‘స్థానిక’ ఎన్నికలు ఎప్పుడో చెప్పండి

– ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌కు హైకోర్టు ప్ర‌శ్న‌
– గడువు కోరడంతో విచారణ రెండు వారాలకు వాయిదా

హైదరాబాద్‌, అక్టోబర్‌ 17: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తాజాగా హైకోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది. రీ నోటిఫికేషన్‌ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ పిటిషన్‌ దాఖలైంది. సుప్రీంకోర్టు ఈసీ నోటిఫికేషన్‌ను సస్పెండ్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ న్యాయవాది సురేందర్‌ పిటిషన్‌ వేశారు. దీనిపై శుక్రవారం అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. వాదనలు విన్న హైకోర్టు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌ను ప్రశ్నించింది. సమాధానం చెప్పేందుకు రెండు వారాల సమయం ఇవ్వాలని న్యాయస్థానాన్ని ప్రభుత్వం, ఈసీ కోరాయి. ఇందుకు హైకోర్టు అంగీకరించి రెండు వరాల సమయం ఇస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హోకోర్టు కొట్టివేయడంతో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ను సస్పెండ్‌ చేస్తూ స్టేట్‌ ఎలక్షన్‌ కమిషన్‌ ఈ నెల 9న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే నోటిఫికేషన్‌ను సస్పెండ్‌ చేయడాన్ని సవాలు చేస్తూ సురేందర్‌ అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జీవో 9 ప్రకారమే ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయగా హైకోర్టు ఆ జీవోపై స్టే విధించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించగా ఎస్‌ఎల్‌పీని కొట్టివేసి మెరిట్స్‌ ప్రకారం కేసు విచారించాలని హైకోర్టుకు సూచించడంతో రిజర్వేషన్ల పంచాయితీ అగమ్యగోచరంగా మారింది. దీంతో స్థానిక ఎన్నికల పక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. అటు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాకపోతే పార్టీపరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు సుప్రీంకోర్టు కూడా ఎన్నికలకు వెళ్లమని గురువారం చెప్పింది కదా అంటూ వ్యాఖ్యానించింది. ఎన్నికలు పెట్టుకోవచ్చని ఓరల్‌గా మాత్రమే చెప్పిందని.. ఆర్డర్‌లో ఎక్కడా చెప్పలేదని ఎలక్షన్‌ కమిషన్‌ తరఫు న్యాయవాది అన్నారు. రిజర్వేషన్లను మరోసారి రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేయాల్సి ఉందని, ఈమేరకు ప్రభుత్వానికి లేఖ కూడా రాశామని, సమాధానం వచ్చిన తర్వాత తదుపరి చర్యలు చేపడతామని ఎన్నికల సంఘం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page