ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పెరిగిన చలి
పలుచోట్ల 10 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 25: తెలంగాణలో చలి తీవ్రత బాగా పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో 10 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నట్టు తెలుస్తోంది. ఏపీలో వర్షాలు పడే అవకాశం ఉన్నప్పటికీ తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదని అంటున్నారు. హైదరాబాద్‌లో కూడా చలి పులి భయపెడుతోంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు రెండూ దారుణంగా పడిపోయాయి. రాత్రి చలి వొణికిస్తుంటే ఉదయం పొగమంచు మరింత భయపెడుతోంది. వాహనదారులు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. చలి, పొగమంచు కారణంగా కాలుష్య తీవ్రత కూడా హైదరాబాద్‌లో విపరీతంగా పెరిగిపోయింది.
కాగా తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్షావరణం ఉంటే తెలంగాణలో మాత్రం ఎముకలు కొరికే చలి ఇబ్బంది పెడుతోంది. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం చలి తీవ్రత పెరిగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుంది. అనంతరం ఇది వాయవ్య దిశగా కదులుతుంది. తమిళనాడు శ్రీలంక తీరం వైపునకు వెళ్లి అక్కడ మరింత బలపడబోతోంది. ప్రస్తుత అల్పపీడన ప్రభావం కొంత వరకు కోస్తా ఆంధ్రపై కనిపిస్తోంది. ఆకాశం మబ్బులు పట్టి ఉంది. ఇది వాయుగుండంగా మారితే బుధవారం నుంచి శనివారం వరకు వివిధి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. శ్రీలంక సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్న అల్పపీడనం దక్షిణ కోస్తాపై ప్రభావం చూపబోతోంది. ఈ సాయంత్రం నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి.