– ప్రాజెక్టు పూర్తి సమాచారాన్ని ముందే బహిర్గతం చేయాలి
– ‘నదీ పునరుజ్జీవం’ ముసుగులో నదుల కాంక్రీటీకరణకు వ్యతిరేకం
– కేబినెట్ సబ్ కమిటీకి ఎంజేఏ లేఖ
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం చేపట్టే ఏవైనా సంప్రదింపులు అర్థవంతంగా ఉండాలంటే ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ముందుగా బహిరంగపరచాలని మూసీ జనాందోళన్ వేదిక(ఎంజేఏ) డిమాండ్ చేసింది. ప్రభుత్వం ప్రాజెక్టు వివరాలను వ్యూహాత్మక రహస్యంగా ఉంచుతున్నంత కాలం ప్రజాస్వామ్యబద్ధమైన చర్చలు జరగడం అసాధ్యమని, అందుకే అన్ని దశల డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్, మురుగునీటి నిర్వహణ ప్రణాళికలు, వరద నియంత్రణ వ్యూహాలు, పర్యావరణ ప్రభావ అంచనా రికార్డులను, జీవో 921 (తేది 16/12/25) ప్రకారం భూసేకరణ కోసం 10,017 నిర్మాణాలు, 3,279 ఎకరాల భూమిని గుర్తించడానికి వినియోగించిన వ్యూహాలు ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ప్రస్తుత ప్రాజెక్టు నమూనా పర్యావరణ పునరుద్ధరణ కంటే వాణిజ్యపరమైన కాంక్రీట్ కట్టడాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తోందని, దీనివల్ల మొదటి రెండు దశల్లోనే దాదాపు 12 వేల కుటుంబాలు నిరాశ్రయులయ్యే ప్రమాదం ఉందని ఎంజేఏ ఆందోళన వ్యక్తం చేసింది. భూసేకరణ, పునరావాస చట్టం(ఎల్ఏఆర్ఆర్ చట్టం 2013) ప్రకారం తప్పనిసరి ‘సామాజిక ప్రభావ మదింపు (ఎస్‌ఐఏ) చేయాలి. కానీ ఎస్‌ఐఏ నుండి ప్రాజెక్టుకు మినహాయింపునిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ నం.921ని ఎంజేఏ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 2017లో రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఏఆర్ఆర్ చట్టం 2013లో చేసిన తిరోగమన సవరణను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేసింది. కాలుష్య నియంత్రణ లేకుండా కేవలం రివర్‌ఫ్రంట్ నిర్మించడం వల్ల వరద ముప్పు పెరుగుతుందని, ఇది శాస్త్రీయంగా, రాజకీయంగా తప్పు అని పేర్కొన్నది. ఈ సమగ్ర నివేదికను సమర్పించి పది రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుండి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదుని తెలిపింది. కేబినెట్ సబ్-కమిటీ త్వరలోనే స్పందించి తమ విజ్ఞాపనలో పేర్కొన్న సమాచారం, పత్రాలన్నింటినీ బహిరంగం చేస్తుందని ఆశిస్తున్నట్లు ఎంజేఏ తెలిపింది. వాటిని విశ్లేషించిన అనంతరం తమ ఆందోళనలు, సూచనల గురించి కమిటీని కలిసి వివరించడానికి తాము మరింత మెరుగైన స్థితిలో ఉంటామని మూసీ జన ఆందోళన్ ప్రతినిధులు పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



