– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24 : ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులు ఎవరూ అధైర్యపడి ఆత్మహత్యల వంటి కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని కోరుతున్నానన్నారు. ఏ సమస్యకైనా ప్రాణం తీసుకోవడం పరిష్కారం కాదని చెప్పారు. మీ హక్కుల కోసం, మీ భవిష్యత్తు కోసం తాము నిరంతరం పోరాడతామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నానని, బాధిత కుటుంబ సభ్యులకు బీజేపీ పక్షాన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు రామచందర్ రావు పేర్కొన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకుండా తీవ్ర అన్యాయం చేస్తున్నదని, సమ్మెను పరిష్కరించకుండా కమిటీల పేరుతో కాలయాపన చేయడం ద్వారా ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. సమ్మె నేపథ్యంలో ముగ్గురు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడడం ఎంతో కలచివేసే విషయమని,. ముఖ్యంగా ఆత్మహత్యాయత్నం చేసిన డ్రైవర్ కోల శంకర్ గౌడ్ చికిత్స పొందుతూ మరణించడం అత్యంత బాధాకరమని అన్నారు. కాంగ్రెస్ సర్కారు ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చకపోవడం, సమస్యలను పరిష్కరించకపోవడం వల్లే ఈ దారుణ పరిస్థితి ఎదురైందన్నారు. ఆర్టీసీ కార్మికులు ముందుగానే ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం అత్యంత దురదృష్టకరం, బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు సమ్మెకు దిగినప్పుడు బీజేపీ కార్మికుల పక్షాన నిలబడి పోరాటం చేసిందన్నారు. 2017 నుంచి ఆర్టీసీ కార్మికులకు పీఆర్సీ బకాయిలు చెల్లించకపోవడం, రిటైర్డ్ ఉద్యోగులకు రావలసిన బెనిఫిట్స్ ఇవ్వకపోవడం కూడా ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. పలు రాష్ట్రాల్లో ఇలాంటి చర్యలు ఇప్పటికే అమలు చేసిన విషయం తెలిసిందేనన్నారు. కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే శంకర్‌గౌడ్ కుటుంబానికి తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సమాజం మొత్తం ఈ పోరాటంలో కార్మికుల పక్షాన నిలుస్తోందన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




