- జిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రహదారులు, కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి చర్యలు
- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి
కొత్తగూడెం, ప్రజాతంత్ర, నవంబర్ 25 : రాష్ట్రంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను అభివృద్ధి పరంగా ఆదర్శంగా నిలపడంతో పాటు ధనిక జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం కొత్తగూడెంలో పర్యటనలో భాగంగా మొదట నందతండా నుంచి వికలాంగుల కాలనీ వరకు నిర్మిస్తున్న బిటి రోడ్డు పనులకు ఆయన కొత్తగూడెం, భద్రాచలం ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, తెల్లం వెంకటరావులతో కలిసి ప్రారంభించారు. అనంతరం రూ 1.50 కోట్లతో కొత్తగూడెంలో నిర్మాణం చేసిన గ్రంథాలయ నూతన భవనాన్ని ప్రారంభించారు. అక్కడ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రంథాలయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
గ్రంథాలయాల్లో ప్రధానంగా సమకాలిక అంశాలకు సంబంధించిన పుస్తకాలతో పాటు గత చరిత్ర తెలిపేలా పోటీ పరీక్షలకు అవసరమయ్యే పుస్తకాలను అందుబాటులో ఉంచడం వల్ల విద్యార్థులు, అభ్యర్థులకు ప్రయోజనం చేకూరుతుందని ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 600 గ్రంథాలయాలను పునరుద్ధరించాలని వాటిలో అవసరమైన పుస్తకాలతో పాటు ఫర్నిచర్, మౌలిక వసతులను సమకూర్చాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని వనరులకు నిలయంగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విద్యా రంగానికి ప్రాధాన్యతనిస్తూనే, వైద్యం, రహదారుల ఏర్పాటు వంటి పనులకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. ఏజెన్సీ జిల్లా అయినందున ప్రత్యేక దృష్టితో గతంలో రెసిడెన్షియల్ పాఠశాలలు, గురుకుల పాఠశాలల ఏర్పాటు కోసం తన వంతు కృషి చేశానని తెలిపారు.
గతంలో భద్రాద్రికి అమరావతి నుంచి భద్రాచలం మీదుగా జగదల్‌పూర్ వరకు జాతీయ రహదారిని ఏర్పాటు చేశామని,మరో జాతీయ రహదారిని కొత్తగూడెం నుంచి ఇల్లందు మీదుగా హైదరాబాద్‌కు త్వరలోనే అందుబాటులోకి తెనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పాండురంగాపురం నుంచి సారపాక వరకు రైల్వే లైన్ ఏర్పాటు కోసం కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళ్లి ఒత్తిడి తీసుకొస్తున్నామని అది కార్యరూపం దాల్చుతే దక్షిణ అయోధ్య భద్రాచలం నుంచి ఉత్తర భారతదేశానికి అనుసంధానం ఏర్పడే అవకాశం ఉందన్నారు.
కొత్తగూడెంలో ఎయిర్ పోర్టు
రాష్ట్ర ప్రభుత్వం మామునూరు, ఆదిలాబాద్, కొత్తగూడెంలలో ఎయిర్ పోర్ట్‌ల ఆలోచన చేస్తుందని దీనికి సంబంధించి కొత్తగూడెంలో ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేపడితే సింగరేణి, బీటీపీఎస్, నవభారత్, ఐటీసీ,హెవీవాటర్ ప్లాంట్ వంటి పరిశ్రమలు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో ఎక్కువ ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. దీని విషయంలో స్థల పరిశీలన సంబంధించిన ప్రతిపాదనలను కేంద్రానికి పంపించడం జరిగిందన్నారు. అదేవిధంగా పోలవరం పూర్తయితే నావిగేషన్ విభాగంలోనూ ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, గోదావరిని నౌకాయానికి ఉపయోగించుకుంటే అతి తక్కువ ధరలకే ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యం అందుబాటులోకి వొస్తుందని తెలిపారు. కొత్తగూడెం బైపాస్ రోడ్డు విషయంలో కొంత గ్యాప్ ఏర్పడిందని, రోడ్లు భవనాలశాఖ మంత్రితో మాట్లాడుతానని చెప్పారు. కొత్తగూడెం రింగు రోడ్డు కోసం రూ 400 కోట్ల మంజూరు చేయించామని దానికి కూడా డిపిఆర్ పూర్తి చేసి టెండర్లకు వెళ్లాలని ఆదేశించినట్లు మంత్రి చెప్పారు.
రైతులు ఆయిల్ పామ్ సాగు చేయాలి
రైతులు ఇతర పంటలు వేయడం ద్వారా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వాటి నుంచి బయట పడాలంటే తప్పకుండా ఆయిల్ పామ్ పంటను ఎంచుకోవాలని సూచించినట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలోనే జిల్లాలో ఎక్కువ ఆయిల్ ఫామ్ పంటను సాగు చేస్తున్నారని ఈ పంటను సాగు చేస్తున్న రైతులు సుఖసంతోషాలతో ఉన్నారని చెప్పారు. కొత్తగూడెంలో ఆయిల్ ఫామ్ రైతుల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఫర్ ఆయిల్ ఫామ్ ఇన్ స్టిట్యూషన్ కొత్తగూడెం గరిమెళ్లపాడులో ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పాల్వంచకు సైతం మరొక బైపాస్ రోడ్డును మంజూరు చేశామని, దానికి కూడా త్వరలో టెండర్లు పిలిచి పనులు చేపడతామన్నారు. కొత్తగూడెంను తప్పకుండా కార్పొరేషన్‌గా ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కార్యాలయంలో దీనిపై మాట్లాడామని దానిపై సుముఖంగా వ్యక్తం చేసినట్లు మంత్రి తుమ్మల పేర్కొన్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారుల సహాయ సహకారాలతో జిల్లాను అభివృద్ధిలో అగ్రభాగంలో నిలపాలన్నదే ధ్యేయంగా పనిచేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయాల చైర్మన్ రియాజ్, జిల్లా ఎస్పీ రోహిత్‌రాజు, అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్ కాపు సీతాలక్ష్మీ, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.