరా మహిళ డెయిరీ లబ్దిదారులతో ఆదివారం ఆయన ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇందిరా మహిళా డెయిరీ తన చిరకాల వాంఛ అని, ఉమ్మడి రాష్ట్రంలో 2013లో నియోజకవర్గంలోని 52వేల మహిళా సంఘాల సభ్యులకు రెండు గేదెలు కొనివ్వాలని భావించానని చెప్పారు. అయితే అదే సమయంలో రాష్ట్ర విభజన జరగడం, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం పదేళ్లపాటు ఈ పథకాన్ని పట్టించుకోకపోవడంతో అమలు చేయలేకపోయామన్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే నియోజకవర్గంలో మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతోపాటు వారు సమాజంలో పోటీపడి బతకాలని ఈ పథకాన్ని అమలులోకి తేవడంతో తన చిరకాల వాంఛ నెరవేరిందన్నారు. ప్రతి మహిళకు రెండు గేదెలను ఇవ్వడంతోపాటు వాటిని కాపాడడానికి వ్యవస్థను ఏర్పాటు చేశామని, గేదెలు ఉండేందుకు కొట్టాలు మంజూరు చేయడంతోపాటు, సోలార్‌ పవర్‌ను కూడా మంజూరు చేస్తామన్నారు. తాము గేదెలు తీసుకుంటే వాటిని ఎవరు చూస్తారు, గడ్డి ఎవరు వేస్తారు, దాన ఎవరు వేస్తారు అన్న భావన రోజువారీ కూలీలకు, పనులకు వెళ్లే మహిళల్లో ఉంటుందని, మీరు కూలి పనులకు వెళ్లినప్పటికీ గేదెలకు దానా, గడ్డి సరఫరా చేసేందుకు నిరుద్యోగ యువతలకు ఉపాధి కల్పిస్తామని, వారే వచ్చి సరఫరా చేసేలా ఏర్పాటు చేస్తామని వివరించారు. ఇందుకోసం ఉపాధి కల్పిస్తున్న యువతకు ట్రాలీ ఆటోలు కూడా ఇప్పిస్తామన్నారు. ప్రతి మండలాన్ని మూడు భాగాలుగా విభజించి, ప్రతి 10 గ్రామాలను యూనిట్గా ఏర్పాటు చేసి పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని తెలిపారు. భూమి లేకున్నా కూడా గేదెలను మంజూరు చేస్తామని చెప్పారు. భూమి ఉన్న నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించేలా వారి పొలాల్లో గడ్డిని పెంచి దాన్ని కూడా సరఫరా చేస్తామన్నారు. ప్రతి నెల గేదెల ఆరోగ్యాన్ని పరీక్షించేందుకు డాక్టర్లు వస్తారని, అంబులెన్స్‌ ఏర్పాటు చేస్తామని వివరించారు. బోనకల్లు మండలంలోని ఇందిరా మహిళా శక్తి పాల పరిశ్రమను త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ పరిశ్రమను అమూల్‌, విజయ డెయిరీ, హెరిటేజ్‌ పరిశ్రమల మాదిరిగా బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవడంతోపాటు ఇక్కడి పాల ఉత్పత్తులు దేశవ్యాప్తంగా అమ్మేలా ఏర్పాటు చేస్తామన్నారు. పాల ఉత్పత్తులను పెంచడం ద్వారా మదిర నియోజకవర్గ మహిళలు ఏడాదికి రూ.1000 కోట్లు సంపాదించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఏడాది 20 వేల మంది మహిళలకు గేదెలను పంపిణీ చేస్తామని, వచ్చే ఏడాది మరో 20 వేల మందికి, ఆ తర్వాత మిగిలిన 20వేల మందికి పంపిణీ చేస్తామన్నారు.

రోజుకు రూ.600 సంపాదిస్తున్నా: మమత, చింతకాని
ఇందిరా మహిళా డెయిరీ ద్వారా గేదెలు ఇవ్వడం సంతోషం. రెండు గేదెలు రోజుకు 18 లీటర్ల పాలు ఇస్తున్నాయి. రోజుకు పాల ద్వారా రూ.600 వస్తున్నాయి. ఇందిరా డెయిరీ ద్వారానే కాకుండా చుట్టుపక్కల వారికి పాలు అమ్ముతున్నాము.

నెలకు రూ.12వేలు సంపాదిస్తున్నాం : భాగ్యమ్మ, బోనకల్‌
పేదలైన మమ్మల్ని గుర్తించి గేదెలు ఇప్పివ్వడం ద్వారా మమ్మల్ని లక్షాధికారులను చేశారు. నెలకు మేము రూ 12 రూ సంపాదిస్తున్నాం. కూలీలుగా కాకుండా గౌరవంగా జీవిస్తున్నాం.

రోజూ 10 లీటర్ల పాలు అమ్ముతున్నా : శైలజ, ముదిగొండ
ఇందిరా డెయిరీ కింద నాకు మేలు జాతికి చెందిన రెండు గేదెలు ఇచ్చారు. 11 లీటర్ల పాలు ఇస్తున్నాయి. వాటిని అమ్ముకుని జీవనం సాగిస్తున్నాం. రోజూ 10 లీటర్ల పాలు బయట అమ్ముతున్నాను. లీటరుకు రూ.80ల చొప్పున అమ్ముకుంటున్నాను.

గేదెల వల్ల మూడుపూటలా తింటున్నాం : లక్ష్ష్మి, మధిర
నాకు రెండు గేదెలు ఇచ్చారు. ఉపాధి దొరికింది. డెయిరీ గేదెల వల్ల మా కుటుంబం మూడు పూటలా అన్నం తింటున్నాము. పాలు అమ్ముకుని మా కుటుంబం గౌరవంగా జీవనం సావిస్తున్నాం.

పాలు అమ్మి కాలేజీ ఫీజులు కట్టాము : ఉష, ఎర్రుపాలెం
రెండు గేదెలు రోజుకు 10 లీటర్ల పాలు ఇస్తున్నాయి. గేదెలు వచ్చిన దగ్గరనుంచి ఇప్పటివరకు మాకు రూ12 వేలు వచ్చాయి. వాటితో మా బిడ్డల కాలేజి ఫీజులు కట్టాము. ఇందిరా మహిళా డెయిరీ వల్ల మేము సంతోషంగా జీవిస్తున్నాము.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page