పర్యాటక ప్రభ పెంచుదాం

– హైదరాబాద్‌లో భారీ స్థాయిలో కార్నివాల్ నిర్వహణ
– పర్యాటక కేంద్రాల్లో వీకెండ్‌లో సాంస్కృతిక ప్రదర్శనలు
– పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధికి కార్యాచరణ రూపొందించాలి
– అధికారులకు మంత్రి జూపల్లి దిశానిర్దేశం

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : దేశంలోనే అగ్రగామి పర్యాటక గమ్యస్థానంగా రాష్ట్రం ఎదిగేందుకు అత్యంత అనువైన ప్రాంతమని, ఆ దిశగా పర్యాటక రంగానికి కొత్త కళ తీసుకురావాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. మౌలిక వసతుల కల్పన, గమ్యస్థానాల బ్రాండింగ్, విస్తృత ప్రచార కార్యక్రమాలకు సంబంధించి నిర్దిష్ట కాలపరిమితితో కూడిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు. బేగంపేటలోని టూరిజం ప్లాజాలో మంగళవారం నిర్వహించిన పర్యాటక సలహా కమిటీ/మండలి సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని వారసత్వ సంపద, సంస్కృతి, అద్భుతమైన కట్టడాలు, ప్రకృతి రమణీయ ప్రదేశాలు, జల వనరులు, దట్టమైన అడవులు, ఆధ్యాత్మిక కేంద్రాలను సమన్వయం చేస్తూ తెలంగాణను ఒక శక్తివంతమైన పర్యాటక హబ్‌గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పర్యాటక ప్రాంతాల్లో సందర్శకులకు కనీస సౌకర్యాల కల్పనలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో వెల్లడైన ప్రతిపాదనలపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలని, అమలు ప్రక్రియలో జాప్యం జరగకుండా నిర్దిష్ట పని లేదా ప్రాజెక్టు బాధ్యతను పర్యవేక్షించడానికి నోడల్ అధికారికి అప్పగించాలని సూచించారు. దేశీ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు నవంబరు లేదా డిసెంబరులో హైదరాబాద్‌లో భారీస్థాయిలో కార్నివాల్ నిర్వహణకు అధ్యయనం చేయాలని, సాధ్యమైనంత త్వరగా పత్రిపాదనలు రూపొందించి సమర్పించాలని చెప్పారు. ప్రారంభంలో ప్రభుత్వమే చేపట్టినా భవిష్యత్తులో ప్రైవేటు భాగస్వామ్యంతో స్వయంసమృద్ధిగా సాగేలా చూడాలన్నారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ సమన్వయంతో నగర సుందరీకరణలో భాగంగా శిల్పాలు, ఆకర్షణీయమైన ల్యాండ్‌స్కేపింగ్, స్కై వాక్‌లను సృజనాత్మక ఉట్టిపడేలా తీర్చిదిద్దాలని సూచించారు. రాష్ట్రంలోని సోమశిల, వరంగల్, రామప్ప, యాదాద్రి, గోల్కొండ, తారామతి బరాదరి, నాగార్జునసాగర్ వంటి కీలక పర్యాటక ప్రాంతాల్లో అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రధాన పర్యాటక కేంద్రాల్లో క్రమం తప్పకుండా వారాంతపు సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేశారు. స్పెషల్ సీఎస్ వాణిప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో అద్బుతమైన పర్యాటక ప్రదేశాలు, వనరులు ఉన్నప్పటికీ ప్రచారంలో వెనుకబడి ఉన్నామని, దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. మరుగుదొడ్ల నిర్మాణం, కారవాన్ కోసం ఇప్పటికే ప్రతిపాదనలు ఆహ్వానించామని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న హరిత హోటళ్ల నిర్మాణం పూర్తికి చర్యలు తీసుకోవాలని, వారసత్వ కట్టడాల నిర్వహణ కోసం ‘ఆగాఖాన్‌’ మోడల్‌లో ట్రస్టులను ఏర్పాటు చేయాలని సూచించారు. అంతర్జాతీయ స్థాయిలో వెడ్డింగ్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దడంతోపాటు మెడికల్, వెల్నెస్, గోల్ఫ్, ఫిలిం, ఎకో టూరిజం కేంద్రంగా ప్రచారం చేయాలని కమిటీ సభ్యులు సమావేశంలో ప్రతిపాదించారు. ముఖ్యంగా మధ్యప్రాచ్యం, సెంట్రల్ ఆసియా మార్కెట్లలో విస్తృత మార్కెటింగ్ కార్యక్రమాలు చేపట్టాలని కమిటీ సభ్యులు నొక్కి చెప్పారు. పర్యాటక రంగంలో పెట్టుబడులను ఆకర్షించేలా ఇన్వెస్టర్ అవుట్ రీచ్ కార్యక్రమాలు చేపట్టాలని, ప్రాజెక్టుల అమలులో వేగం పెంచాలని సూచించారు. పర్యాటక ప్రదేశాలను అద్బుత కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు చైనా, వియత్నాం వంటి దేశాల్లో అధ్యయన పర్యటనలు చేపట్టాలని, జైపూర్ సిటీతో పోటీ పడేలా హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాలను వెడ్డింగ్ డెస్టినేషన్స్‌గా తీర్చిదిద్దడం, కేరళ తరహాలో ప్రకృతి ఉత్పత్తులు, సంస్కృతిని ప్రోత్సహించేందుకు ప్రణాళికలు రూపొందించడం, ఈత, తాటి కల్లు, ఇతర ఉప ఉత్పత్తులను ప్రోత్సహిస్తూనే బ్రాండింగ్ చేయడం, వారసత్వ విధానం ఉండాలని సూచించారు. విదేశీయుల కంటే భారతీయులే పర్యాటకానికి ఎక్కువ ఖర్చు చేస్తారు, కాబట్టి స్వదేశీ పర్యాటకంపై దృష్టిపెట్టి తెలంగాణ పర్యాటక ప్రమోషన్, బ్రాండింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించి ప్రచారానికి నిధులు కేటాయించాలన్నారు. మధ్యప్రాచ్యం (మిడిల్ ఈస్ట్) నుండి పర్యాటకులను ఆకర్షించడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని ప్రతిపాదించారు. వరంగల్, సోమశిల వంటి ప్రాంతాల్లో ప్రైవేట్ భాగస్వామ్యంతో 3 నుండి 5 స్టార్ హోటళ్లను నిర్మించడం, బమ్మెరలో పోతన స్మృతి వనం నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, వరంగల్ హరిత హోటల్ నుంచి రామప్ప వరకు బస్సు సర్వీసులు నడపాలని సభ్యులు సూచించారు. సమావేశంలో పర్యాటక అభివృద్ధి సంస్థ మెనేజింగ్ డైరెక్టర్ గౌతమి, డైరెక్టర్ ఆఫ్ టూరింజం లక్ష్మణ్ రంజిత్ నాయక్, కమిటీ సభ్యులు పాపారావు, కమలవర్ధన్ రావు, డాక్టర్ బాలాజీ, జుల్ఫీ, మార్గ్ పటేల్, రాందేవ్‌రావు, తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *