కేరళలో పేదరికం అతి తక్కువ!

– ఉచితాలు కాదు.. ఉపాధి కల్పన లక్ష్యంగా పాలన
– అత్యంత నిరుపేదలకు మాత్రమే సంక్షేమం
– వోట్ల కోసమే ఇచ్చే ఉచితాలు రాష్ట్రాల మనుగడకే ప్రమాదం
– తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పాఠం నేర్చుకోవాలి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 25: నీతి ఆయోగ్‌ నివేదిక ప్రకారం దేశంలో అతితక్కువ పేదరికం ఉన్న రాష్ట్రాల్లో కేరళ (0.71) దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండటం విశేషం. మిగిలిన రాష్ట్రాలతో పోల్చినప్పడు కేరళ పేదరిక నిర్మూలనలో ముందంజలో ఉండటానికి ప్రధాన కారణం అక్కడి ప్రభుత్వం అనుసరించిన ప్రణాళికాబద్ధ విధానమేనన్నది సుస్పష్టం. మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మాదిరిగా ఎడాపెడా ఉచితాలు, సంక్షేమాలు ప్రకటించలేదు. కూడు, గుడ్డ, నీడ, వైద్యం వంటి ప్రాథమిక అవసరాలు అందని అత్యంత నిరుపేద కుటుంబాల వివరాలను సర్వే ద్వారా వెలికి తీసి వారికి మాత్రమే ప్రభుత్వం తరపున అందాల్సిన సహాయాన్ని అందజేయడం ద్వారా కేరళ తీవ్ర పేదరికం లేని రాష్ట్రంగా రూపొందింది. ఈమేరకు నవంబర్‌ 1వ తేదీన అధికారికంగా ప్రభుత్వం ప్రకటించబోతున్నది. దేశంలో ఈ ఘనత సాధించిన తొలి రాష్ట్రంగా కేరళ చరిత్ర సృష్టించిందనే చెప్పాలి. నిజానికి అక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నదన్నది కాదు ప్రశ్న. ఎంత చక్కటి వ్యూహాత్మక వ్యవహారశైలిలో పేదరిక నిర్మూలనను సాధ్యం చేయగలిగిందనేది కీలకం. ఇది కేవలం ఏ ఒక్క రోజులోనే సాధించింది కాదు. 2021 నవంబర్‌లో లెఫ్ట్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (ఎల్‌డీఎఫ్‌) ప్రభుత్వం సమావేశమై తీసుకున్న నిర్ణయాల్లో తీవ్ర పేదరిక నిర్మూలన కార్యక్రమం ఒకటి. వివిధ ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేసి రాష్ట్రంలో 64,006 కుటుంబాలు అంటే 1,30,009 మంది వ్యక్తులు తీవ్ర పేదరికంలో ఉన్నారని తేల్చారు. అప్పటినుంచి వీరిని ఈ దుర్భర పేదరికం నుంచి బయటపడేయడానికి ప్రణాళికాబద్ధ చర్యలు తీసుకుంది. ఈ కారణంగా ఇప్పటికి 59,277 కుటుంబాలను ఈ దుస్థితినుంచి విముక్తం చేయగలిగింది. వీరిలో 3,913 కుటుంబాలకు ఇళ్లను నిర్మించింది. 1,338 కుటుంబాలకు భూమిని కేటాయించింది. 5,651 కుటుంబాల ఇళ్లకు మరమ్మతుల కోసం ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున ఖర్చు చేసింది. మరో 21,263 మందికి రేషన్‌ కార్డులు, ఆధార్‌ కార్డులను అందజేసింది. సూక్ష్మ ప్రణాళిక కిందకు ఈ కుటుంబాలను తీసుకొచ్చి ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను వర్తింపజేసింది. ఈ నాలుగేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలు సమన్వయంతో పనిచేసి, అన్ని ప్రభుత్వ శాఖలను ఇందులో భాగస్వాములను చేయడం ద్వరా తీవ్ర పేదరిక రహిత రాష్ట్రంగా రూపొందింది.

ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన లక్ష్యాల్లో ఇది కూడా ఒకటి

నిజానికి ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఇది కూడా ఒకటి. తీవ్ర పేదరికాన్ని ప్రపంచ బ్యాంకు నిర్వచించింది. దీని ప్రకారం రోజుకు 2.15 డాలర్ల కంటే తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలను అత్యంత నిరుపేదలుగా పరిగణిస్తారు. నీతి ఆయోగ్‌ ఈ అత్యంత పేదరికాన్ని ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణం ఆనే మూడు ప్రధాన అంశాలకు సంబంధించిన 12 సూచికలను అత్యంత నిరుపేద కుటుంబాల గుర్తింపునకు ప్రమాణంగా నిర్దేశించింది. కేరళ ప్రభుత్వం అనుసరించిన విధానం ఇదే. ప్రపంచంలో ఈ విధంగా అత్యంత పేదలను గుర్తించి వారిని పైకి తెచ్చేందుకు పథకాలు అమలు చేసిన తొలి దేశం చైనా. ఇప్పుడు మన దేశంలో కేరళ ఇదే మార్గాన్ని అనుసరించింది. ఇందుకు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అభినందనీయుడు.

