– భార్య బానిస కాదు
-పెళ్లంటే పరస్పర గౌరవంతో బతికే బంధం
– పనిమానిషిగా చూడాలనుకునే తీరు క్షమార్హం కాదు
– కర్నాటక హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
బెంగళూరు, ఆగస్ట్ 27 : వివాహ బంధంలో భార్యపై భర్త ఆధిపత్యం చెలాయించకూడదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. భార్య ఇంటి పనులు చేయాలి, అత్తమామలను తప్పనిసరిగా చూసుకోవాలి, పుట్టింటికి వెళ్లాలంటే భర్త అనుమతి తీసుకోవాలనే నిబంధన ఏదీ లేదని పేర్కొంది. జస్టిస్ చిల్లకూరు సుమలత ధర్మాసనం ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళల వ్యక్తిగత స్వేచ్ఛ, ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన అవసరాన్ని కోర్టు తన తీర్పులో ప్రస్తావించింది. బెంగళూరు రూరల్ జిల్లాకు చెందిన సతీష్ అనే వ్యక్తి తన భార్య, కుమార్తెకు కుటుంబ న్యాయస్థానం నెలకు రూ.9,000 చొప్పున భరణం చెల్లించాలని ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించాడు. తన భార్య ఇంటి పనులు చేయడం లేదని, తన తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదని, తన అనుమతి తీసుకోకుండానే తరచూ పుట్టింటికి వెళ్తోందని అతడు పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ వాదనలపై కోర్టు తీవ్రంగా స్పందించింది. భర్త ఆరోపణలను పరిశీలిస్తే భార్యను కుటుంబ సభ్యురాలిగా కాక ఇంటి పనుల కోసం ఉంచుకున్న వ్యక్తిగా భావిస్తున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. భార్య తన తల్లిదండ్రులను కలవడానికి పుట్టింటికి వెళ్లాలంటే భర్త లేదా అత్తమామల అనుమతి తీసుకోవాలనే ఆలోచనను కోర్టు ప్రశ్నించింది. ఒక మహిళ తన తల్లిదండ్రులను కలవడానికి ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. భార్య ఎక్కడికి వెళ్లాలి, ఎవరిని కలవాలి అనే విషయాలను పూర్తిగా భర్త నియంత్రించడం సరైన పద్ధతి కాదని కోర్టు పేర్కొంది. ఇలాంటి ఆంక్షలు మహిళ వ్యక్తిగత స్వేచ్ఛను దెబ్బతీసే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఇంటి పనులన్నీ భార్యే చేయాలనే భావన సరికాదని కూడా స్పష్టం చేసింది. కుటుంబ జీవితంలో భార్యాభర్తలు ఇద్దరూ బాధ్యతలను పరస్పరం పంచుకోవాలని పేర్కొంది. వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత ప్రధానంగా వారి సొంత పిల్లలపై ఉంటుందని తెలిపింది. అత్తమామలను చూసుకోవడాన్ని కోడలిపై తప్పనిసరి బాధ్యతగా మోపడం సమంజసం కాదని స్పష్టం చేసింది. కోడలు అత్తమామలకు సేవ చేయడం ఆమె ఇష్టంతో జరగాలి తప్ప బలవంతం చేయడం సరికాదని పేర్కొంది. వివాహ బంధం కొన్ని ఆచారాలు, సంప్రదాయాలతో ఏర్పడే సంబంధం కాదని, పరస్పర గౌరవం, నమ్మకం, సమానత్వంతో కొనసాగాల్సిన బంధమని కోర్టు వ్యాఖ్యానించింది. భార్యాభర్తల మధ్య ప్రేమ, నమ్మకం, పరస్పర గౌరవం, సహకారం ఉండాలని తెలిపింది. లింగం ఆధారంగా మహిళల స్వేచ్ఛను పరిమితం చేయడం రాజ్యాంగం అందించే సమానత్వ సూత్రాలకు విరుద్ధమని అభిప్రాయపడింది. భార్య, కుమార్తెకు రోజుకు రూ.150 చొప్పున కూడా భరణం చెల్లించలేనని భర్త చేసిన అభ్యర్థనను కోర్టు కొట్టివేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