తెలుగు రాష్ట్రాలూ ఇలా చేయొచ్చు

ఇతర రాష్ట్రాల మాట అలా ఉంచి మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ విధంగా నిర్దిష్ట విధానాన్ని పారదర్శకంగా అనుసరిస్తే తప్పనిసరిగా అనుకున్న లక్ష్యం సాధించవొచ్చు. కానీ అధికారం కోసం వివిధ పార్టీలు ఎడాపెడా అర్థంపర్థం లేని స్థాయిలో ఉచితాలను ప్రకటించి రాష్ట్రాలను దివాలా తీయిస్తున్నాయి. బాధ్యతారహితంగా ప్రకటిస్తున్న ఈ ఉచితాల వల్ల ఆంధ్రప్రదేశ్‌ అప్పు రూ.10.55 లక్షల కోట్లకు చేరుకోగా, తెలంగాణ అప్పు సుమారు రూ.5.04లక్షల కోట్లకు చేరుకుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్‌ అమలుపరచిన సంక్షేమాల్లో రైతుబంధును గొప్పగా చెప్పుకున్నారు. కానీ ఇది నిజంగా అవసరమైన నిరుపేద రైతులకు అందిందా అంటే సమాధానం వెతుక్కోవలసి వొస్తోంది. ఎందుకంటే భూస్వాములు, పొలాలు సాగు చేయనివారు, పంట పొలాలు కలిగిన ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ రైతుబంధుతో ప్రయోజనం పొందారన్న ఆరోపణలు వొచ్చాయి. జగన్‌ను అధికారం నుంచి దించే లక్ష్యంతో చంద్రబాబు అలవికాని హామీలిచ్చి వాటిల్లో చాలా వాటిని అమలు చేయలేక పిల్లిమొగ్గలు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా కొండకు వెంట్రుక కట్టిన రీతిలో అడ్డగోలు వాగ్దానాలు చేసి అధికారంలోకి వొచ్చారు. కానీ నిజాయతీగా చెప్పాలంటే ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారని ప్రశ్నిస్తే ప్రభుత్వం వద్ద సరైన సమాధానం ఉండదు. కాకపోతే మంత్రులు బట్టీపట్టినట్టు ఒకటే మూస పద్ధతిలో సమాధానాలు ఇవ్వడం తప్ప హేతుబద్ధమైన వివరణలు ఉండటంలేదు.
దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఇలాంటి మితిమీరి సంక్షేమ హామీలు ఇవ్వడం కనిపిస్తోంది. ప్రభుత్వంలో ఉన్న పార్టీ అధికారాన్ని నిలుపుకోవడానికి, గద్దెనెక్కడానికి విపక్ష పార్టీలు పోటీలు పడి సంక్షేమ పథకాలను ప్రకటించడం వల్ల రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయి. ప్రభుత్వ రంగంలో పనిచేసే కొన్ని సంస్థలు దివాలా దశకు చేరుకుంటున్నాయి. ఉదాహరణకు మహిళలకు ఉచిత బస్సు సదుపాయం ఎంతవరకు అవసరం? దీనివల్ల తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో ఆర్టీసీ సంస్థలు నష్టాల్లో కూరుకుపోయాయి. పోనీ ఈ నష్టాన్ని ప్రభుత్వాలు భర్తీ చేస్తాయా అంటే ఆదీ సక్రమంగా జరగదు. చార్జీలు పెంచడం ద్వారా ఈ ఉచిత భారాన్ని ఆ వర్గాలకు బదిలీ చేసి చేతులు దులుపుకుంటున్నాయి. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఉచితాలు కాదు.. ఉపాధి కల్పన ముఖ్యమన్న సంగతిని కేరళ ప్రభుత్వం నుంచి వీరు నేర్చుకోవాలి. దుర్భర పేదరికంలో ఉన్నవారిని గుర్తించి వారికి సంక్షేమ పథకాలు అమలు చేయాలి తప్ప వోట్ల కోసమే అమలు చేయాలనుకుంటే అది రాష్ట్రాల మనుగడకే ప్రమాదం. ఇంతటి స్థాయిలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా ఆంధ్రప్రదేశ్‌లో పేదరికం 4.2% నుంచి 6% మధ్యలో కొనసాగుతోంది. ఇక తెలంగాణలో 3.76%గా నమోదైంది. అంటే కేరళతో పోల్చినప్పుడు ఇన్ని లక్షల కోట్లు సంక్షేమానికి ఖర్చు చేస్తున్నా ఎలాంటి ఫలితం ఉండటంలేదని అర్థం. కేరళ ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్లు ఖర్చు చేయలేదు. కేవలం లక్షిత గ్రూపులను గుర్తించి వారికి ఈ సంక్షేమాన్ని అమలు పరచింది. పేదరిక నిర్మూలన లక్ష్యాన్ని సాధించింది. విశ్లేషిస్తే కేరళతో పోల్చినప్పడు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు అనుసరిస్తున్నది దుబారాతో కూడిన బాధ్యతారాహిత్య పాలనా విధానమన్న సత్యం బోధపడుతున్నది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page